రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం.
–మదనపల్లె సిటీ / రాయచోటిటౌన్ / రాజంపేటటౌన్
హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్‌కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది.
’తయారీ ప్రత్యేకమే....
సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్‌గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి.
హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు
► మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్‌హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి.
► రాజంపేటలోని ఆర్‌ఎస్‌రోడ్, మెయిన్‌రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు.
రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్‌ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్‌తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్‌తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు.
’రుచి అమోఘం....
రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. గతంలో హైదరాబాదుకు ఎవరైనా వెళితే వారితో ప్రత్యేకంగా తెప్పించుకునే వాడిని. ఇప్పుడు ఇక్కడే దొరుకుతుండటంతో ప్రతిరోజు సంతోషంగా ఆరగిస్తున్నాను.
– మహమ్మద్‌ఖాన్, టీచర్, మదనపల్లె.
’క్వాలిటీలో రాజీపడకుండా తయారీ..
హలీం వంటకంపై ఆహారప్రియులకు ఓ విశేషమైన అభిప్రాయం ఉంది. వారి అంచనాలకు తగ్గట్లుగా హలీంను తయారుచేస్తేనే ఆదరణ ఉంటుంది. అందుకే తయారీలో ఏమాత్రం రాజీపడకుండా నాణ్యమైన దినుసులను, స్వచ్ఛమైన పదార్థాలను వాడుతూ ప్రజలకు నాణ్యమైన వంటకాన్ని అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు దీనిపై మక్కువ చూపడమే కాకుండా ఆహారంగా తీసుకునేందకు ఆసక్తి కనపరుస్తున్నారు.
– చాంద్‌బాషా, షాన్ కేటరింగ్, మదనపల్లె.
హైదరాబాద్ నుంచి రప్పించాం
హలీం రుచికి ఉన్న పేరును దృష్టిలో ఉంచుకొని దీని తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అందువల్ల టేస్ట్ విషయంలో ఎక్కడ కూడా రాజీపడటం లేదు.
– షామీర్, వ్యాపారి,రాజంపేట
శక్తివంతమైన ఆహారం
హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న వారికి హలీం మంచి శక్తిని ఇస్తుంది.
– డాక్టర్ అశ్విన్‌చంద్ర, ఆకేపాడు పీహెచ్‌సీ, రాజంపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment