ఖుబానీ కా మీఠా
షహర్‌కీ షాన్
అది ఎండాకాలం... ఐదో నిజాం అఫ్జల్ ఉద్దౌలా ఉన్నట్టుండి నీరసపడిపోయారు. శరీరం పట్టు తప్పుతుండటంతో వైద్యులకు కబురు పంపారు. వెంటనే ఆస్థాన హకీం (సంప్రదాయ వైద్యుడు) వచ్చి చూశాడు. సాయంత్రానికల్లా ఓ ‘ఔషధా’న్నిచ్చి పుచ్చుకోమన్నారు. అలా నాలుగైదుమార్లు తీసుకున్న ఆయన ఉదయానికల్లా పుంజుకున్నారు. నీరసం తగ్గినా ఆయన ఇక ఆ ‘మందు’ను వదల్లేదు. దాని రుచికి ఆయన దాసోహమన్నారు.. ఆ ఔషధమే తర్వాతి కాలంలో ఓ సంప్రదాయ మధురపదార్థంగా మారింది. అలా హైదరాబాద్‌లో పుట్టి ఖండాంతరాలకు పాకింది.అదే ఖుబానీ కా మీఠా.
-గౌరీభట్ల నరసింహమూర్తి
ఇప్పుడు మీరు పాతనగర వీధిల్లోకి వెళ్తే హలీంతోపాటు ఖుబానీ కా మీఠాను అందిస్తారు. రంజాన్ నెలలో హలీంకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో దీనికీ అంతే ఉంటుంది. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరటం ఖాయం. ఇక ముదురు బెల్లం రంగు పాకంలో గులాబ్ జామూన్‌లా కనిపించే ఆ పదార్థాన్ని చూస్తే మనసు ఆగదు. ఇక నోట్లో వేసుకుంటే... ప్రపంచంలో ఇంతకు మించిన ‘మధురా’నుభూతి మరోటి ఉంటుందంటే మాత్రం ఒప్పుకోరు.
1865 వరకు ఆప్రికాట్ (అమృతఫలం, ఖుబానీ) ఓ సాధారణ ఫలమే. తియ్యటి రుచి నోరూరిస్తూ ఉండేది. కానీ క్రమంగా అందులో పుష్కలమైన ఔషధగుణాలున్నాయనే విషయం నిర్థారణ కావటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, టర్కీల్లో విరివిగా పండే ఈ ఫలం మనదేశంలోని కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కూడా పండుతోంది. అసఫ్‌జాహీల హయాంలో దీనిపై ప్రత్యేక పరిశోధనలు సాగించిన నగర హకీంలు గుండె, శ్వాస సంబంధ రుగ్మతలకు విరుగుడు లక్షణాలు ఈ ఫలంలో ఉన్నాయని గుర్తించారు.
నిస్సత్తువగా అనిపించినప్పుడు దీన్ని తీసుకుంటే మంచి శక్తి వస్తుందని గుర్తించారు. అలాగే శరీరంలో వేడిని రగిల్చి ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం ఇందులో మెండుగా ఉందని తేల్చి.. దీన్ని ఔషధంగా ఇవ్వటం ప్రారంభించారు. ఆ ఔషధం కాస్తా క్రమంగా మంచి తీపి పదార్థంగా మారింది. ఎండిన ఆ ఫలాన్ని నీటిలో నానబెట్టి గుజ్జు చేసి ఔషధంగా ఇచ్చేవారు. తర్వాతి కాలంలో స్వల్ప మార్పులతో ఖుబానీ కా మీఠాగా మారిపోరుుంది. వేనోళ్ల ఆహా ఓహో అనిపించుకుంటోంది.
ఇదీ పద్ధతి
ఎండిన ఖుబానీ పళ్లను రాత్రంతా చల్లటి నీటిలో నానపెట్టాలి. ఉదయం దాన్ని వేళ్లతో చిదిమి అందులోని గింజను తొలగించాలి. ఆ తర్వాత ఆ నీటిలో చక్కెర వేసి 15 నిమిషాలు సన్నటి మంటపై ఉడికించాలి. తొలగించిన గింజను పగలగొట్టి అందులోని పలుకును ముక్కలు చేసి అందులో వేయూలి. చల్లారాక అందులో చిటికెడు యూలకులపొడి వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే నోరూరించే ఖుబానీ కా మీఠా సిద్ధం. ఇప్పుడు పలు రెస్టారెంట్ల నిర్వాహకులు ఇందులో రోజ్‌బరీ ఎసెన్స్, రోజ్‌బరీ షరాఫ్, క్రీమ్‌ను కూడా కలుపుతున్నారు.