సంగారెడ్డి టౌన్/సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోరుతూ మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాము ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీని రైతాంగం స్వాగతిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం సాధ్యపడదనడం విడ్డూరమని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి పథకాలను అటకెక్కించి ప్రజలను కేసీఆర్ మోసగించారని విమర్శించారు.
‘‘మాటిచ్చి తప్పడం కాంగ్రెస్‌కు అలవాటు లేదు. వ్యవసాయంపై, రైతులపై మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. రైతుల ఆత్మహత్యలు నివారించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది. ‘‘గతంలో విపక్షాలు అసాధ్యమన్నా మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే’’అని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని నాలుగు దఫాలుగా చేయడంతో వడ్డీ భారాన్ని రైతులు భరించలేకపోయారన్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు టంచనుగా నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల జోలికొస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ను హెచ్చరించారు. సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇప్పటికే ప్రకటించాల్సిందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీవి ఆపద మొక్కులని, రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత నాగం జనార్దనరెడ్డి దుయ్యబట్టారు. తమవి ఆపద మొక్కులు కాదని, అధికారంలోకి రాగానే అమలు చేసి చూపుతామని చెప్పారు. టీఆర్‌ఎస్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను గట్టెక్కించేందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాక ఆయన తొలిసారి బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులను నమ్మించి మోసగించిన వారిలో కేసీఆర్ నంబర్‌వన్ అని దుయ్యబట్టారు. రుణమాఫీ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదన్నారు.
వేరుశనగ సాగుపై క్వింటాకు రూ.1,200 నష్టం వస్తుంటే రూ.4 వేల పెట్టుబడి సాయం రైతును ఎలా ఆదుకుంటుందని ప్రశ్నించారు. తాను టికెట్లు, సీట్లు, పదవుల కోసం కాంగ్రెస్‌లోకి రాలేదని నాగం చెప్పారు. టీఆర్‌ఎస్‌పై పోరాడేందుకు, కేసీఆర్ అవినీతిని బయటపెట్టేందుకే చేరానన్నారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్, కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి పాల్గొన్నారు. గతంలో హామీ మేరకు ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని కోదండరెడ్డి అన్నారు. అలాగే రూ.2లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment