రంజాన్ మాసంలో విరివిగా లభ్యం
ఈ ప్రత్యేక రుచికి... అందరు గులాం..
ఏటా పెరుగుతున్న డిమాండ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విక్రయకేంద్రాలు
రుచికర వంటకాలతో మార్కెట్‌లో గిరాకీ
ఉట్నూర్ రూరల్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు పట్టణ కేంద్రాలతో గ్రామ గ్రామాల్లో సైతం మార్కెట్‌లో సందడి వాతావరణం ఏర్పడుతోంది. అయితే రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకం హలీమే. ఏటా రంజాన్ మాసం వచ్చిదంటే చాలు హలీం ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీంతో హలీం సెంటర్లు బిజీగా మారుతాయి.. ఇది ముస్లింలకే కాదు, ప్రతీ ఒక్కరికి ఫేవరెట్ డిష్, దీని రుచి చూడాలని కొందరు.. కొత్తగా ట్రై చేసే వారు మరికొందరు.. ఏళ్ల తరబడి సీజన్‌లో దీని రుచిని ఆస్వాదించే వారు ఇంకొందరు.. ఇలా హలీంకు రంజాన్ సీజన్‌లో అందరూ గులాం అయిపోవాల్సిందే.. చికెన్(హరీస్), మటన్(హలీం)లతో చేసే ఈ వంటకాన్ని ఆరగించాలని చాలా మంది ఉవ్విల్లూరుతుంటారు.
హలీం.. అరబ్ దేశాల సంప్రదాయం..
ఘుమఘుమలాడే రుచికలిగిన హలీం అరబ్ దేశాల సంప్రదాయ వంటకంగా ప్రఖ్యాతి. ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ తదితర ముస్లిం దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ హైదరాబాద్ హలీంకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. పరిశుభ్రమైన మాంసం, స్వచ్చమైన నెయ్యి, గోదుమలు, పిస్తా, కాజు, బాదం, కిస్‌మిస్, మిరియాలు, లవంగాలు, యాలకులు తదితర గరం మసాల దినుసులు వేసి సుమారు 12గంటల పాటు ఉడికించి తయారు చేయడం దీని ప్రత్యేకత. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభ్యమయ్యే ప్రత్యేక వంటకం ఇది.
రంజాన్ రుచులు
రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉన్న ముస్లింలు ఇఫ్తార్ వేళలో తీసుకునే ఆహారం ఎంతో ప్రాధానాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా హలీం, ఖుర్బానీకా మీఠా, కద్దుకాఖీర్ తదితర వంటకాలను తినడానికి ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు లొట్టలేస్తారు. అందుకే ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ముధోల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఆసిఫాబాద్, ఉట్నూర్ లాంటి ఏరియాల్లో ప్రత్యేక వంటకాలను తయారు చేసే దుకాణాలను నెలకొల్పి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి వినియోగదారులను ఆకర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment