ramzan month
-
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది. రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాక్షాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ముస్లింలకు కాంగ్రెస్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ విందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసి డెంట్ భట్టి విక్రమార్క, శాసన సభాపక్ష నేత జానా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సీనియర్ నాయ కులు మర్రి శశిధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రవణ్ కుమా ర్, షేక్ అఫ్జలుద్దీన్, మల్రెడ్డి రంగారెడ్డి, జాఫర్ జావేద్, ఆమేర్ జావేద్, ఖలీఖుర్ రెహ్మాన్, ఖాజా ఫకృద్దీన్, మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖాజా ఖలీలుల్లా, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
నమాజ్‌తో ఆరోగ్యం
మద్దూరు (కొడంగల్లు): దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన పవిత్రమాసం రంజాన్. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సమానత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్. ఈ నెలరోజుల పాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఆరోగ్య ప్రదాయినీ నమాజ్ ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చేస్తే ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. నమాజ్ వల్ల దైవాన్ని కొలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెడునుంచి కూడా దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా నమాజ్‌లోని ప్రతి క్రియలో వ్యాయామ గుణాలు ఉన్నాయి. వేకువజామున చేసే నమాజ్‌ను ఫజర్గా, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం అసర్, సూర్యాస్తమయం వేళ మగ్రీబ్, రాత్రి ఇషా నమాజ్ అని అంటారు. నమాజ్‌లో తక్బీర్, ఖియాం, రుకూ, సజ్ధా, సలాం అనే క్రియలు ఉంటాయి. రుకూ.. రెండు చేతులూ మోకాళ్లపై ఉంచుతూ నడుమును సమానంగా వంచుతూ చూపును రెండు కాళ్ల బొటన వేళ్ల మధ్యన ఉంచాలి. ఈ క్రియ ఉదర భాగానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. చూపునకు ఉత్తేజం కలిగిస్తుంది. వెన్నముకకు మంచి వ్యాయామం. సజ్దా .. పాదాలు మోకాళ్లు, అరచేతులు, ముక్కు, నుదురు, నేలను తాకిస్తూ దైవం సమక్షంలో సాష్టాంగ ప్రణామం చేయడం. ఈ క్రియద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాయామం దొరుకుతుంది. సజ్ధా చేసే సమయంలోనూ, అందులోంచి లేచే సమయంలోనూ ఛాతికి మంచి వ్యాయామం లభిస్తుంది. భుజాలు బలోపేతమవుతాయి. సలాం... నమాజ్‌లో ఇది చివరి ఘట్టం. నమాజ్ పూర్తయ్యే సమయంలో తలను ఒకసారీ కుడివైపు తిప్పి సలాం చేస్తారు. అనంతరం ఎడమవైపునకు తిప్పి సలాం చేసి నమాజ్‌ను ముగిస్తారు. నేత్ర శక్తి పెరిగి, మొదడు ఉత్తేజితమవుతుంది. తక్బీర్... నమాజ్ ప్రారంభానికి సంకల్పం తర్వాత రెండు చేతులు చేవుల వరకు ఎత్తి కిందకు దించి నాభిపైన రెండు చేతులు కట్టుకోవాలి. ఈ క్రియ వల్ల చేతిబలం