Haleem centers
-
ధరల కొలిమిలో హలీం.. తినే ఉత్సాహం, మూడు మాటాష్!
చార్మినార్: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం రుచులు ఉవ్విళ్లూరిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆ రసాస్వాదనకు ఫిదా కావాల్సిందే. మరి ఈసారి హలీం తినాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది హలీం ధరలు పెరిగాయి. ఉక్రెయిన్– రష్యా దాడుల నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం హలీం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు హలీం తయారీదారులు. ఇవి వాడతారు? ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేపుడు ఉల్లిగడ్డ, కాజు తదితర 21 వస్తువులతో హలీంను తయారు చేస్తారు. ఇందులో రిఫైండ్ ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, పొట్టేలు మాంసాన్ని అధిక మోతాదులో వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయని హలీం తయారీదారులు అంటున్నారు. ఇలా పెరిగాయి.. ► ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు రూ.2 వేలు ఉన్న 15 లీటర్ల రిఫైండ్ ఆయిల్ ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. నెయ్యి, మాంసం ధరలు కూడా పెరగడంతో ఈసారి ప్లేట్ హలీం ధర రూ.20 పెరిగి రూ.240కు చేరింది (పిస్తా హౌస్– 350 గ్రాములు)గా ఉంది. ఇక షాదాబ్ హలీం గతేడాది రూ. 200 ఉండగా.. ప్రస్తుతం రూ.30 పెంచి రూ.230కు (250 గ్రాములు) విక్రయిస్తున్నారు. షాగౌస్ హలీం గతేడాది కన్నా రూ.20 పెంచి రూ.220కి అమ్ముతున్నారు. అంటే ఒక కిలో హలీంకు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. గత రెండేళ్లలో కరోనా ప్రభావం.. 2020తో పాటు 2021లో హలీం అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో గణనీయంగా హలీం గిరాకీ తగ్గింది. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ హలీం తయారీ నిలిపివేసింది. హలీంను నగరంలో ఎక్కడా తయారీ చేయ లేదు. దీంతో రంజాన్ మాసంలో హలీం అందుబాటులోకి రాలేదు. 2021లో హలీం తయారీ జరిగినప్పటికీ.. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా హలీం ప్రియులు నిరాశకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా హలీం తయారీ దారులు తక్కువ మోతాదులో హలీం తయారు చేశారు. దీంతో హలీం అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టాలను భరించాల్సి వచ్చిందని హలీం తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గిన గిరాకీ.. పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాత బస్తీలోని హాలీం హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. ప్రస్తుతం హలీం ధరలు పెరగడంతో హలీం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండ్రోజులకోసారే.. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రోజుకు రెండు ప్లేట్ల హలీం తినేవాడిని. ధరలు పెరగడంతో తినడానికి కాస్త ఆలోచించాల్సివస్తోంది. రెండు రోజులకోసారే తింటున్నా. – షేక్ నదీం, శాలిబండ తినడం మానేశా.. ప్రతి రంజాన్‌లో హలీంను తప్పనిసరిగా తింటాను. ఇప్పుడు రేట్లు పెరగడంతో మానేసిన. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లు రంజాన్‌లో హలీం తినలేదు. పెరిగిన రేట్లకు తోడు అలవాటు తప్పింది. – ఫహీం, అలీనగర్ -
‘రంజాన్ స్పెషల్ హలీం’ కథ ఇదీ..
