online problems
-
స్కాలర్షిప్ దరఖాస్తులకు బ్రేక్!
శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు 2018–19 విద్యాసంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కానీ.. దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తే సంబంధిత కళాశాలలు, కోర్సుల వివరాలు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కారణమేం టని కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికా రుల చేతుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 30తో కొత్త దరఖాస్తుల గడువు ముగుస్తుండడంతో విద్యార్థులు కలవరపడుతున్నారు. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలాఖరున ముగియనుంది. కానీ.. నేటికీ కొత్తగా కోర్సుల్లో చేరిన డిగ్రీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ఈ–పాస్‌లో కళాశాలల వివరాలు లేకపోవడంతో సాధ్యపడడం లేదు. ఏటా యూనివర్సి టీ అధికారులు అనుబంధ హోదా పక్రియ ముగి సిన తర్వాత హోదా దక్కిన కళాశాలల వివరాల ను ఈ–పాస్‌కు అనుసంధానం చేయాల్సి ఉం టుంది. అయితే నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికారులు ఈ విషయంలో జా ప్యం వీడి వెంటనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోనేలా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని విద్యార్థులు, వి ద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పక్రియ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకున్న వారు ఉపకారవేతనాల దరఖాస్తుకు సిద్ధమయ్యారు. ఆ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 70 రోజులు గడిచినా ఇంతవరకు దరఖాస్తు చేసుకోనే వీలులేకపోవడంతో ప్రతిరోజూ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ల డం.. నిరాశతో తిరిగి రావడం విద్యార్థుల వంతవుతోంది. కొందరు విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తే.. యూనివర్సిటీ, ఈ పాస్ అధికారుల చేతులో ఉంటుందని సర్దిచెబుతూ వస్తున్నారు. కానీ అసలు విషయం మరో లా ఉంది. శాతవాహన యూనివర్సిటీ అధికారులకే ఈపాస్‌కు సంబంధించిన లాగిన్ సమాచారం లేకపోవడంతోనే కళాశాలల వివరాలు అనుసంధానం కాలేదని సమాచారం. కేవలం శాతవాహనకే కాకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు సమాచారం. ఈ పాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు కావాల్సిన లాగిన్ సమాచారమిస్తేనే కళాశాలల వివరాలు ఈ–పాస్‌లో నమోదయ్యే అవకాశముంటుంది. తర్వాత యథావిధిగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. అనుసంధానం పూర్తయ్యేదెన్నడో...! ఉపకార వేతనాల దరఖాస్తులు ప్రారంభం రోజులు గడుస్తున్నా నేటికీ అవకాశం లేకపోవడంతో డిగ్రీ మొదటి సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు అనుసంధానికి కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ జాప్యానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనుబంధ హోదా ప్రకటించిన తర్వాత ఆయా కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ అధికారులు అనుసంధానం చేస్తేనే విద్యార్థులకు దరఖాస్తులు చేసుకునే అవకాశముంటుంది. గడువు ఈనెల 30 వరకు ఉందిగానీ శాతవాహన అధికారులకే లాగిన్ సమాచారం లేకపోవడంతో అనుసంధానం ఆలస్యమవడం ఖాయమని తెలుస్తోంది. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ–పాస్ అధికారులు, యూనివర్సిటీలకు లాగిన్ సమాచారమందిస్తాయని, అనంతరం అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని, అప్పటి వరకు విద్యార్థులు వేచిచూడక తప్పదని అధికారవర్గాల ద్వారా సమాచారం. ఈ–పాస్ అధికారులు సత్వరమే స్పందించి దరఖాస్తుల ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మేలు చేకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. లాగిన్ సమాచారం రాలేదు... ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నవారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ పాస్ అధికారుల నుంచి శాతవాహనకు లాగిన్ సమాచారం రాలేదు. కళాశాలల సమాచారం అనుసం«ధానం చేయలేదు. శాతవాహనతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉంది. కాకతీయ, శాతవాహన పరిధిలోని పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయిన తర్వాత లాగిన్ సమాచారం వచ్చి అనుసంధానం చేసే అవకాశాలుంటాయి. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
ఆన్లైన్.. ఆలస్యం
బిల్లుల కోసం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంకా ఎదురుచూపులు తప్పడంలేదు. వైఎస్ హయాంలో ఈ పథకం ప్రారంభించగా.. ‘డబుల్’ ఇళ్ల రాకతో బిల్లులు నిలిచిపోయాయి. ఆందోళన చెందిన లబ్ధిదారులు అధికారులను వేడుకోవడంతో ప్రభుత్వం తహసీల్దార్లతో సర్వే చేయించింది. ఆ వివరాల ఆన్లైన్.. జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. దశలవారీగా ఇళ్లకు సంబంధించిన బిల్లులు విడుదల చేసేవారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి మరీ ఇళ్లను నిర్మించుకున్నామని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు బిల్లులు నిలిపిస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారు యంత్రాంగం చుట్టూ తిరిగి విన్నవించుకున్నారు. స్పందించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్లతో సర్వే చేపట్టింది. నివేదిక ఇచ్చి ఏడాది.. 2008వ సంవత్సరం నుంచి 2015 వరకు ఇందిరమ్మ పథకం కింద 6,724మంది నిర్మాణాలు వివిధ దశల్లో పూర్తి చేసుకుంటున్నారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు అందలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, కొంతమంది అసలు ఇళ్లను నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అర్హులను గుర్తించేందుకు తహసీల్దార్లతో విచారణ చేయించారు. బృందాలుగా ఏర్పడిన తహసీల్దార్లు గ్రామాల్లో విచారణ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ వివరాలను కలెక్టరేట్‌కు పంపించారు. విచారణ పూర్తయి సుమారు ఏడాది కావస్తున్నా ఆన్లైన్లో జాప్యం కారణంగా లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నత్తనడకన ఆన్లైన్.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఆన్లైన్ అంశం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోంది. తహసీల్దార్లు విచారణ నివేదికను కలెక్టరేట్‌కు పంపించిన ఏడాది కావొస్తోంది. అయినా ఆన్లైన్ చేయటంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చుకున్న అప్పులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,724మంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిలో 1,874కు సంబంధించి ఆన్లైన్ కాగా, వారికి సంబం«ధించిన రూ.2.06కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన 4,845మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఇంకా ఆన్లైన్ కాలేదు. సిబ్బంది కొరత కారణంగా ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఈ ఆన్లైన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీంతో వివరాల నమోదు, నత్తనడకన సాగుతోంది. -
‘ఆన్లైన్’ ఆటంకాలు
- తెరుచుకోని ‘కార్పొరేట్ విద్య’ దరఖాస్తు వెబ్సైట్ -ఈ నెల 27న ముగియనున్న గడువు - తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్య కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు ఆన్లైన్ షాక్ ఇస్తోంది. వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి.. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులను ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదివిస్తుంది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 18 నుంచి 27 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్‌కాపీని ఆయా సంక్షేమ శాఖల కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొంది. జిల్లాలో మొత్తం 232 సీట్లు భర్తీ చేయనున్నారు. పదోతరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో భోజనం, వసతితో కూడిన విద్యను అందజేస్తారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ విద్యార్థినులకు 50 శాతం, ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 25 శాతం, రెసిడెన్షియల్, నవోదయ పాఠశాలల విద్యార్థులకు 20 శాతం, ప్రతిభ గల విద్యార్థుల పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు. సమీపిస్తున్న గడువు ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయింది. దరఖాస్తుకు ఇక మిగిలింది మూడు రోజులే. కానీ ఇప్పటికీ వెబ్సైట్ తెరుచుకోలేదు. వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజూ ఆన్లైన్, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వెబ్సైట్ తెరవగానే ‘2016–17 (గడిచిన సంవత్సరం) కార్పొరేట్ అడ్మిషన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లోజ్’ అని వస్తోంది. ఈ ఏడాది దరఖాస్తుకు ఆప్షన్ కన్పించడం లేదు. మరోవైపు విద్యార్థులు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మా చేతుల్లో ఏమీ లేదు. ఆన్లైన్ ఓపెన్ అయితే దరఖాస్తు చేయండి. లేదంటే లేదు’ అంటూ ఉచిత సలహా ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. -
రుణమాఫీకి ఆన్లైన్ ఇక్కట్లు
రుణమాఫీకి సంబంధించి ఆన్లైన్ ఇక్కట్లు నెలకొన్నాయి. ప్రతి జిల్లాకు వెబ్సైట్లు ఉన్నా ...ప్రభుత్వం కేవలం ఒకే ఒక వెబ్సైట్లో రాష్ర్టం మొత్తం జాబితా విడుదల చేయడంతో అది ఓపెన్ కాక రైతులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. అఫిడవిట్ ఇస్తేనే రుణమాఫీ అవుతుందని, దాని ఫార్మాట్ వివరాలు తమకు అందాల్సి ఉందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. దీంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నెట్‌సెంటర్ల వద్ద రైతుల హడావుడి కనిపించింది. ఒంగోలు: జిల్లాలో మొత్తం 7 లక్షలకుపైగా ఖాతాల వివరాలను బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. వీటికి సంబంధించి దాదాపు రూ.6500 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు అంటూ షరతులు విధించడంతో 40 శాతం మందికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. అయితే తాజాగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కూడా మిళితం చేయడంతో ఖాతాదారులకు రద్దయ్యే మొత్తం మరింతగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన సీఎం విలేకరుల సమావేశం నిర్వహించి రూ.50 వేల లోపు రుణం మొత్తం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఒకే దశలో జరుగుతుందని ఈనెల 6వ తేదీ వెబ్సైట్లో వివరాలను పెడుతున్నట్లు పేర్కొన్నారు. కానీ 6వ తేదీ నెట్ సెంటర్లు, బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మరో వైపు బ్యాంకర్లు కూడా రైతుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఆదివారం కూడా బ్యాంకులకు పరుగులు పెట్టారు. అయినా సాయంత్రం వరకు ఎక్కడా ప్రభుత్వం సూచించిన వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దీంతో ఇది కూడా బాబు చెబుతున్న మాటల్లో మరో మాయగా అందరూ భావించారు. అయితే సాయంత్రం 6.30 గంటల నుంచి వెబ్సైట్ ఓపెన్ అవుతుండడంతో జనంలో ఉత్కంఠ ప్రారంభమైంది. అందులో కూడా ఎవరి వివరాలు వారు చూసుకోవడమే తప్ప అందరి వివరాలు చూసుకునే అవకాశం లభించలేదు. రుణమాఫీ పేరుతో ఏర్పాటుచేసిన ఆ వెబ్సైట్లో కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లోన్ అకౌంట్ వివరాల్లో ఏదో ఒకటి పొందుపరిస్తే మాత్రమే సంబంధిత రైతు వివరాలు వెల్లడయ్యేలా ఏర్పాటు చేశారు. తాజా వడ్డీ ఎవరు చెల్లించాలి: ఇప్పటి వరకు బ్యాంకర్లు తయారు చేసిన రుణమాఫీ మొత్తం వివరాలు 2013 డిసెంబర్ ఆఖరు నాటికి మాత్రమే. రూ.50 వేల లోపు మొత్తానికి ఒకే సారి జమచేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం 11 నెలలు గడిచిపోయాయి. మరి...ఈ 11 నెలలకు సంబంధించి అయిన వడ్డీ ఎవరు చెల్లిస్తారనేది బ్యాంకర్ల ముందున్న ప్రశ్న. దానిని ఖాతాదారుని వద్ద నుంచి వసూలు చేసుకోక తప్పదని బ్యాంకర్లు అంటున్నారు. దీనికితోడు అఫిడవిట్లు కూడా దాఖలు చేస్తేనే రుణం మాఫీ చేయడానికి అవకాశం ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇంత వరకు అఫిడవిట్‌కు సంబంధించి ఫార్మాట్లు కూడా బ్యాంకర్లకు అందలేదు. బ్యాంక ర్లందరికీ రుణమాఫీ ఖాతాలు పంపామని చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం తమకు ఇంతవరకు పూర్తి వివరాలు అందలేదని చెబుతుండడం గమనార్హం. ప్రాథమిక అంచనా ప్రకారం 7 లక్షల ఖాతాల్లో దాదాపు 4 లక్షల వరకు రుణాలు రద్దయ్యే అవకాశం ఉందని, అయితే అందులో తొలిదశలో కేవలం 1.30 లక్షల ఖాతాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా. -
ఆన్లైన్ సమస్యలు..!
విజయనగరం అర్బన్: ఫీజు రీయింబర్సమెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాల షెడ్యూల్డ్ కులాల వి ద్యార్థులకు (5 నుంచి 10వ తరగతి) ఇచ్చే ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు, కళాశాల విద్యార్థులకు ఇచ్చే పోస్టు మెట్రిక్, ఫీజు రీయింబర్స్మెంట్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఉపకార వేతనాల లబ్ధిదారులు కలిపి 60 వేల మంది ఉంటారు. ఈ నెల మొదటి వారంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరణ ప్రారంభించగా ఇంకా 25 వేల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 17వ తేదీతో గడువు ముగియగా నెలాఖరు వరకు గ డువు పొడిగిస్తున్న ట్లు అధికారులు ప్ర కటించారు. ఆన్లైన్ సమస్యతో పాటు ధ్రువపత్రాల జారీ లో కూడా జాప్యం జరుగుతుండడంతో విద్యార్థుల కష్టాలు అధికమవుతున్నాయి. ధ్రువీకరణ పత్రాల కోసం పాట్లు... ఉపకార వేతనాల దరఖాస్తుకు అవసరమైన ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలను సంపాదించుకోవడానికి విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. మండల స్థాయి అధికారులు, మీ సేవ కేంద్రాల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపమైంది. ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ గుడువు ఇచ్చినప్పటికీ లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెలాఖరుకు గడువు పొడించారు. మీ-సేవ కేంద్రాల వద్ద ప్రతి రోజూ విద్యార్థుల రద్దీ ఉం టుంది. తహశీల్దార్ కార్యాలయంలోనూ అదే పరిస్థితి. కొన్ని చోట్ల అప్లోడ్ అయినా అధికారిక పత్రాలు తమ వద్ద లేవని, ప్రింట్ తీసి ఇవ్వలేమని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు బాహా టంగా చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఇదే అ దునుగా తీసుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేవలం రూ.35 మాత్రమే తీసుకోవాల్సి ఉంది. కానీ పట్టణ పరిధిలోని పలుచోట్ల మీసేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేం దుకు రూ.50 నుంచి రూ.100 తీసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఉపకార వేతన దరఖాస్తుల కోసం ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలంటూ ప్రభుత్వం షరతులు విధించింది. ఈ నిబంధనలతోనే విద్యార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలను త్వరగా జారీ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయకుండా ఇలా నిబంధనలు, షరతులు విధించుకుంటూ పోవడం సరికాదని విద్యార్థులు చెబుతున్నారు. -
‘ఉపాధి’లో అయోమయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గందరగోళం నెలకొంది. దాదాపు పది రోజులుగా చెల్లింపులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. చివరకు పథకం అమలులో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం ఈ నెలలో వేతనాలు అందలేదు. దీంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అయితే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ.. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవంగా తలెత్తిన సమస్య ఏమిటనే అంశంపై వారికి కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. జిల్లాలో 24 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ పథకానికి సంబంధించి చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్లైన్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించినప్పటికీ.. నిధులను జిల్లా ప్రాజెక్టులకు విడుదల చేయకుండా రాష్ట్ర కార్యాలయం నుంచే ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తున్నారు. కూలిడబ్బులు మొదలు సిబ్బంది వేతనాలు, వివిధ కార్యక్రమాల కింద చేపట్టే ఖర్చులన్నీ ఆన్లైన్ ద్వారానే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఆకస్మికంగా చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోవడంతో క్షే త్రస్థాయిలో కూలీల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలా? సిబ్బంది వేతనాలు, కూలీలకు డబ్బులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు ఒక్కసారిగా నిలిచిపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు సైతం వివరించినప్పటికీ.. రెండు,మూడు రోజుల్లో పరిష్కరిస్తామని బదులిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తి ఉంటాయని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.