పెరుగుతుంది. ఆధ్యాత్మికం.. వ్యాయామం నమాజ్ చేస్తే ఆధ్మాత్మికంతోపాటు వ్యాయామం లభించి మంచి ఆరోగ్యంగా ఉంటారు. మామూలు రోజుల్లో ఐదు పూటల నమాజ్ చేయడం ఒక ఎత్తు.. రంజాన్‌లో చేయడం ఒక ఎత్తు. మిగితా రోజులతో పోల్చుకుంటే 70 రకాత్లు చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలోనే దివ్వ ఖురాన్ అవతరించింది. అందరు జకాత్, ఫిత్రా, విధిగా తీయాలి. – అబ్దుల్ ఖదీర్, జామా మసీదు ఇమామ్, మద్దూరు. -
రంజాన్‌లో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేత
న్యూఢిల్లీ/శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసంలో జమ్మూకశ్మీర్‌లో మిలటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని భద్రతాబలగాలను కేంద్రం ఆదేశించింది. రంజాన్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ భద్రతాబలగాలపై దాడి జరిగితే తిప్పికొట్టేందుకు, ప్రజల్ని రక్షించే పూర్తి స్వేచ్ఛ బలగాలకు ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. అర్థంలేని హింసతో ఇస్లాంకు చెడ్డపేరు తీసుకొస్తున్న ఉగ్రమూకలను ఏకాకి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రంజాన్‌ను ముస్లింలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
24న గుంటూరులో రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు
హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష గుంటూరు ఈస్ట్: ఈనెల 24న రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా జరిగే ఇఫ్తార్‌విందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరుకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 24వ తేదీ సాయంత్రం 6.47గంటలకు సన్నిధి కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొనేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకే సీఎం విచ్చేసే అవకాశముందని, నమాజ్,ఇఫ్తార్ విందు కార్యక్రమాలతో పాటు మత పెద్దలతో సమావేశమయ్యే అవకాశముందని తెలిపారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తం సుమారు 2 వేల మంది హాజరుకానున్నారని చెప్పారు. అలాగే 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి తుళ్ళూరుకు విచ్చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ 6 వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ఎన్.టి.ఆర్. క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని, అనంతరం రైతులకు ప్లాట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అత్యాచారం ఓకే కానీ.. రోటీ కాదా?
