కొట్టుకుపోయిన సాగర్‌ ఎడమకాలువ ఎస్కేప్‌ షట్టర్‌ | Left drain escape shutter of washed out Sagar | Sakshi
Sakshi News home page

కొట్టుకుపోయిన సాగర్‌ ఎడమకాలువ ఎస్కేప్‌ షట్టర్‌

Published Tue, Nov 21 2023 4:10 AM | Last Updated on Tue, Nov 21 2023 4:10 AM

Left drain escape shutter of washed out Sagar - Sakshi

చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం పరిధిలో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు ఏర్పాటు చేసిన ఎస్కేప్‌ షట్టర్‌ నీటి ప్రవాహానికి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కొట్టుకుపోయింది. దీంతో సుమారు 1,500 క్యూసెక్కుల వరద కాలువ నుంచి బయటికెళ్లి సమీప గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది. నాగార్జున్‌ సాగర్‌ ప్రధాన కాలువ 113.14వ కిలోమీటర్‌ వద్ద కాలువకు అనుబంధంగా 18 ఏళ్ల క్రితం ఎస్కేప్‌ను నిర్మించి రెండు షట్టర్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఈ షట్టర్లను తొలగించి, కొత్తగా ఎస్కేప్‌ ఏర్పాటు చేయా లని నిర్ణయించిన ఎన్‌ఎస్‌పీ అధికారులు రూ.62 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సాగర్‌ ఆయకట్టు పరిధి రెండో జోన్‌లోని పంటలను కాపాడటంలో భాగంగా అధికారులు పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు ఈనెల 16న నాగార్జునసాగర్‌లో 6,200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలా లు నేరుగా పాలేరుకు వెళ్తున్నాయి.

19.5 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్తుండటంతో శిథిలావస్థకు చేరిన ఎస్కేప్‌ షట్టర్‌ కొట్టుకుపోయిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు షట్టర్‌కు బిగించిన బేరింగ్‌లను ఇటీవల దుండగులు ఎత్తుకుపోయారు. దీంతోపాటు చిలుకూరు మండలం బేతవోలు చెరువును నింపేందుకు రై తులు జేసీబీతో షట్టర్‌ను కొద్దిగా పైకి లేపిన ట్లు తెలిసింది. ఈక్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గేటు తట్టుకోలేక కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు.  

కాలువ కింద, పక్కన ఏమైనా సంఘటన జరిగినప్పుడు నీళ్ల తాకిడిని తగ్గించి మళ్లించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన దానిని ఎస్కేప్‌ షట్టర్‌ను అంటారు.  ఆయకట్టు పరిధిలోని మునగాల, బరాఖత్‌గూడెం, ముకుందాపురం, చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు 600 ఎకరాల చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు.

విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌పీ సీఈ రమేష్, ఈఈ సత్యనారాయ ణ, డీఈ రఘు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సాగర్, అడవిదేవులపల్లి రిజర్వాయర్‌ వద్ద నీటిని నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షట్టర్‌ కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, కొట్టుకుపోయిన గేటు స్థానంలో సోమవారం రాత్రి కొత్త గేటును అమర్చినట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement