రుణమాఫీకి సంబంధించి ఆన్‌లైన్ ఇక్కట్లు నెలకొన్నాయి. ప్రతి జిల్లాకు వెబ్‌సైట్లు ఉన్నా ...ప్రభుత్వం కేవలం ఒకే ఒక వెబ్‌సైట్‌లో రాష్ర్టం మొత్తం జాబితా విడుదల చేయడంతో అది ఓపెన్ కాక రైతులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. అఫిడవిట్ ఇస్తేనే రుణమాఫీ అవుతుందని, దాని ఫార్మాట్ వివరాలు తమకు అందాల్సి ఉందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. దీంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నెట్‌సెంటర్ల వద్ద రైతుల హడావుడి కనిపించింది.
ఒంగోలు: జిల్లాలో మొత్తం 7 లక్షలకుపైగా ఖాతాల వివరాలను బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. వీటికి సంబంధించి దాదాపు రూ.6500 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు అంటూ షరతులు విధించడంతో 40 శాతం మందికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. అయితే తాజాగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కూడా మిళితం చేయడంతో ఖాతాదారులకు రద్దయ్యే మొత్తం మరింతగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన సీఎం విలేకరుల సమావేశం నిర్వహించి రూ.50 వేల లోపు రుణం మొత్తం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఒకే దశలో జరుగుతుందని ఈనెల 6వ తేదీ వెబ్‌సైట్లో వివరాలను పెడుతున్నట్లు పేర్కొన్నారు. కానీ 6వ తేదీ నెట్ సెంటర్లు, బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
మరో వైపు బ్యాంకర్లు కూడా రైతుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఆదివారం కూడా బ్యాంకులకు పరుగులు పెట్టారు. అయినా సాయంత్రం వరకు ఎక్కడా ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. దీంతో ఇది కూడా బాబు చెబుతున్న మాటల్లో మరో మాయగా అందరూ భావించారు. అయితే సాయంత్రం 6.30 గంటల నుంచి వెబ్‌సైట్ ఓపెన్ అవుతుండడంతో జనంలో ఉత్కంఠ ప్రారంభమైంది. అందులో కూడా ఎవరి వివరాలు వారు చూసుకోవడమే తప్ప అందరి వివరాలు చూసుకునే అవకాశం లభించలేదు. రుణమాఫీ పేరుతో ఏర్పాటుచేసిన ఆ వెబ్‌సైట్‌లో కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లోన్ అకౌంట్ వివరాల్లో ఏదో ఒకటి పొందుపరిస్తే మాత్రమే సంబంధిత రైతు వివరాలు వెల్లడయ్యేలా ఏర్పాటు చేశారు.
తాజా వడ్డీ ఎవరు చెల్లించాలి:
ఇప్పటి వరకు బ్యాంకర్లు తయారు చేసిన రుణమాఫీ మొత్తం వివరాలు 2013 డిసెంబర్ ఆఖరు నాటికి మాత్రమే. రూ.50 వేల లోపు మొత్తానికి ఒకే సారి జమచేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం 11 నెలలు గడిచిపోయాయి. మరి...ఈ 11 నెలలకు సంబంధించి అయిన వడ్డీ ఎవరు చెల్లిస్తారనేది బ్యాంకర్ల ముందున్న ప్రశ్న. దానిని ఖాతాదారుని వద్ద నుంచి వసూలు చేసుకోక తప్పదని బ్యాంకర్లు అంటున్నారు.
దీనికితోడు అఫిడవిట్‌లు కూడా దాఖలు చేస్తేనే రుణం మాఫీ చేయడానికి అవకాశం ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇంత వరకు అఫిడవిట్‌కు సంబంధించి ఫార్మాట్‌లు కూడా బ్యాంకర్లకు అందలేదు. బ్యాంక ర్లందరికీ రుణమాఫీ ఖాతాలు పంపామని చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం తమకు ఇంతవరకు పూర్తి వివరాలు అందలేదని చెబుతుండడం గమనార్హం. ప్రాథమిక అంచనా ప్రకారం 7 లక్షల ఖాతాల్లో దాదాపు 4 లక్షల వరకు రుణాలు రద్దయ్యే అవకాశం ఉందని, అయితే అందులో తొలిదశలో కేవలం 1.30 లక్షల ఖాతాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా.
రుణమాఫీకి ఆన్‌లైన్ ఇక్కట్లు
Published Mon, Dec 8 2014 1:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement