రూ కోటి నేలపాలు | government spend one crore for cultivation but not developed | Sakshi
Sakshi News home page

రూ కోటి నేలపాలు

Published Mon, Dec 30 2013 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

government spend one crore for cultivation but not developed

నడిగూడెం, న్యూస్‌లైన్: నడిగూడెం మండలం రామాపురం రెవెన్యూ గ్రామంలోని 190 సర్వేనంబర్ పరిధిలో దాదాపు 2900 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 2200 ఎకరాల్లో కొంతమేర భూమి ఉండగా, 700 ఎకరాల్లో గుట్టలున్నాయి. రామాపురం, ఎక్లాస్‌ఖాన్‌పేట, ఎక్లాస్‌ఖాన్‌పేట తండా, తెల్ల బెల్లి, మునగాల మండలం బరాఖత్‌గూడెం, ముకుందాపురం, ఆకుపాములు, కోదండరా మాపురం గ్రామాల పరిధిలో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఏక్‌సాల్ పట్టాలు పొందుతూ మెట్ట పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొన్ని భూములు బీళ్లుగా ఉన్నాయి.
 నిధులు ఖర్చుచేసినా..
 దశాబ్దాల క్రితం ఈ భూముల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా అప్పటి ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. భూములను అభివృద్ధి పర్చడం కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ 10 లక్షలు, బీసీ కార్పొరేషన్ నుంచి రూ 10 లక్షలు, మాడా నుంచి రూ 5 లక్షలు, ఫలసాగర్ పథకం కింద రూ 10 లక్షలు, వర్షాధారంగా పండ్ల తోటల సాగు పథకం కింద రూ 5 లక్షలు, పనికి ఆహార పధకం కింద రూ 10 లక్షలు,  ఇందిర జలప్రభ మొదటి దఫా కింద రూ 25 లక్షలు, రెండో దఫా కింద రూ 10 లక్షలు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ 10 లక్షలు, మరో రెండు పథకాల ద్వారా రూ 20 లక్షలు ఖర్చు చేశారు. బావులు తీయించడం, బోర్లు, చేతి పంపులు వేయించడం తదితర పనుల ద్వారా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారు. అయినా అధికారుల పర్యవేక్షణలేకపోవడంతో ఈ భూములు అభివృద్ధికి నోచుకోలేదు. బావులు అడుగంటాయి. చేతి పంపులు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.
 చెంతనే సాగర్ కాల్వ ఉన్నా..
 190 సర్వేనంబర్‌లో గల భూములకు రెండు కిలోమీటర్ల దూరంలో సాగర్ ఎడమ కాల్వ ఉంది. అయినా ఈ భూములకు చుక్క నీరు అందే పరిస్థితి లేదు. 20 ఏళ్ల కిందట ఈ భూముల మీదుగా ఆర్-9 ఎత్తిపోతల పథ కాన్ని నిర్మించారు. క్రిష్ణానగర్ మీదుగా రామాపురం, ఎక్లాస్‌ఖాన్‌పేట తండా, ఆకుపా ముల, ముకుందాపురం గ్రామాలకు సాగు నీరందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. కానీ ఈ డిజైన్ ప్రకారం నీరందకపోవడంతో వందల ఎకరాల భూము లు బీళ్లుగానే ఉంటున్నాయి.
 హామీ ఏమైంది?
 నడిగూడెం మండలం నిమ్మసాగుకు ప్రసిద్ధి. దాదాపు 2500 ఎకరాలకు పైగానే ఈ పంట సాగులో ఉంది. నిమ్మ ఆధారిత పరిశ్రమను పెట్టాలని ఎప్పటి నుంచో ఈ మండల రైతులు కోరుతున్నారు. గతంలో పనిచేసిన ఓ కలెక్టర్ కూడా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ హామీ నేటికీ నెరవేరలేదు. ఈ 190 సర్వేనంబర్ పరిధిలోని భూముల్లో నిమ్మ ఆధారిత పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నడిగూడెం, మునగాల, కోదాడ మండలాలకు చెందిన ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు చెబుతున్నారు.
 పాసుపుస్తకాల పంపిణీలో అవకతవకలు
 ఈ సర్వేనంబర్ భూముల్లోని రైతులకు ఏక్‌సాల్ పట్టాలనిస్తున్నారు. అంటే ఒక ఏడాది మాత్రమే పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇస్తుంటారు. వీటిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి. ఈ పాస్‌పుస్తకాల పంపిణీలో సంబంధిత వీఆర్‌ఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో వారు భూములు లేనివారికి పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారని పలువురు రైతులంటున్నారు.

ఎక్కువ భూములున్నవారికి తక్కువ ఉన్నట్టు, తక్కువ భూములున్న వారికి ఎక్కువున్నట్టు రికార్డుల్లో చేర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది రామాపురం, ఎక్లాస్‌కాన్‌పేట, తెల్లబెల్లి గ్రామాలకు చెందిన బడా రైతులు ఈ సర్వేనంబరు భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పలువురు రైతులు పాస్‌పుస్తకాలు లేకున్నా వారి పరిధి లోని భూములను అక్రమంగా విక్రయి స్తున్నారు. ఇకనైనా  ఉన్నతాధికారులు స్పం దించి ఈ భూములను అభివృద్ధ్ది చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement