హలీమ్.. ఈ పేరు వినగానే జిహ్వ జివ్వుమంటుంది. నోరు రసార్ణవమవుతుంది. లాగిస్తుంటే మరింత లాగించాలనిపిస్తుంది. రుచుల సంగమానికి చిరునామా ఇది. మధుర పదార్థాల మేళవింపు ఇది. బలవర్ధక, పోషకాల పోహళింపు ఇది. కులమతాలకు అతీతంగా ఆనందంగా ఆరగించే అరుదైన వంటకం ఇది. హైదరాబాద్ హలీమ్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. సినీ తారల నుంచి సామాన్యుల దాకా.. క్రికెట్ స్టార్ల నుంచి గల్లీ ఆటగాళ్ల దాకా.. అమాత్యుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల దాకా.. ఎంపీలు.. ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్ల దాకా.. ఇలా ఒకరేమిటి ఎందరో.. ఎందరెందరో హలీమ్ ప్రియులే. కుటుంబ సభ్యులతో రాత్రిపూట పాతబస్తీకి వచ్చి హలీమ్‌ను ఆనందంగా ఆరగిస్తూ సరదాగా గడుపుతారు. ఇది ఒకవైపు.. మరోవైపు ప్రస్తుతం కరోనా మహమ్మారి నగరాన్ని వణికిస్తోంది. హలీమ్ ఘుమఘుమల మధురిమలకు లాక్‌డౌన్ చెక్ పెట్టింది. విందుకు, బహు పసందుకు ఈసారి నోచుకోని పరిస్థితి నెలకొంది. రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని చెప్పడంతో హలీమ్ తయారీదారులు వెనుకడుగు వేశారు. ఇది వేలాదిమంది ఉపాధిపై ప్రభావం చూపనుంది. కోట్లాది రూపాయల వ్యాపారం కుదేల్ కానుంది.
చార్మినార్: హలీమ్ పర్షియా వంటకం. కుతుబ్‌షాహిల కాలంలో మనకు పరిచయమైందీ వంటకం. ప్రస్తుతం ఇరానీయులు సైతం పాతబస్తీ హలీమ్ కోసం ఆరాటపడుతుంటారు. నగరంలోని పలువురు సినీ నటులు, క్రికెట్ స్టార్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ కుటుంబ సభ్యులతో రాత్రిపూట పాతబస్తీకి వచ్చి హలీమ్ తినేందుకు వస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న హైదరాబాద్ హలీమ్‌పై కోవిడ్–19 ప్రభావం పడింది. రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు తదితర కార్యక్రమాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేయడంతో హలీమ్ తయారీ నిలిపివేయాలని నిర్వాహకులు భావించారు. ప్రస్తుతం నగరంలో హలీమ్ తయారీ నిలిచిపోతుండటంతో ఇక దేశంలోని ఢిల్లీ, కలకత్తా, ముంబై, పుణె, బెంగళూర్, త్రివేండ్రం, కోయంబత్తూర్, చెన్నై, విజయవాడ తదితర నగరాలకు ఈసారి పాతబస్తీ నుంచి హలీమ్ సరఫరా ఉండదు. ప్రతి రంజాన్ మాసంలో దేశంలోని అన్ని మెట్రో నగరాలకు పాతబస్తీ నుంచి హలీమ్ ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి ఈ నగరాలకు కూడా హైదరాబాద్ హలీమ్ అందుబాటులో ఉండదు. అంతేగాకుండా స్విగ్గీ, జోమాటో తదితర ఆన్‌లైన్ డెలివరీలు కూడా ఉండవు.
కార్మికుల జీవనోపాధిపై ఎఫెక్ట్
కోట్లాది రూపాయల వ్యాపారం దెబ్బతింటోంది. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోనున్నారు. దీని ప్రభావం అన్ని అనుబంధ వ్యాపారాలపై పడనుంది. నెలరోజుల పాటు జంటనగరాల్లోని దాదాపు 4 వేల హోటల్స్‌లలో ఈ హలీమ్ తయారీ నిలిచిపోనుంది. రంజాన్ మాసంలోని నెల రోజుల పాటు మరో తాత్కాలిక ఉద్యోగాలను నిర్వహించే మరో లక్ష మందికి జీవనోపాధి కష్టకాలంగా మారనుంది. రంజాన్ మాసంలో తమ మేకపోతులు, మేకలకు మరింత డిమాండ్ ఉంటుందని తెలంగాణ జిల్లాలోని రైతులు ఆశపడుతుంటారు. హలీమ్ తయారీలో పొట్టేలు, మేక మాసం ఎక్కువగా వినియోగిస్తుండటంతో రంజాన్ మాసంలోని నెల రోజుల పాటు వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. హలీమ్ మేకర్స్ తమకు కావాల్సిన మాంసాన్ని స్లాటర్ హౌజ్‌ల నుంచి ఖరీదు చేసి హలీమ్ తయారు చేస్తుంటారు.
రోజంతా కఠోర ఉపవాస దీక్షలు
రంజాన్ మాసంలో రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్‌లో హలీమ్‌ను తింటారు. పోషక విలువలు అధికంగా ఉండే హలీమ్ తినడం ద్వారా శరీరంలో కేలరీలు పెరిగి వెంటనే శక్తి వస్తుంది. హలీమ్ తిన్న అనంతరమే బిర్యానీ, ఇతర పిండివంటలను ఆరగిస్తారు. దీంతో రంజాన్ మాసంలో హలీమ్‌కు ఎంతో గిరాకీ. పిస్తాహౌజ్ తయారు చేసే ప్రత్యేక హలీమ్ రుచి చూసేందుకు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహం చూపిస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం అమెరికా, దుబాయ్‌లలో పిస్తాహౌజ్ హోటల్స్ ఏర్పాటు చేసి అక్కడే హలీమ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన స్వచ్ఛమైన నేతి, పొట్టేలు మాంసంతో హలీమ్ తయారవుతుంది.
హలీమ్ తిని.. ఇఫ్తార్ ముగింపు
ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో నోరూరించే రంజాన్ వంటకాలను ఇష్టంగా తింటారు. పిండి వంటలు, శాఖాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. కర్జూరంతో ఉపవాస దీక్షలను వదిలి అన్ని రకాల పళ్లను తీసుకుంటారు. అనంతరం హలీమ్‌ను ఆరగిస్తారు. హలీమ్ తినందే.. ఇఫ్తార్ విందును ముగించరు. అందుకే హలీమ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది పిస్తాహౌజ్ హలీమ్‌లో బ్లాక్‌రైస్ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చింది. యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేసే బ్లాక్‌రైస్‌ను మొదటిసారి పిస్తాహౌజ్ యజమాన్యం 2019లో రంజాన్ మాసం సందర్భంగా హలీమ్‌లో వినియోగించారు. రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు బ్లాక్‌రైస్‌తో తయారు చేసిన హలీమ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా మారిందని పిస్తాహౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ మాజిద్ తెలిపారు.
ఇదీ స్పెషల్
♦ గత 40 ఏళ్లలో హలీమ్ తయారు చేయకపోవడం ఇదే తొలిసారి
♦ ఈ వంటకాన్ని వండేవారు సుమారు 6వేల మందికిపైగా..
♦ యూఎస్, యూరప్, గల్ఫ్ తదితర దేశాలకు యేటా ఎగుమతి
♦ దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల దాకా వ్యాపారం
♦ రంజాన్ సీజన్‌లో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు
♦ సిటీలో హలీమ్ ధర రూ.140– రూ.170 కొన్నిచోట్ల రూ.200పైనే
♦ జంట నగరాల్లో దాదాపు 4 వేల హోటళ్లలో నిలిపివేత
♦ నిర్ణయం తీసుకున్న సుమారు 22 హోటళ్ల యజమానులు
♦ 21 వస్తువులతో హలీమ్ తయారీ..
ఇలాచీ, దాల్చిని చెక్క, లవంగం, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, కాజు, వేయించిన ఉల్లిగడ్డ, కొత్తమీర తదితర 21 వస్తువులతో ఈ హలీమ్‌ను తయారు చేస్తారు. ఔషధ గుణాలు కలిగిన ఈ ముడిసరుకులను ఎక్కువగా కేరళ రాష్ట్రంతో పాటు ముంబై, ఢిల్లీ నగరాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా నాణ్యమైన షాజిరాను ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి తెప్పించుకుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ ప్రభావం కొనసాగుతుండటంతో హలీమ్ తయారీకి వినియోగించే ఈ 21 రకాల స్పైసీస్ సకాలంలో అందుబాటులో ఉండవని హలీమ్ మేకర్స్ ఉంటున్నారు. దిగుమతుల్లో చాలా ఆంక్షలు ఉండబోతున్న నేపథ్యంలో అవసరమైన మేరకు మసాల దినుసులు అందుబాటులో ఉండవని వ్యాపారస్తులు భావిస్తున్నారు. గోధుమలతో పాటు పొట్టేలు మాంసాన్ని డేక్చా నీటిలో ఉడక బెట్టి.. ప్రత్యేకంగా తయారు చేసిన పొడవాటి కర్రలతో గిలక్కొడతారు. గంటల తరబడి గోధుమలు, మాంసాన్ని మెత్తగా చేసిన అనంతరం మసాల దినుసులను వేసి గిలక్కొడతారు. ఇలా తయారైన మిశ్రమంలో నెయ్యి, కొత్తిమీర, వేయించిన ఉల్లిగడ్డలు వేసి వేడివేడిగా తయారు చేస్తారు.
