జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సభలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. హాజరైన జనం
సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం వస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా బుధవారం ములుగులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉత్తమ్ మాట్లాడారు. ఎవరు ఎన్ని ప్రయ త్నాలు చేసినా 2019లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబమే బంగారుమయం అయిందని ఎద్దేవా చేశారు. ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తానని మేడారంలో హామీ ఇచ్చి తప్పిన కేసీఆర్‌కు.. అమ్మల శాపం తగులుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమ్మల పేరిట జిల్లా చేసి తీరుతామని స్పష్టం చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాడ్వాయి మండలం జలగలంచ గుత్తికోయ మహిళలను చెట్లకు కట్టి అవమానించడం సిగ్గు చేటన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఇప్పటి వరకు స్థల సేకరణ జరగలేదని, నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.10 లక్షల ఏ మూలకు సరిపోతాయని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రతీ పనికి 6 శాతం కమీషన్ తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నా రని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మొక్కజొన్న, వరి, సజ్జలకు రూ.2 వేలు, పత్తికి రూ. 6 వేలు, మిర్చికి రూ.10 వేలకు తగ్గకుం డా మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
పండించిన పంటను కొను: రేవంత్
కోటి ఎకరాలకు నీటిని అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్.. ముందు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రం ఏమైన బాగు పడిందా అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడు అరుణ్ తప్పుడు పత్రాలతో రూ.86 కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ వారికి టెండర్లు ఇస్తే తన అవినీతి బయటపడుతుందని, ఆంధ్రవారికి అప్పగిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ అసెంబ్లీలో రైతుల సమస్యలను ప్రస్తావించినందుకే సభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్ట ని అన్నారు. సభలో షబ్బీర్‌అలీ, మల్లు భట్టివిక్రమార్క, మల్లు రవి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment