సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గందరగోళం నెలకొంది. దాదాపు పది రోజులుగా చెల్లింపులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. చివరకు పథకం అమలులో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం ఈ నెలలో వేతనాలు అందలేదు. దీంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అయితే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ.. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవంగా తలెత్తిన సమస్య ఏమిటనే అంశంపై వారికి కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. జిల్లాలో 24 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది.
ఈ పథకానికి సంబంధించి చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్‌లైన్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించినప్పటికీ.. నిధులను జిల్లా ప్రాజెక్టులకు విడుదల చేయకుండా రాష్ట్ర కార్యాలయం నుంచే ఆన్‌లైన్‌లో నేరుగా బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తున్నారు. కూలిడబ్బులు మొదలు సిబ్బంది వేతనాలు, వివిధ కార్యక్రమాల కింద చేపట్టే ఖర్చులన్నీ ఆన్‌లైన్ ద్వారానే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఆకస్మికంగా చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోవడంతో క్షే త్రస్థాయిలో కూలీల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎందుకిలా?
సిబ్బంది వేతనాలు, కూలీలకు డబ్బులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు ఒక్కసారిగా నిలిచిపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు సైతం వివరించినప్పటికీ.. రెండు,మూడు రోజుల్లో పరిష్కరిస్తామని బదులిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తి ఉంటాయని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘ఉపాధి’లో అయోమయం!
Published Thu, Mar 6 2014 12:09 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement