న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీయంగా చమురు, గ్యాస్‌లకు పటిష్ట డిమాండ్ కనిపించనున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తాజాగా అంచనా వేసింది. అయితే ప్రపంచస్థాయిలో డిమాండ్ నీరసించే వీలున్నదని, దీంతో చమురు శుద్ధి(రిఫైనింగ్) మార్జిన్లు బలహీనపడవచ్చని పేర్కొంది.
పెట్రోలియం ప్రొడక్టులకు నెలకొనే భారీ డిమాండ్ కారణంగా డౌన్‌స్ట్రీమ్(రిఫైనింగ్) కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ స్థిరంగా కొనసాగే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) మందగించినప్పటికీ బలమైన మార్కెటింగ్ మార్జిన్లు కంపెనీలకు అండగా నిలవనున్నట్లు తెలియజేసింది. వెరసి పటిష్ట నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే వీలున్నట్లు అంచనా వేసింది.
నిర్మాణంలో ఉన్న రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలన్నిటికీ అదనపు రుణ భారానికి అవకాశమున్నట్లు వివరించింది. అయితే చమురు ఉత్పాదక(అప్‌స్ట్రీమ్) కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ ముడిచమురు ధరలపై ఆధారపడనున్నట్లు 2025–26 ఆయిల్ అండ్ గ్యాస్ ఔట్‌లుక్‌పై విడుదల చేసిన నివేదికలో రేటింగ్ సంస్థ ఇండియారేటింగ్స్ వివరించింది.
ఇబిటాకు ఆధారం
రేటింగ్ సంస్థ నివేదిక ప్రకారం చమురు ధరల ఒత్తిడి, పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో అప్‌స్ట్రీమ్ కంపెనీల ఇబిటా క్షీణించవచ్చు. అయితే కొత్త డిస్కవరీల నుంచి చమురు ఉత్పత్తి పెరగడం, ఉత్పాదకతపై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ తొలగింపు వంటి అంశాలు చమురు ధరల క్షీణత ప్రభావానికి చెక్ పెట్టే వీలుంది.
దేశీయంగా చమురు, గ్యాస్‌కు భారీ డిమాండ్ నెలకొనవచ్చని, ఇది రిఫైనింగ్, పెట్రోకెమికల్ సామర్థ్యాల విస్తరణకు దారి తీసే వీలున్నదని ఇండియారేటింగ్స్ కార్పొరేట్స్ విభాగం అసోయేట్ డైరెక్టర్ భాను పట్ని పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో రిఫైనరీ సామర్థ్యం 22 శాతం బలపడవచ్చని అంచనా వేశారు. చమురు, గ్యాస్ విభాగాలలో పెట్టుబడి నిర్ణయాలను డిమాండ్ ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు.
జీఆర్‌ఎంలు వీక్
ఈ ఏడాది తొలి అర్ధభాగాన్ని ప్రతిఫలిస్తూ వచ్చే ఏడాది జీఆర్‌ఎంలు మందగించవచ్చు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ నీరసించడం ప్రభావం చూపే వీలుంది. చైనాను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీటికితోడు గ్లోబల్‌స్థాయిలో రిఫైనరీ సామర్థ్యాలు పెరగడం కారణంకానున్నాయి. దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు డిమాండ్ కొనసాగనుంది. డీజిల్, పెట్రోల్, ఎల్‌పీజీకి బల్క్ డిమాండ్ కనిపించనుంది.
చమురు ధరల క్షీణత, నిలకడైన రిటైల్ ధరల కారణంగా సమీకృత కార్యకలాపాలుగల ఓఎంసీలకు ఈ తొలి అర్ధభాగంలో లభించిన మార్కెటింగ్ మార్జిన్లు మద్దతివ్వనున్నాయి. సమీకృత రిఫైనర్స్, స్టాండెలోన్ పెట్‌కెమ్ సంస్థల ఇబిటా వచ్చే ఏడాది మెరుగుపడనుంది. 2024 ఒత్తిడి తదుపరి ఈ ఏడాదిలోనే పెట్‌కెమ్ ఇబిటా బలపడటం మొదలైంది. బ్యారల్ ధర 65 డాలర్లకు ఎగువన కొనసాగితే అప్‌స్ట్రీమ్‌కంపెనీలు పటిష్ట మార్జిన్లు ఆర్జించే వీలుంది.
ఒక్కో బ్యారల్‌పై 40–45 డాలర్లస్థాయిలో ఉత్పత్తి వ్యయాల బ్రేక్‌ఈవెన్‌కు చాన్స్ ఉంది. దీంతో బ్యారల్‌పై 20–30 డాలర్ల ఇబిటా ఆర్జించవచ్చు. ముడిచమురు ధరలు ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి కదులుతాయి. మరోవైపు డిమాండ్, ఒపెక్ దేశాల ఉత్పాదక లక్ష్యాలు సైతం ప్రభావం చూపుతాయి. దేశీయంగా విండ్‌ఫాల్ పన్ను తొలగింపుతో చమురు ధరల క్షీణత దేశీ అప్‌స్ట్రీమ్ కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదు.
సిటీ గ్యాస్ ఓకే
వచ్చే ఏడాది దేశీ చౌక గ్యాస్ కేటాయింపులు తగ్గిన తదుపరి రానున్న ఏడాదిలో సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) సంస్థల క్రెటిట్ ప్రొఫైల్ స్థిరంగా కొనసాగవచ్చని ఇండియారేటింగ్స్ నివేదిక పేర్కొంది. మూలధన పెట్టుబడులపై రాబడి మందగించవచ్చు. అయితే పటిష్టస్థాయిలోనే నమోదయ్యే వీలుంది. కొత్త ప్రాంతాలలో పెట్టుబడుల వెచ్చింపుపై కొంతమేర ఒత్తిళ్లు నెలకొనవచ్చు.
పెట్టుబడి వినియోగ అంతర్గత వనరులు తగ్గే వీలుంది. క్రాక్ స్ప్రెడ్స్(మార్జిన్ల అంతరం) మెరుగుపడటం, అధిక సరఫరా పరిస్థితులు ఉపశమించడం వంటి కారణాలతో విడిగా(స్టాండెలోన్) పెట్రోకెమికల్ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించే వీలుంది. 2019–24 మధ్యకాలంలో ప్రధానంగా చైనా నుంచి భారీ సామర్థ్యాలు జత కలవడం అధిక సరఫరాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment