వాషింగ్టన్: గల్ఫ్ దేశాల్లోని 19 దౌత్య కార్యాలయాలను అమెరికా సోమవారం మూసివేసింది. అల్‌కాయిదా హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాల్లోని ఎంబసీలను ఈనెల 10 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో అల్ కాయిదా అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం లభించడంతో అమెరికా ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగానే గల్ఫ్‌లోని 22 ఎంబసీలను ఆదివారం మూసివేశారు.
ఈ నెలలో అల్‌కాయిదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అమెరికా తన పౌరులను హెచ్చరించింది. రంజాన్ ముగింపులో జరిగే ఈద్ పర్వదినం సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని స్థానిక పద్ధతుల ప్రకారం వారం రోజుల పాటు తమ రాయబార, దౌత్య కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ చెప్పారు. అయితే, అల్‌కాయిదా సంభాషణలను తాము సేకరించామని అమెరికన్ జనరల్ ఒకరు చెప్పారు. అమెరికన్లతో పాటు పాశ్చాత్య దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించాలని పథకం వేసుకుందని అమెరికా ఉమ్మడి బలగాల చైర్మన్ జనరల్ మార్టిన్ డింప్సీ చెప్పారు.
గల్ఫ్‌లో 19 అమెరికన్ దౌత్య కార్యాలయాల మూసివేత
Published Tue, Aug 6 2013 1:42 AM | Last Updated on Fri, Aug 24 2018 6:33 PM
Advertisement