ఈద్‌ ముబారక్‌ | ramzan special story | Sakshi
Sakshi News home page

ఈద్‌ ముబారక్‌

Published Sat, Jun 24 2017 11:50 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

ఈద్‌ ముబారక్‌ - Sakshi

ఈద్‌ ముబారక్‌

ప్రాచీనకాలంనుండి ప్రతి దేశంలో, ప్రతిజాతిలో పండుగల సంప్రదాయం ఉంది. మానవులకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, వ్యక్తిగతంగా కాని, సామూహికంగా కాని ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకొచ్చి బహిర్గతమవుతుంది. ఇది చాలా సహజమైన విషయం. అలాంటి మానవ సహజ భావోద్రేక ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు, పబ్బాలు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే.

‘రమజాన్‌’ పేరు వినగానే అందరికీ సేమియా, షీర్‌ ఖుర్మాలే గుర్తుకు వస్తాయి. పట్టణ వాసులకైతే దీంతోపాటు ‘హలీమ్‌’ ‘హరీస్‌’ లాంటి వంటకాలు కూడా నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లిములు ఇంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులపాటు నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో, ఆరాధనా భావతరంగాల్లో తేలియాడుతూ జరుపుకునే ముగింపు ఉత్సవం. ఈ నెలరోజులూ ముస్లిముల ఇళ్ళు, వీధులన్నీ సేమియా, షీర్‌ ఖుర్మా, బగారా, బిరియానీల ఘుమఘుమలతో, అత్తరుపన్నీర్ల పరిమళంతో, ఉల్లాసపరవళ్ళ హడావిడితో అలరారుతుంటాయి. సహెరి, ఇఫ్తార్‌ల సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. విశ్వాసులందరూ పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు. ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాల సమ్మేళనాన్నే ‘పండుగ’ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ, అపురూప సందర్భమే ‘ఈదుల్‌ ఫిత్ర్‌’. అదే రమజాన్‌ పండుగ.

అసలు రమజాన్‌ అన్నది పండుగ పేరేకాదు. అదొక నెలపేరు. సంవత్సరంలోని పన్నెండునెలల్లో తొమ్మిదవది రమజాన్‌. అయితే దైవం పవిత్రఖురాన్‌ లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింపజేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన ‘రోజా’ను విధిగా చేయడానికి ఈ నెలను ఎన్నుకున్నాడు. అందుకే దీనికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్, రోజాలతో ఈనెలకు విడదీయలేని అనుబంధం ఉంది.

రమజాన్‌ నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాసదీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటుసాగి షవ్వాల్‌ చంద్రవంక దర్శనంతో ముగుస్తాయి. ‘షవ్వాల్‌’ మొదటితేదీన జరుపుకునే పండుగే ‘ఈదుల్‌ ఫిత్ర్‌’. ఈ పండుగ సంబంధం రమజాన్‌ నెలతో ముడివడి ఉండడంతో సాధారణంగా ప్రజలు దీన్ని రంజాన్‌ పండుగ అని కూడా వ్యవహరిస్తారు.

పండుగరోజు ముస్లిములందరూ పెందలకడనే లేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్‌ నమాజు ఆచరిస్తారు. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు లాంటి సుగంధ పరిమళం వినియోగించి, ఆనందోత్సాహాలతో ఈద్‌ గాహ్‌కు వెళతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజా వ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనంకోసం, సాఫల్యంకోసం పవిత్రఖురాన్‌ గ్రంథాన్ని అవతరింపజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ రెండు రకతులు నమాజ్‌ చేస్తారు. తరువాత ఇమామ్‌ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలిసి అల్లాహ్‌ గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, తమకుటుంబంకోసం, బంధుమిత్రులకోసం, తమదేశంకోసం, దేశవాసుల సుఖసంతోషాలకోసం, యావత్‌ ప్రపంచ శాంతి సంతోషాలకోసం ఆయన్ని ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు.

పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపివంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచిచూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్‌ ముబారక్‌ ’అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకారగుణాన్ని, సహనం, త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్యవాతావరణాన్ని సృజిస్తుంది. కనుక రమజాన్‌ స్పూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెల్లాళ్ళ శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్ళీ రమజాన్‌ వరకు ఈ తీపిఅనుభూతులు మిగిలి ఉండాలి. అల్లాహ్‌ సమస్తమానవాళినీ సన్మార్గంలో నడిపించాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్‌  ప్రపంచం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం.
(రేపు ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం సందర్భంగా...) – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement