చార్మినార్: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం రుచులు ఉవ్విళ్లూరిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆ రసాస్వాదనకు ఫిదా కావాల్సిందే. మరి ఈసారి హలీం తినాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది హలీం ధరలు పెరిగాయి. ఉక్రెయిన్– రష్యా దాడుల నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం హలీం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు హలీం తయారీదారులు.
ఇవి వాడతారు?
ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేపుడు ఉల్లిగడ్డ, కాజు తదితర 21 వస్తువులతో హలీంను తయారు చేస్తారు. ఇందులో రిఫైండ్ ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, పొట్టేలు మాంసాన్ని అధిక మోతాదులో వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయని హలీం తయారీదారులు అంటున్నారు.
ఇలా పెరిగాయి..
► ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు రూ.2 వేలు ఉన్న 15 లీటర్ల రిఫైండ్ ఆయిల్ ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. నెయ్యి, మాంసం ధరలు కూడా పెరగడంతో ఈసారి ప్లేట్ హలీం ధర రూ.20 పెరిగి రూ.240కు చేరింది (పిస్తా హౌస్– 350 గ్రాములు)గా ఉంది. ఇక షాదాబ్ హలీం గతేడాది రూ. 200 ఉండగా.. ప్రస్తుతం రూ.30 పెంచి రూ.230కు (250 గ్రాములు) విక్రయిస్తున్నారు. షాగౌస్ హలీం గతేడాది కన్నా రూ.20 పెంచి రూ.220కి అమ్ముతున్నారు. అంటే ఒక కిలో హలీంకు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది.
గత రెండేళ్లలో కరోనా ప్రభావం..
2020తో పాటు 2021లో హలీం అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో గణనీయంగా హలీం గిరాకీ తగ్గింది. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ హలీం తయారీ నిలిపివేసింది. హలీంను నగరంలో ఎక్కడా తయారీ చేయ లేదు. దీంతో రంజాన్ మాసంలో హలీం అందుబాటులోకి రాలేదు. 2021లో హలీం తయారీ జరిగినప్పటికీ.. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా హలీం ప్రియులు నిరాశకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా హలీం తయారీ దారులు తక్కువ మోతాదులో హలీం తయారు చేశారు. దీంతో హలీం అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టాలను భరించాల్సి వచ్చిందని హలీం తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తగ్గిన గిరాకీ..
పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాత బస్తీలోని హాలీం హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. ప్రస్తుతం హలీం ధరలు పెరగడంతో హలీం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
రెండ్రోజులకోసారే..
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రోజుకు రెండు ప్లేట్ల హలీం తినేవాడిని. ధరలు పెరగడంతో తినడానికి కాస్త ఆలోచించాల్సివస్తోంది. రెండు రోజులకోసారే తింటున్నా.
– షేక్ నదీం, శాలిబండ
తినడం మానేశా..
ప్రతి రంజాన్‌లో హలీంను తప్పనిసరిగా తింటాను. ఇప్పుడు రేట్లు పెరగడంతో మానేసిన. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లు రంజాన్‌లో హలీం తినలేదు. పెరిగిన రేట్లకు తోడు అలవాటు తప్పింది.
– ఫహీం, అలీనగర్
Comments
Please login to add a commentAdd a comment