మార్కొండాపురంలో రైతులు, అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
మార్కొండాపురం (పామూరు): వ్యవసాయ రుణం కింద తీసుకున్న లక్ష రూపాయల్లో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని, అదే విధంగా 2015లో భారీ వర్షాలతో మినుము, పెసర పంటలు ముంపునకు గురై లక్షల్లో నష్టపోగా ఒక్కరూపాయి కూడా పంటనష్ట పరిహారం రాలేదని మండలంలోని మార్కొండాపురం, భూమిరెడ్డిపల్లె, గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వద్ద తమ గోడు వెళ్లబోశారు. మంత్రి ఆదివారం మండలంలోని మార్కొండాపురం సమీపంలోని బోడె క్రిష్ణారెడ్డి ఉద్యానవన శాఖ కింద సాగు చేసిన దానిమ్మ, బత్తాయి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో, రైతు క్రిష్ణారెడ్డితో పెట్టుబడి, దిగుబడి గురించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారా, రుణమాఫీ అయిందా అని రైతు క్రిష్ణారెడ్డిని అడగ్గా లక్ష రూపాయల రుణం తీసుకున్నానని ఒక్కరూపాయి కూడా రుణమాఫీ కాలేదని మంత్రికి చెప్పడంతో మంత్రి అవాక్కయి రుణమాఫీ ఎందుకు కాలేదో పరిశీలించాలని అధికారులను ఆదేశించాడు.
అదే విధంగా భూమిరెడ్డిపల్లె, మార్కొండాపురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు 2015 అధిక వర్షపాతంతో మినుము, పెసర పంటలను పూర్తిగా కుళ్లి, మొలకెత్తి తీవ్రంగా నష్టపోయామని ఒక్కరూపాయి కూడా పరిహారం రాలేదని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని మంత్రి దృష్టికి తేగా పంట నష్టంపై పరిశీలించాలని అధికారులను ఆదేశించాడు. ఈ సందర్భంగా దానిమ్మ తోటలకు రాయితీపై షేడ్‌నెట్ ఇవ్వాలని రైతులు మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. మార్కొండాపురం గ్రామంలో ఉద్యానవన పంటలను పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో బిందు, తుంపరసేద్యం కోసం రూ.228.31 కోట్లు ఖర్చు చేయగా ఇందులో రూ.191 కోట్లు సబ్సిడీగా ఇచ్చారన్నారు.
ఐఫాడ్ ( ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్) పంథకం కింద రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని 105 మండలాల్లో తీవ్రమైన కరువు ప్రాంతాల్లో రూ.1,042 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. విత్తన సబ్సిడీ కింద రూ.540 కోట్లు ఖర్చు చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, కదిరి పార్థసారధి, ప్రకాశరావు, ఎంపీపీ ఆవుల నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఉద్యానవనశాఖ ఒకటో ఏడీ హరిప్రసాద్, రెండో ఏడీ జెన్నమ్మ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, ఏడీఏ చల్లా సుబ్బరాయుడు, హెచ్‌ఓ దీప్తి, ఏఈఓ లెక్కల మాల్యాద్రిరెడ్డి, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment