Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్‌లు | 10 Lakh Biryanies 4 Lakh Haleem Order in Swiggy | Sakshi
Sakshi News home page

Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్‌లు

Published Sat, Apr 22 2023 3:09 AM | Last Updated on Sat, Apr 22 2023 7:10 AM

10 Lakh Biryanies 4 Lakh Haleem Order in Swiggy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంజాన్‌ మాసంలో హైదరాబాదీలు అభి‘రుచి’తీరా పండుగ చేసుకున్నారు. తరచూ తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్‌ హలీమ్, మిఠాయి వంటకాల దాకా భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే 20% ఎక్కువగా తెప్పించుకుని తిన్నారు.

గురువారం స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క యాప్‌ ద్వారానే ఇంత ఫుడ్‌ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని నగరవాసులు చెప్తున్నారు. 

హలీమ్‌కు గులామ్‌.. 
రంజాన్‌ మాసంలో ఎప్పటిలాగే హలీమ్‌ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్‌ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్‌ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్‌ హలీమ్‌ ఉన్నా బిర్యానీకి క్రేజ్‌ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్‌ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్‌ చేశారని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని వెల్లడించింది. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్‌ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్‌ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయి. 

మరిన్ని వంటకాలకూ డిమాండ్‌ 
రంజాన్‌ సందర్భంగా మల్పువా, ఫిర్నీ, రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్‌ పెరిగింది. ఈ స్పెషల్‌ ఐటమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు 20% పెరిగాయని స్విగ్గీ తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్‌ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది. 

రుచులకు చిరునామాలివీ.. 
హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్‌ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్‌ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement