రుణమాఫీ మాయేనా..? | ap cm chandra babu falls statement in election time | Sakshi
Sakshi News home page

రుణమాఫీ మాయేనా..?

Published Sat, Nov 22 2014 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీ మాయేనా..? - Sakshi

రుణమాఫీ మాయేనా..?

ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నారు
అధికారంలోకి వచ్చాక పంట రుణాలే అంటున్నారు
ముఖ్యమంత్రే మాట మారిస్తే  ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

 
రుణమాఫీపై పూటకో మాట.. రోజుకో ప్రకటన.. అనేక నిబంధనలు.. మరెన్నో మెలికలు.. ఇలా సాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ తీరు. ఎన్నికల్లో ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చి.. కరపత్రాలు పంచి.. మ్యానిఫెస్టోలో చేర్చి.. ప్రచారం చేసిన రుణమాఫీ అంశంపై ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రే మాట మార్చడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. .
 
మచిలీపట్నం : రుణమాఫీపై ముఖ్యమంత్రే మాట మార్చటంతో రైతులు, ఆయా పార్టీల నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో రైతులను మోసగించే విధంగా రుణమాఫీపై రోజుకోవిధంగా మాట్లాడుతుండటంతో అసలు మాఫీ చేస్తారా లేదా అన్న విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయవాడలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తానని తాను అనలేదని, పంట రుణాలు మాత్రమే రద్దు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించటంపై ఆ పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిత్యం తిరిగే తాము రుణమాఫీ అంశంపై ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని లోలోపల వారు మధనపడుతున్నారు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలకు, పంట రుణాలకు తేడా తెలియకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలు ఇచ్చి అనంతరం మాట మార్చడంపై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం తహశీల్దార్లకు పంపిన రుణమాఫీ జాబితాల్లో సగం మందికి పైగా రైతుల పేర్లు లేవు. వీరికి రుణమాఫీ జరుగుతుందా, లేదా అన్నది అనుమానంగానే ఉంది. జిల్లాలో రూ.9,137 కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉంది. 6,29,086 మంది రైతులు వివిధ రకాల పంట రుణాలు తీసుకున్నారు. వీటిలో 1,89,587 మంది రైతులు పంట రుణాల కింద రూ.2,352 కోట్లు, 2,60,737 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్లు, 45,914 మంది రైతులు స్వల్పకాల రుణాల కింద రూ.650 కోట్లు, 1,30,534 మంది రైతులు మధ్యంతర రుణాల కింద రూ.2,774 కోట్లు, 2,314 మంది రైతులు ఇతర రుణాలుగా రూ.86 కోట్లు తీసుకున్నారు. ఈ రుణాల్లో ఏవి రద్దవుతాయి, ఏవి కావు అన్న విషయంపై ఇంకా సందిగ్ధత వీడటం లేదు.

ఎన్ని మెలికలో...

ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతుల కష్టాలు కళ్లారా చూశానని, రైతులను ఆదుకుంటానని, రైతులెవ్వరూ రుణాలు చెల్లించవద్దని, వ్యవసాయ రుణాలన్నింటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రుణమాఫీ అంశాన్ని చేర్చారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసి ఇంటికి బంగారం తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. ఈ మాటలు నమ్మిన రైతులు బ్యాంకుల్లో తాము తీసుకున్న రుణాలను చెల్లించకుండా నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేసేరోజు తొలి సంతకం రుణమాఫీ పైనే చేస్తానని చెప్పారు. పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటనలు ఇచ్చారు. చివరికి రుణమాఫీపై అధ్యయనం చేసేందుకు కోటయ్య కమిటీని నియమిస్తూ తొలి సంతకం చేశారు. వ్యవసాయ రుణాలన్నింటిని మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. రుణమాఫీ జరగాలంటే ఆధార్ నంబరు, పొలం సర్వే నంబరు, అడంగల్ కాపీ తదితర వివరాలను ఇవ్వాలనే ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు పంట రుణం ఎంత తీసుకున్నా ఈ మొత్తాన్ని రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ అవుతుందని ప్రకటించారు. అరటి, పసుపు, కూరగాయలు, మిర్చి తదితర పంటలు సాగు చేసేందుకు తీసుకున్న రుణాలు రుణమాఫీ పరిధిలోకి రావని పేర్కొన్నారు. ఆ తరువాత కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా ఒకరి రుణమే మాఫీ చేస్తామని చెప్పారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణమాఫీ త్వరలో జరుగుతుందని రూ.50 వేల వరకు రుణం ఉంటే ఒకే విడతలో చెల్లిస్తామని ప్రకటించారు. ఇటీవల అన్ని మండల తహశీల్దార్లకు రుణమాఫీ జాబితాలను పంపారు. ఈ జాబితాల్లో ఒకే కుటుంబంలో భార్య పేరు జాబితాలో ఉండగా, భర్త పేరు లేదు. జిల్లాలో సగం మందికి పైగా రుణాలు తీసుకున్న రైతుల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. జాబితాలో ఉన్న పేర్లను బట్టి వారి ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, ఇంటి అడ్రస్సు, ఆ కుటుంబంలోని భార్య లేదా భర్త, కుమారుడు, కుమార్తెల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 18 నాటికి పూర్తి చేయాలని తొలుత ప్రకటించి మళ్లీ ఈ గడువును పెంచారు.
 
డ్వాక్రా సంఘాల రుణాలు రద్దయ్యేనా?

జిల్లాలో 58,250 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలో 5.26 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.918 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు రుణాల రద్దు లేదని, ఒక్కొక్క సంఘానికి లక్ష రూపాయలు కార్పస్ ఫండ్‌గా జమ చేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణం మొత్తం చెల్లించే వరకు ఈ కార్పస్ ఫండ్ వారి ఖాతాలో అలాగే ఉంటుంది తప్ప రుణమాఫీకి జమ కాదని అధికారులు చెబుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. రైతుల రుణమాఫీకే స్పష్టత లేని పరిస్థితుల్లో.. డ్వాక్రా సంఘాల రుణాలు ఎప్పటికి మాఫీ అవుతాయనేది చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీ పేరుతో కాలయాపన చేయటమే తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి జమ చేసింది లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రుణాలన్నీ వడ్డీ లేని రుణాలే కాగా ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవటంతో 14 శాతం మేర వడ్డీ కట్టాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement