రష్యాలో రోడ్డును దొంగిలించిన మొనగాడు | Russian steals an entire road! | Sakshi
Sakshi News home page

రష్యాలో రోడ్డును దొంగిలించిన మొనగాడు

Published Wed, Aug 7 2013 1:32 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

Russian steals an entire road!

ఎక్కడైనా డబ్బు దొంగతనం గురించి విన్నాం, నగల దొంగతనం గురించి విన్నాం. ఇంకా మాట్లాడితే ఇంట్లోకి చొరబడి మొత్తం దుస్తుల దగ్గర్నుంచి టీవీలు, టేప్ రికార్డర్లు.. ఇలా వస్తువులన్నింటినీ చోరీ చేయడం కూడా మనకు తెలుసు. కానీ, ఎవరైనా రోడ్డును దొంగిలించడం చూశారా? ఏంటి.. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇది పచ్చి వాస్తవం. ఎప్పుడూ హడావుడిగా ఉండే ఓ జాతీయ రహదారి మీద ఉన్న మొత్తం 82 కాంక్రీటు శ్లాబు బ్లాకులను ఓ దొంగ ఎత్తుకుపోయాడు. నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డును అతగాడు దర్జాగా చోరీ చేస్తున్నా ఎవరికీ తెలియకపోవడం విశేషం. అతగాడు చోరీ చేసిన కాంక్రీటు శ్లాబుల విలువ అక్షరాలా 3,73,576 రూపాయలు.

సిక్టివ్కర్ అనే నగరానికి శివార్లలో ఉన్న జాతీయరహదారి మీద పరిచిన శ్లాబులను అతగాడు వలుచుకుని తీసుకెళ్లిపోయాడు. ఫోర్కులిఫ్టుతో కూడిన ట్రక్కు, బుల్డోజర్ రెండింటినీ తీసుకెళ్లి మరీ అతడీ పని చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 82 బ్లాకులను రోడ్డు మీద నుంచి తీసుకెళ్లిపోయాడు. వీటిని మూడు పెద్ద పెద్ద ట్రక్కులలో లోడ్ చేసుకుని పట్టుకెళ్లాడు. రోడ్డును మూసేసినట్లు ఓ బోర్డు పెట్టి, వాహనాలు అటువైపు రాకుండా చూసుకుని మరీ ఈ చోరీ చేసినట్లు భావిస్తున్నారు. అయితే.. ఇంత గొప్పగా చోరీ చేసిన సదరు దొంగగారు చివరకు పోలీసులకు పట్టుబడిపోయాడు. పోలీసులు అనుకోకుండా ఈ మూడు వాహనాలను ఆపి తనిఖీ చేస్తుంటే అతడు దొరికాడు తప్ప, చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు గమనించలేకపోయారు. ఈ దొంగతనానికి గాను అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  అయితే, కాంక్రీటు శ్లాబులు పట్టుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నాడో మాత్రం తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement