ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నో రెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. భగవత్ ఆశీస్సులు అందించే పవిత్ర రంజాన్ కోసం ముస్లింలు సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెల పొడుపు కనిపిస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ప్రారంభవుతుందని, మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు.
రోజా (ఉపవాస దీక్ష) పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు(సహర్) నుంచి సూర్యాస్తమయం(ఇఫ్తార్) వరకు ఉపవాసదీక్షలు పాటిస్తారు. రోజుకు ఐదుపూటల నమాజు చేస్తారు. దీనికి అదనంగా రాత్రి 8.30 నుంచి 10గంటల వరకు సాగే ‘తరావీహ్’ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారు.
దానధర్మాలకు ప్రాధాన్యం: రంజాన్ మాసాన్ని దివ్య ఖురాన్ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తారు. ఈ నెలలో ‘సఫిల్’ చదివితే ‘ఫరజ్’ చదివినంతగా... అంటే 70సార్లు నమాజ్ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఈ మాసంలో ముస్లింలు దానధర్మాలకు (జకాత్, ఫిత్రాకు) ప్రాధాన్యతనిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలని నియమం.
హలీం రుచులు సిద్ధం: రంజాన్ మాసంలో లభించే ప్రత్యేక వంటకం హలీం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వరకే పరిమితమైన హలీం దశాబ్ద కాలంగా ఆంధ్రాలోని అన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో పెద్ద ఎత్తున రంజాన్ స్పెషల్ హలీం విక్రయాల కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
మానవులను సంస్కరించే మాసం
మానవులను సంస్కరించి మంచి మార్గంలో పయనింపజేసేందుకు రంజాన్ మాసం దోహదపడుతుంది. మానవులు ఏ విధంగా నడుచుకోవాలి, దైవం, సమాజం పట్ల ఎటువంటి బాధ్యతలను నిర్వర్తించాలనే అంశాలను కూడా ఈ మాసం తెలియజేస్తుంది. మానవాళికి సర్వశుభాలను చేకూరుస్తుంది. – షేక్ ఆసిఫ్, చైర్మన్, ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment