161.97 టీఎంసీలకు పెరిగిన నిల్వ..
రేపట్నుంచి ఎడమకాల్వకు నీటి విడుదల..
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 2,18,622 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 526.8 అడుగుల వద్ద 161.97 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 151 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో ఐదారు రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,62,411 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి.. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 2,83,360 క్యూసెక్కుల నీటి ని దిగువకు వదిలేస్తున్నారు.
ఆ జలాలు నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.35 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 2.81 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగ, భద్ర, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. భద్ర డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి తుంగభద్రలో ప్రవాహం రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని డ్యామ్ అధికారులను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. ఆ మేరకు దిగువకు వరదను విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్రల్లో వరద పెరిగిన నేపథ్యంలో గురువారం నుంచి శ్రీశైలానికి చేరే వరద మరింత పెరగనుంది.
మిడ్‌మానేరుకు జలకళ
బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా వెలవెలబోయిన మిడ్‌మానేరు ప్రాజెక్టుకు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా శించిన మేర వర్షాలు కురవకపోవడంతో మిడ్‌మానేరుకు పెద్దగా వరద చేరలేదు. దీంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందారు. ఈక్రమంలో కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో జూలై 27న గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల ప్రారంభించారు.
మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఐదు రోజుల క్రితం 5.90 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. రోజుకు15 వేల క్యూసెక్కుల చొప్పున ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగడంతో బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులో 10.55 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment