పండగ వేళ.. ‘పండ్ల’ గోల..!
సాక్షి, ముంబై: రంజాన్ మాసం కావడంతో పండ్ల ధరలు కొండెక్కనున్నాయి. మార్కెట్లో పండ్ల కొరత లేనప్పటికీ పండగ సీజన్ నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసినట్లు పలువురు భావిస్తున్నారు. నగరంలోని వాషి ఏపీఎంసీ మార్కెట్ పండ్లతో కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో చాలా మంది నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను మాత్రమే ఎంచుకుంటారు. ఈ మేరకు తర్బూజ, పొప్పిడి పండు, పైనాపిల్ పండ్ల ధరలు పెరగనున్నాయి.
ఈ సందర్భంగా పండ్ల వ్యాపారుల సంక్షేమ సంఘ ప్రతినిధి విజయ్ బేండే మాట్లాడు తూ.. రంజాన్ మాసంలో పండ్లకు ఎక్కువ డిమాం డ్ ఉంటుందన్నారు. దీంతో ఈ మాసంలో పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయని తెలిపారు. హోల్‌సేల్ మార్కెట్‌లో తర్బూజ, పొప్పిడి, పైనాపిల్ పండ్ల ధరలు కి.లో. రూ. 20 నుంచి 30 వరకు ఉంటుందన్నారు.
పండ్ల వ్యాపారి బాబూరావ్ హ్యాండే మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో భారీగా పెరిగే పండ్ల ధరలు మాసాంతంలో ధరలు కూడా తగ్గుతాయని తెలిపారు. మామూలుగా పండ్ల ధర లు వాటి సరఫరాపైన ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు పండగ సీజన్ కావడంతో డిమాండ్ మేర కు ధరలు పెంచుతున్నారని అభిప్రాయపడ్డారు. తర్బూజ, బొప్పాయి కొంతమేరకు రాష్ర్టం లోని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుండగా, ఎక్కువ శాతం ఉత్తర భారత రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పైనాపిల్ మాత్రం కేరళ రాష్ర్టం నుంచి దిగుమతి అవుతోంది. రంజాన్ మాసంలో నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు 60 నుంచి 70 ట్రక్కుల వరకు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు చేరుకుంటాయి.
ప్రతి ఏడాది రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్‌కు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు. డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండ్లు, కూరగాయల ధరలు పెరగిపోవడంతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు, నిత్యం ఎక్కువ ధర పలుకుతున్న డ్రైఫ్రూట్స్‌ను కొనుగోలు చేయలేరని విచారం వ్యక్తం చేశారు. ఈసారి తమ వ్యాపారం నడవడం కష్టమేనన్నారు. రంజాన్ సమీపిస్తున్నప్పటికీ తమకు ఇప్పటి దాకా ఎలాంటి ఆదాయం లేదన్నారు. డ్రైఫ్రూట్స్‌కు డిమాండ్ తక్కువగా ఉండడంతో వీటి ధర కూడా నిలకడగా ఉంటుందని మరో వ్యాపారి తెలిపారు.
రంజాన్ మాసంలో హోల్‌సేల్ మార్కెట్‌లో ఖర్జూరకు కి.లో రూ.25 నుంచి 60 వరకు ధర పలుకుతోందని మరో డ్రైఫ్రూట్స్ వ్యాపారి పేర్కొన్నారు. ఖాజూ కిలో రూ.640 నుంచి 700 వరకు పలుకుతోంది. బాదామ్ కి.లో. రూ.1,400 నుంచి రూ.2,500 ధర పలుకుతోంది. అంజీర్ కిలో రూ.360 నుంచి 900, వాల్‌నట్ రూ.860 నుంచి 1,500, పిస్తా రూ.1,400 నుంచి 1,500 వరకు ధర పలుకుతోంది.