ప్రతిపక్షాలపై ‘సామ్నా’లో శివసేన ఎదురుదాడి సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో రోటీ అంశంపై శివసైనికుల చర్య సరికాదని చెప్పేవారికి.. బెంగళూరు స్కూల్లో ఓ ముస్లిం వ్యక్తి పవిత్ర రంజాన్ మాసంలో ఓ చిన్నారిపై అత్యాచారం జరపడం సరైనదిగా కనిపిస్తోందా అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ప్రశ్నించారు. క్యాంటీన్లో ఆహారం సరిగా లేకపోవడంపై నిరసన తెలిపే సందర్భంలో జరిగిన ఘటనకు కొన్ని పార్టీలు మతం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర సదన్‌లో ఓ ముస్లిం ఉద్యోగికి శివసేన ఎంపీ రాజన్ విచారే బలవంతంగా రోటీ తినిపించి రోజా (ఉపవాసానికి)కు భంగం కలిగేలా వ్యవహరించినట్లు కనిపించిన వీడియోను తప్పుపట్టిన ప్రతిపక్షాలు.. ముస్లిం వర్గాలపై శివసేన జులుం చలాయిస్తోందని దుయ్యబట్టాయి. ఈ నేపథ్యంలో గురువారం ‘సామ్నా’ పత్రిక సంపాదకీయంలో ఉద్ధవ్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించారు. ‘మహారాష్ట్ర సదన్ కాంట్రాక్టర్ ఏ మతానికి చెందినవారన్నది ఆయన ముఖంపై రాసి ఉండదు కదా.. అయినా శివసైనికులు ఒక ముస్లిం వ్యక్తిని రోజా విరమించేలా చేశారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టి మా పార్టీకి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోం.. ముఖ్యంగా మీరు గొడవకు దిగుతున్న ది శివసేనతో అన్నది గుర్తుపెట్టుకోండి’అంటూ ఉద్ధవ్ హెచ్చరించారు. -
ఖుబానీ కా మీఠా
షహర్‌కీ షాన్ అది ఎండాకాలం... ఐదో నిజాం అఫ్జల్ ఉద్దౌలా ఉన్నట్టుండి నీరసపడిపోయారు. శరీరం పట్టు తప్పుతుండటంతో వైద్యులకు కబురు పంపారు. వెంటనే ఆస్థాన హకీం (సంప్రదాయ వైద్యుడు) వచ్చి చూశాడు. సాయంత్రానికల్లా ఓ ‘ఔషధా’న్నిచ్చి పుచ్చుకోమన్నారు. అలా నాలుగైదుమార్లు తీసుకున్న ఆయన ఉదయానికల్లా పుంజుకున్నారు. నీరసం తగ్గినా ఆయన ఇక ఆ ‘మందు’ను వదల్లేదు. దాని రుచికి ఆయన దాసోహమన్నారు.. ఆ ఔషధమే తర్వాతి కాలంలో ఓ సంప్రదాయ మధురపదార్థంగా మారింది. అలా హైదరాబాద్‌లో పుట్టి ఖండాంతరాలకు పాకింది.అదే ఖుబానీ కా మీఠా. -గౌరీభట్ల నరసింహమూర్తి ఇప్పుడు మీరు పాతనగర వీధిల్లోకి వెళ్తే హలీంతోపాటు ఖుబానీ కా మీఠాను అందిస్తారు. రంజాన్ నెలలో హలీంకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో దీనికీ అంతే ఉంటుంది. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరటం ఖాయం. ఇక ముదురు బెల్లం రంగు పాకంలో గులాబ్ జామూన్లా కనిపించే ఆ పదార్థాన్ని చూస్తే మనసు ఆగదు. ఇక నోట్లో వేసుకుంటే... ప్రపంచంలో ఇంతకు మించిన ‘మధురా’నుభూతి మరోటి ఉంటుందంటే మాత్రం ఒప్పుకోరు. 1865 వరకు ఆప్రికాట్ (అమృతఫలం, ఖుబానీ) ఓ సాధారణ ఫలమే. తియ్యటి రుచి నోరూరిస్తూ ఉండేది. కానీ క్రమంగా అందులో పుష్కలమైన ఔషధగుణాలున్నాయనే విషయం నిర్థారణ కావటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, టర్కీల్లో విరివిగా పండే ఈ ఫలం మనదేశంలోని కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కూడా పండుతోంది. అసఫ్‌జాహీల హయాంలో దీనిపై ప్రత్యేక పరిశోధనలు సాగించిన నగర హకీంలు గుండె, శ్వాస సంబంధ రుగ్మతలకు విరుగుడు లక్షణాలు ఈ ఫలంలో ఉన్నాయని గుర్తించారు. నిస్సత్తువగా అనిపించినప్పుడు దీన్ని తీసుకుంటే మంచి శక్తి వస్తుందని గుర్తించారు. అలాగే శరీరంలో వేడిని రగిల్చి ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం ఇందులో మెండుగా ఉందని తేల్చి.. దీన్ని ఔషధంగా ఇవ్వటం ప్రారంభించారు. ఆ ఔషధం కాస్తా క్రమంగా మంచి తీపి పదార్థంగా మారింది. ఎండిన ఆ ఫలాన్ని నీటిలో నానబెట్టి గుజ్జు చేసి ఔషధంగా ఇచ్చేవారు. తర్వాతి కాలంలో స్వల్ప మార్పులతో ఖుబానీ కా మీఠాగా మారిపోరుుంది. వేనోళ్ల ఆహా ఓహో అనిపించుకుంటోంది. ఇదీ పద్ధతి ఎండిన ఖుబానీ పళ్లను రాత్రంతా చల్లటి నీటిలో నానపెట్టాలి. ఉదయం దాన్ని వేళ్లతో చిదిమి అందులోని గింజను తొలగించాలి. ఆ తర్వాత ఆ నీటిలో చక్కెర వేసి 15 నిమిషాలు సన్నటి మంటపై ఉడికించాలి. తొలగించిన గింజను పగలగొట్టి అందులోని పలుకును ముక్కలు చేసి అందులో వేయూలి. చల్లారాక అందులో చిటికెడు యూలకులపొడి వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే నోరూరించే ఖుబానీ కా మీఠా సిద్ధం. ఇప్పుడు పలు రెస్టారెంట్ల నిర్వాహకులు ఇందులో రోజ్బరీ ఎసెన్స్, రోజ్బరీ షరాఫ్, క్రీమ్‌ను కూడా కలుపుతున్నారు. -
కైసే బనాతే.. సేమియా
సేమియా తయారీలో ఖాన్ బ్రదర్సది ఫిఫ్టీ ఇయర్స ఇండస్ట్రీ. పొడవాటి సన్నని దారం పోగుల్లా కనిపించే సేమియా తయారీకి వారు ఎలాంటి యంత్రాలనూ ఉపయోగించరు. కేవలం హస్తకౌశలంతోనే తయారు చేస్తారు. చాదర్‌ఘాట్ మూసానగర్ ప్రాంతంలోని సలీంఖాన్, ఆయన ఇద్దరు సోదరులు... అన్వర్ ఖాన్, యూసఫ్ ఖాన్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే పనిలో తలమునకలుగా ఉంటారు. రంజాన్ మాసం చివరి రోజైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తయారుచేసే స్వీట్ ‘షీర్ కుర్మా’కు ఈ సేమియానే ఉపయోగిస్తారు. రంజాన్ మాసంలో వీరికి మంచి గిరాకీ. వారి పిల్లలు కూడా స్కూలు నుంచి ఇంటికొచ్చాక ఈ పనిలో చేదోడు వాదోడుగా ఉంటారు. ఎలా చేస్తారంటే... మైదాలో తగినంత ఉప్పు కలిపి, నీరు చేర్చి ముద్ద కలుపుకుంటారు. రాత్రంతా ముద్దను అలాగే వదిలేస్తారు. ఉదయాన్నే సేమియా తయారీ మొదలుపెడతారు. చకచకగా పోగులుగా తయారుచేసిన సేమియాను దండెంలా కట్టిన దారాలపై ఆరబెడతారు. సేమియా తయారీ ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. అయితే, ఒకసారి దారాలపై ఆరబెట్టాక, పది నిమిషాల్లోనే పూర్తిగా ఆరిపోతాయి. ఆరిపోయిన సేమియాను జాగ్రత్తగా తీసి, కట్టలు కట్టలుగా కట్టి ప్యాక్ చేస్తారు. వానొస్తేనే ఇబ్బంది: సలీం ఖాన్: రంజాన్ నెలలోను, ముందు నెలలోను ఈ సేమియాకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. అయితే, తయారీ సమయంలో వానొస్తే మాకు నష్టం తప్పదు. అలాంటప్పుడు ఒక్కోరోజులో రూ.1200-1500 వరకు నష్టం వస్తుంది. పూర్తిగా చేతులతోనే సేమియా తయారు చేయడానికి చాలా నైపుణ్యం, ఓపిక కావాలి. మా నాన్న సర్దార్ ఖాన్ వద్ద నేను, మా తమ్ముళ్లు దీని తయారీని నేర్చుకున్నాం. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఈ సేమియా తయారీని మా తాత ప్రారంభించారు. యాభయ్యేళ్లుగా ఇదే పనిలో కొనసాగుతున్నాం. ప్రస్తుతం రోజుకు దాదాపు ముప్పయి కిలోల సేమియా తయారు చేస్తున్నాం. నగరంలోని దుకాణాలకే కాకుండా, చుట్టుపక్కల జిల్లాలకూ సరఫరా చేస్తున్నాం. - సాక్షి, సిటీప్లస్ -
పండగ వేళ.. ‘పండ్ల’ గోల..!
