మరో మహిళను కాపాడిన స్థానికులు
నిడమనూరు మండలం
బొక్కమంతలపాడులో ఘటన
త్రిపురారం: ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన నిడమనూరు మండలంలోని బొక్కమంతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వేదవరపు సాయి (25) కుటుంబ సభ్యులతో కలిసి అడవిదేవులపల్లి రోడ్డులో గత 10 సంవత్సరాల నుంచి కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు.
దుకాణంలో పని చేయడానికి మండల కేద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మేదరి శైలజ, అవిరెండ్ల రమాదేవి కూలి పనికి వెళ్లారు. కూరగాయలు తెచ్చే ట్రేలు కడగడంతో పాటు, బట్టలు ఉతకడానికి తన సొంత టాటా ఏస్ వాహనంలో మేదరి శైలజ, అవిరెండ్ల రమాదేవితోపాటు సాయి నిడమనూరు మండలంలోని బొక్కమంతలపాడులోని ఎడమ కాలువ వద్దకు వెళ్లారు.
సాయి కాలువ కట్టపై ఉన్నాడు. శైలజ, రమాదేవి కాలువలో బట్టలు ఉతికి పైకి వస్తున్న క్రమంలో శైలజ కాలుజారి కాలువలో పడింది. శైలజను కాపాడే ప్రయత్నంలో రమాదేవి కూడా కాలువలో పడడంతో సాయి గమనించి అందులోకి దిగాడు. వెంటనే స్థానికులు వచ్చి చీరల సాయంతో అవిరెండ్ల రమాదేవిని కాపాడారు. శైలజ, సాయిని కాపాడే సమయంలో నీటి ఉధృతికి వారు లోపలికి కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న నిడమనూరు ఎస్‌ఐ గోపాల్ రావు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ఉధృతి అధికంగా ఉండడంతో వారు పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు కొట్టుకురావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment