- తెరుచుకోని ‘కార్పొరేట్ విద్య’ దరఖాస్తు వెబ్‌సైట్
-ఈ నెల 27న ముగియనున్న గడువు
- తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్య కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు ఆన్‌లైన్ షాక్ ఇస్తోంది. వెబ్‌సైట్ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి.. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులను ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదివిస్తుంది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 18 నుంచి 27 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్‌కాపీని ఆయా సంక్షేమ శాఖల కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొంది. జిల్లాలో మొత్తం 232 సీట్లు భర్తీ చేయనున్నారు. పదోతరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో భోజనం, వసతితో కూడిన విద్యను అందజేస్తారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ విద్యార్థినులకు 50 శాతం, ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 25 శాతం, రెసిడెన్షియల్, నవోదయ పాఠశాలల విద్యార్థులకు 20 శాతం, ప్రతిభ గల విద్యార్థుల పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు.
సమీపిస్తున్న గడువు
ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయింది. దరఖాస్తుకు ఇక మిగిలింది మూడు రోజులే. కానీ ఇప్పటికీ వెబ్‌సైట్ తెరుచుకోలేదు. వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజూ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వెబ్‌సైట్ తెరవగానే ‘2016–17 (గడిచిన సంవత్సరం) కార్పొరేట్ అడ్మిషన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లోజ్’ అని వస్తోంది. ఈ ఏడాది దరఖాస్తుకు ఆప్షన్ కన్పించడం లేదు. మరోవైపు విద్యార్థులు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మా చేతుల్లో ఏమీ లేదు. ఆన్‌లైన్ ఓపెన్ అయితే దరఖాస్తు చేయండి. లేదంటే లేదు’ అంటూ ఉచిత సలహా ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
‘ఆన్‌లైన్’ ఆటంకాలు
Published Wed, May 24 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
Advertisement