సాక్షి, ముంబై: రంజాన్ మాసం కావడంతో పండ్ల ధరలు కొండెక్కనున్నాయి. మార్కెట్లో పండ్ల కొరత లేనప్పటికీ పండగ సీజన్ నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసినట్లు పలువురు భావిస్తున్నారు. నగరంలోని వాషి ఏపీఎంసీ మార్కెట్ పండ్లతో కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో చాలా మంది నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను మాత్రమే ఎంచుకుంటారు. ఈ మేరకు తర్బూజ, పొప్పిడి పండు, పైనాపిల్ పండ్ల ధరలు పెరగనున్నాయి. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారుల సంక్షేమ సంఘ ప్రతినిధి విజయ్ బేండే మాట్లాడు తూ.. రంజాన్ మాసంలో పండ్లకు ఎక్కువ డిమాం డ్ ఉంటుందన్నారు. దీంతో ఈ మాసంలో పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయని తెలిపారు. హోల్‌సేల్ మార్కెట్లో తర్బూజ, పొప్పిడి, పైనాపిల్ పండ్ల ధరలు కి.లో. రూ. 20 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. పండ్ల వ్యాపారి బాబూరావ్ హ్యాండే మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో భారీగా పెరిగే పండ్ల ధరలు మాసాంతంలో ధరలు కూడా తగ్గుతాయని తెలిపారు. మామూలుగా పండ్ల ధర లు వాటి సరఫరాపైన ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు పండగ సీజన్ కావడంతో డిమాండ్ మేర కు ధరలు పెంచుతున్నారని అభిప్రాయపడ్డారు. తర్బూజ, బొప్పాయి కొంతమేరకు రాష్ర్టం లోని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుండగా, ఎక్కువ శాతం ఉత్తర భారత రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పైనాపిల్ మాత్రం కేరళ రాష్ర్టం నుంచి దిగుమతి అవుతోంది. రంజాన్ మాసంలో నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు 60 నుంచి 70 ట్రక్కుల వరకు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు చేరుకుంటాయి. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్‌కు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు. డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండ్లు, కూరగాయల ధరలు పెరగిపోవడంతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు, నిత్యం ఎక్కువ ధర పలుకుతున్న డ్రైఫ్రూట్స్‌ను కొనుగోలు చేయలేరని విచారం వ్యక్తం చేశారు. ఈసారి తమ వ్యాపారం నడవడం కష్టమేనన్నారు. రంజాన్ సమీపిస్తున్నప్పటికీ తమకు ఇప్పటి దాకా ఎలాంటి ఆదాయం లేదన్నారు. డ్రైఫ్రూట్స్‌కు డిమాండ్ తక్కువగా ఉండడంతో వీటి ధర కూడా నిలకడగా ఉంటుందని మరో వ్యాపారి తెలిపారు. రంజాన్ మాసంలో హోల్‌సేల్ మార్కెట్లో ఖర్జూరకు కి.లో రూ.25 నుంచి 60 వరకు ధర పలుకుతోందని మరో డ్రైఫ్రూట్స్ వ్యాపారి పేర్కొన్నారు. ఖాజూ కిలో రూ.640 నుంచి 700 వరకు పలుకుతోంది. బాదామ్ కి.లో. రూ.1,400 నుంచి రూ.2,500 ధర పలుకుతోంది. అంజీర్ కిలో రూ.360 నుంచి 900, వాల్నట్ రూ.860 నుంచి 1,500, పిస్తా రూ.1,400 నుంచి 1,500 వరకు ధర పలుకుతోంది. -
గల్ఫ్‌లో 19 అమెరికన్ దౌత్య కార్యాలయాల మూసివేత
వాషింగ్టన్: గల్ఫ్ దేశాల్లోని 19 దౌత్య కార్యాలయాలను అమెరికా సోమవారం మూసివేసింది. అల్‌కాయిదా హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాల్లోని ఎంబసీలను ఈనెల 10 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో అల్ కాయిదా అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం లభించడంతో అమెరికా ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగానే గల్ఫ్‌లోని 22 ఎంబసీలను ఆదివారం మూసివేశారు. ఈ నెలలో అల్‌కాయిదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అమెరికా తన పౌరులను హెచ్చరించింది. రంజాన్ ముగింపులో జరిగే ఈద్ పర్వదినం సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని స్థానిక పద్ధతుల ప్రకారం వారం రోజుల పాటు తమ రాయబార, దౌత్య కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ చెప్పారు. అయితే, అల్‌కాయిదా సంభాషణలను తాము సేకరించామని అమెరికన్ జనరల్ ఒకరు చెప్పారు. అమెరికన్లతో పాటు పాశ్చాత్య దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించాలని పథకం వేసుకుందని అమెరికా ఉమ్మడి బలగాల చైర్మన్ జనరల్ మార్టిన్ డింప్సీ చెప్పారు.