రంజాన్ అంటే హలీం... హలీం అంటే రంజాన్ అనే స్థాయిలో ప్రాచుర్యం పొందిందీ వంటకం. ఇంతకీ వంటకం ఎక్కడిది? ఎవరు పరిచయం చేశారు? నగరానికి ఎలా వచ్చింది? దీని ప్రస్థానం ఎలా మొదలైంది? ఇంతటి ప్రాచుర్యం ఎలా పొందింది? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేకం. సాక్షి, సిటీబ్యూరో : హలీం వంటకం పురుడు పోసుకుంది హైదరాబాద్‌లోనే. ఈ రుచికరమైన వంటకాన్ని మనమే ప్రపంచానికి పరిచయం చేశాం. ఇరాన్‌కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో మదీనా సర్కిల్లో ఓ హోటల్ నెలకొల్పాడు. విభిన్న రకాల ఇరాన్ వంటకాలను నగరవాసులకు రుచి చూపించాడు. అయితే 1956లో రంజాన్ మాసం ప్రారంభమైన తొలిరోజు ‘హలీం’ పేరుతో ఓ కొత్త వంటకాన్ని తయారు చేసి, 25పైసలకు కఠోరా (పాత్ర)లో ఇవ్వడం ప్రారంభించాడు. అలా హలీం ప్రస్థానం ప్రారంభమైంది. తొలుత లభించని ఆదరణ... తొలుత హలీంకు పెద్దగా ఆదరణ లభించలేదు. తొలి ఏడాది ఎక్కువగా విక్రయమవ్వలేదు. దీంతో బిర్యానీ తింటే హలీం ఫ్రీ అని ప్రకటించారు. ఇక రెండో ఏడాది వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్టు కార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీలోని అడ్రస్‌లకు పోస్టు కార్డులు రాశారు. దీంతో కొంతమేర విక్రయాలు పెరిగాయి. 1956–1960 వరకు పోస్టు కార్డులు, పత్రిక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించారు. మొత్తానికి ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మదీనాకు రావడం మొదలైంది. ఎక్కువ జనం రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. ఇలా 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. అదే ఏడాది హోటల్ నిర్వాహకుడు హుస్సేన్ మరణించారు. విశ్వవ్యాప్తం... తర్వాతి కాలంలో హలీం మరింత ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా 2005 నుంచి నగరంలో విక్రయాలు బాగా పెరిగాయి. మదీనా హోటల్ మూతపడిన తర్వాత పిస్తాహౌస్, షాగౌస్, సర్వీ, షాదాబ్ తదితర ఈ రంగంలోకి వచ్చాయి. పిస్తాహౌస్ హలీంకు డిమాండ్ విపరీతమైంది. ప్రస్తుతం వీరు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అదే ప్రత్యేకత.. ఇరానీ పద్ధతిలోనే మా హోటల్లో హలీం తయారు చేస్తాం. ఇరానీ హలీం ప్రత్యేకత ఏమిటంటే ఘాటుగా ఉండదు. ఇందుకు గోధుమలు, మాంసం, నెయ్యి సమానంగా తీసుకోవాలి. ఈ మూడు హలీం తయారీకి కీలకం. మసాల దిను సులు వంటకానికి అనుగుణంగా వాడుకోవాలి. – మీర్జా అలీ, సర్వీ హోటల్ నిర్వాహకుడు ఇరానీ పద్ధతిలో.. ఇరానీ సంప్రదాయాలు మనతో మమేకమయ్యాయి. ఇరానీ రుచులు తొలి నుంచి నగరానికి పరిచయమే. ప్రస్తుతం నగరంలోని ఎన్నో హోటళ్లలో హలీం తయారు చేస్తున్నారు. అయితే ఇరానీ హోటళ్లలో మాత్రమే ఇరానీ పద్ధతిలో హలీం తయారు చేస్తున్నారు. మేము నేటికీ ఇరానీ పద్ధతిలోనే హలీం తయారు చేస్తున్నాం. – మహ్మద్ సల్మాన్ మన్సూరీ, బావర్చి హోటల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 40 ఏళ్లుగా... మా నాన్న మదీనా సర్కిల్లో 40 ఏళ్లుగా హలీం విక్రయిస్తున్నారు. నగర ప్రజలకు ఆహార అలవాట్లకు అనుగుణంగా తయారు చేయడం మా ప్రత్యేకత. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. స్వచ్ఛమైన మసాలా దినుసులు వినియోగిస్తున్నాం. – ఉమర్ అదిల్, షాబాద్ హోటల్ నిర్వాహకుడు -
హలీం కోసం క్యూ : జేబు దొంగల హల్చల్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : హలీం కోసం క్యూ లైన్లో నుంచున్న పలువురి జేబులకు దొంగలు చిల్లులు పెట్టారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాల ప్రకారం... హబ్సిగూడకు చెందిన కె. వీరభద్ర పార్థ డెంటల్‌లో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. హలీంకు ఆఖరి రోజు కావడంతో శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్‌నెం.1లోని సర్వీ హలీం కేంద్రం వద్ద క్యూలో నిల్చున్నాడు. కొద్దిసేపటికి చూసుకోగా ఖరీదైన సెల్‌ఫోన్ మాయమైంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మెహిదీపట్నంకు చెందిన ఇస్మాయిల్ అనే విద్యార్థి హలీం కోసం క్యూలో నిల్చోగా పర్సు చోరీకి గురైంది. అందులో రూ.2 వేల నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్‌కు చెందిన రాజశేఖర్ అనే యువకుడు కూడా హలీం కోసం క్యూలో నిల్చుని పర్సు పోగొట్టుకున్నాడు. ఇలా చాలామంది హలీం సెంటర్ల వద్ద పర్సులు, నగదు పోగొట్టుకున్నట్టు సమాచారం.