మద్దూరు (కొడంగల్లు): దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన పవిత్రమాసం రంజాన్. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సమానత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్. ఈ నెలరోజుల పాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు.
ఆరోగ్య ప్రదాయినీ నమాజ్
ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చేస్తే ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. నమాజ్ వల్ల దైవాన్ని కొలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెడునుంచి కూడా దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా నమాజ్‌లోని ప్రతి క్రియలో వ్యాయామ గుణాలు ఉన్నాయి.
వేకువజామున చేసే నమాజ్‌ను ఫజర్‌గా, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం అసర్, సూర్యాస్తమయం వేళ మగ్రీబ్, రాత్రి ఇషా నమాజ్ అని అంటారు. నమాజ్‌లో తక్బీర్, ఖియాం, రుకూ, సజ్ధా, సలాం అనే క్రియలు ఉంటాయి.
రుకూ..
రెండు చేతులూ మోకాళ్లపై ఉంచుతూ నడుమును సమానంగా వంచుతూ చూపును రెండు కాళ్ల బొటన వేళ్ల మధ్యన ఉంచాలి. ఈ క్రియ ఉదర భాగానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. చూపునకు ఉత్తేజం కలిగిస్తుంది. వెన్నముకకు మంచి వ్యాయామం.
సజ్దా ..
పాదాలు మోకాళ్లు, అరచేతులు, ముక్కు, నుదురు, నేలను తాకిస్తూ దైవం సమక్షంలో సాష్టాంగ ప్రణామం చేయడం. ఈ క్రియద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాయామం దొరుకుతుంది. సజ్ధా చేసే సమయంలోనూ, అందులోంచి లేచే సమయంలోనూ ఛాతికి మంచి వ్యాయామం లభిస్తుంది. భుజాలు బలోపేతమవుతాయి.
సలాం...
నమాజ్‌లో ఇది చివరి ఘట్టం. నమాజ్ పూర్తయ్యే సమయంలో తలను ఒకసారీ కుడివైపు తిప్పి సలాం చేస్తారు. అనంతరం ఎడమవైపునకు తిప్పి సలాం చేసి నమాజ్‌ను ముగిస్తారు. నేత్ర శక్తి పెరిగి, మొదడు ఉత్తేజితమవుతుంది.
తక్బీర్...
నమాజ్ ప్రారంభానికి సంకల్పం తర్వాత రెండు చేతులు చేవుల వరకు ఎత్తి కిందకు దించి నాభిపైన రెండు చేతులు కట్టుకోవాలి. ఈ క్రియ వల్ల చేతిబలం పెరుగుతుంది.
ఆధ్యాత్మికం.. వ్యాయామం
నమాజ్ చేస్తే ఆధ్మాత్మికంతోపాటు వ్యాయామం లభించి మంచి ఆరోగ్యంగా ఉంటారు. మామూలు రోజుల్లో ఐదు పూటల నమాజ్ చేయడం ఒక ఎత్తు.. రంజాన్‌లో చేయడం ఒక ఎత్తు. మిగితా రోజులతో పోల్చుకుంటే 70 రకాత్‌లు చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలోనే దివ్వ ఖురాన్ అవతరించింది. అందరు జకాత్, ఫిత్రా, విధిగా తీయాలి.
– అబ్దుల్ ఖదీర్, జామా మసీదు ఇమామ్, మద్దూరు.
Comments
Please login to add a commentAdd a comment