రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల బలహీన పడటంతో భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకు జారింది. స్టాక్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి జరిగిన మొత్తం వాణిజ్యంలో భారత్ రూ. 989 కోట్ల అమెరికన్ డాలర్లు నమోదు అయింది. ట్రిలియన్ డాలర్లకు స్వల్పంగా కొన్ని కోట్లు తగ్గటంతో ఆ క్లబ్లో భారత్ స్థానం చేజారింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరుతుంది. అంతలోనే రూపాయి విలువ పెరుగుతుంది. ఆ ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్కు ఆ పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత్ వైదొలిగే సూచనలు కనిపించాయి. కానీ రూపాయి పతనం, మరల పుంజుకొవడంతో భారత్ ఆ క్లబ్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కానీ మంగళవారం జరిగిన వాణిజ్యంలో రూపాయి పతనం అయ్యే సరికి ఆ క్లబ్ నుంచి భారత్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే 2007లో మొట్టమొదటగా భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం పొందింది. 2008, సెప్టెంబర్లో ఆ క్లబ్ నుంచి వైదొలిగింది. 2009లో భారత్ మళ్లీ ట్రిలియన్ క్లబ్లో సభ్యత్వం పొందింది. భారత్ వైదొలగడంతో యూఎస్, యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతం, బ్రెజిల్ దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా బ్రెజిల్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్ప తేడాతో ఆ క్లబ్లో కొనసాగుతున్నాయి. అయితే గతంలో రష్యా, స్పెయిన్, దక్షిణాఫ్రికాలు ఆ క్లబ్లో స్థానం పొంది మరల కొల్పోయాయి.