తక్షణ శక్తి ఇచ్చే డ్రైఫ్రూట్స్, ఫలాలు
రోజంతా కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించే ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు. ఉపవాస దీక్షల అనంతరం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందులో తక్షణం శక్తినిచ్చే కర్జూరం, అంజీర్, కిస్‌మిస్, వాల్‌నట్, ఆక్రోట్, బాదం తదితర డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉండటమే కారుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు. తెల్లవారు జామున సహార్‌లో కోకోనట్ వాటర్‌లో బనానా మిక్స్ చేసుకుని తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను మెయింటన్ చేస్తాయంటున్నారు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర పూర్తిస్థాయి మినరల్స్ ఉంటాయంటున్నారు. ఇక సి విటమిన్ కోసం మోసంబీ, సంత్రా, ఉసిరి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సి విటమిన్ ఎంతో అవసరం అంటున్నారు.
సోషల్ డిస్టెన్స్..ముడిసరుకు కొరత..
సామాజిక దూరం, హలీమ్ తయారీ ముడిసరుకు కొరత తదితర కారణాలతో హలీమ్ తయారు చేసేందుకు హలీమ్ మేకర్స్ నిరాకరిస్తున్నారు. ప్రజల రక్షణ ముఖ్యమని, హలీమ్ ఖరీదు చేయడం కోసం ప్రజలు గుంపులుగా ఎగబడటం సామాజిక దూరం పాటించకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయని.. అందుకే ఈ ఏడాది హలీమ్ వంటకాలకు దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ మాజిద్, జంట నగరాల హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాఫర్ అజీజ్‌ల అధ్యక్షతన సోమవారం రాత్రి పాతబస్తీలో అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో జంటనగరాలకు చెందిన మేజర్ 22 హోటల్స్ యజమానులు, నిర్వాహకులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచేవి తీసుకోవాలి..
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారంతో పాటు తక్షణం శక్తినిచ్చే పండ్లు, ఫలాలు, డ్రైఫ్రూట్స్ విరివిగా తీసుకోవాలి. పొద్దంతా ఉపవాస దీక్షలో ఉండే వారి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ మెయింటనెన్స్ ఎంతో అవసరం. శరీరానికి అవసరమైన మినరల్స్ ఉండే పండ్లు, ఫలాలు ఉపవాస దీక్షలో ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయి. హలీం తినకపోయినా.. పర్వాలేదు.. కానీ పండ్లు, ఫలాలు అధిక మొత్తంలో తీసుకోవాలి. శరీరానికి సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ఉపవాస దీక్షలోని ప్రజలు ప్రయత్నించాలి.
– డాక్టర్ సురేందర్‌శర్మ, ఆయుర్వేద వైద్య నిపుణులు
రంజాన్ హలీం అంటే ఎంతో ఇష్టం..
హలీం అంటే ఎంతో ఇష్టం. రంజాన్ మాసంలో తయారయ్యే హలీం అంటే మహా ఇష్టం. ఏడాదికోసారి రంజాన్ మాసంలోనే హలీం తింటాం. రంజాన్ మాసంలోని హలీంకు అంత ప్రత్యేకత ఉంటుంది. రోజంతా ఉపవాస దీక్షలు చేసిన అనంతరం సాయంత్రం ఇప్తార్ విందులో హలీం తింటాం. ఇంట్లోనే కాకుండా శాలిబండలోని ఫిస్తాహౌజ్ వద్ద హలీం ఖరీదు చేసి తినడం ఎంతో బాగుంటుంది. ఒక్కోసారి రెండు, మూడు ప్లేట్లు తిన్న సందర్భాలున్నాయి. ఈసారి హలీం లేదంటే బాధగా ఉంది. వీధుల్లో కాలక్షేపం చేస్తూ హలీం తినడం అలవాటుగా మారింది
– మహ్మద్ ఇస్మాయిల్, ఖాజీపురా
వ్యాపారం కాదు.. ప్రాణాలు ముఖ్యం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒకవైపు మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండగానే.. ఏప్రిల్ చివరి వారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. హలీమ్ అందుబాటులో ఉంటే వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.అందుకే ఈసారి హలీమ్ తయారీని నిలిపేస్తున్నాం
– మహ్మద్ అబ్దుల్ మాజీద్,హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment