‘పశ్చిమ’కు చంద్రబాబు ఏమిస్తారో
‘అధికారంలోకి రాగానే రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై తొలి సంతకం పెడతా.. యువతకు ఉద్యోగాలిస్తా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా.. టీడీపీ అధికారంలోకి రావాలంటే ఈ జిల్లా ఫలితాలే కీలకం.. నాకు అన్ని జిల్లాలు ఓ ఎత్తు.. మీ జిల్లా ఓ ఎత్తు.. మీరు ఓటేయండి.. మిగతావన్నీ నేను చూసుకుం టా’నని ‘పశ్చిమ’ ప్రజల్ని వేడుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బుధవారం జిల్లాలో అడుగుపెడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని.. గుంటూరులో ఎయిమ్స్.. కాకినాడ తీరంలో పెట్రో కెమికల్స్ పరిశ్రమలు.. విశాఖకు రైల్వే జోన్, ఐటీ హబ్ అంటూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వరాల జల్లులు కురిపించిన చంద్రబాబు ఇప్పటివరకూ ఎక్కడా మన జిల్లా ప్రస్తావనే తీసుకురాలేదు. అధికా రం చేపట్టి 50 రోజుల తర్వా త జిల్లాకు వస్తున్న బాబు ఇప్పుడైనా వరాలిస్తారా.. ఎప్పటిలా దింపుడు కళ్లెం ఆశలతో సరిపెట్టేస్తారా అనేది చర్చనీయూంశమైంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనపై ‘పశ్చిమ’ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 50 రోజుల అనంతరం బుధవారం తొలిసారి వస్తున్న ఆయన జిల్లాకు ఏం వరాలు కురిపిస్తారోనంటూ ఎన్నెన్నో అంచనాలతో ఇక్కడి ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ‘టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ జిల్లా ఫలితాలే కీలకం.. నాకు అన్ని జిల్లాలు ఓ ఎత్తు.. పశ్చిమగోదావరి జిల్లా ఓ ఎత్తు’ అంటూ పలు సందర్భాల్లో చం ద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానిం చిన నేపథ్యంలో ఇప్పుడు సీఎంగా ఆయన తొలి పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటివరకు ఒక్క మాటా లేదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 50రోజుల్లో కొత్త ప్రాజెక్టుల ప్రకటనల్లో ఎక్కడా పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తావనే రాలేదు. విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి లేదా అమరావతిలో రాజధాని.. గుంటూరులో ఎయిమ్స్.. కాకినాడ తీరంలో పెట్రో కెమికల్స్.. విశాఖకు రైల్వే జోన్, ఐటీ హబ్ వంటివి వచ్చే లా చూస్తామంటున్న ముఖ్యమంత్రి సహజ, శక్తి వనరులున్న పశ్చిమగోదావరి జిల్లాకు ఏం ఇవ్వనున్నారనేది ఇంతవరకు వెల్లడించలేదు. ఈ తరుణంలో రెండురోజుల పర్యటనలో బాబు జిల్లాకు ఏం వరాలు ఇస్తారోనంటూ సామాన్య ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏలూరులో రాజధానిపై ఏమంటారో!
భారతదేశ ధాన్యాగారంగా, ఆంధ్రా అన్నపూర్ణగా, దేశంలోనే సేంద్రియ వ్యవసాయ పథకం అమలు చేస్తున్న ఏకైక జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ప్రత్యేకతలున్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఇటీవల కాలంలో ఊపందుకుంది. జిల్లాకు చెందిన వ్యాపార, వాణిజ్యవర్గాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు ఏలూరును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలంటూ గళం విప్పుతున్నారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని సదుపాయాలు, సౌకర్యా లు, సహజ, శక్తివనరులు ఈ ప్రాంతానికి ఉన్నాయని వాదిస్తున్నారు. ఏలూరు-హనుమాన్ జంక్షన్ ప్రాంతం రాష్ట్ర రాజధానికి అన్నివిధాలుగా అనువైనదని ప్రతిపాదిస్తున్నారు. భూమి లభ్య త ఇక్కడ ఎక్కువగా ఉంది. లక్ష ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. రాజ దాని చేయనిపక్షంలో విజయవాడ-గుంటూరు-ఏలూరు ప్రాంతాలను త్రినగరిగా ప్రకటించి అభివృద్ధి చేయాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. మరి వీటిపై చంద్రబాబు ఏవిధమైన ప్రకటన చేస్తారన్నది చూడాలి.
పర్యటనలో పోలవరం ప్రస్తావన ఏదీ
చంద్రబాబు రెండురోజుల జిల్లా పర్యటనలో ఎక్కడా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టు బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ సవరణ బిల్లు-2014) ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టు ప్రాం తాన్ని చంద్రబాబు ఈ పర్యటనలో సందర్శిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్వయంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తే పనులు వేగం పుంజుకోవడానికి, కీలకమైన పునరావాసం, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. చంద్ర బాబు గురువారం పోలవరం నియోజ కవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో 3గంటలపాటు పర్యటించన్నారు. ఆయా ప్రాంత రైతులతో ముఖాముఖి చర్చలతోపాటు గ్రామాలను సందర్శించనున్నారు. కొయ్యలగూడెం నుంచే హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. అయితే, అక్కడికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పోలవరం ప్రాజెక్ట్ సందర్శన టూర్ షెడ్యూల్‌లో ఎందుకు చేర్చలేదన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టు సందర్శనను చంద్రబాబు ఎందుకు పక్కనపెట్టారన్నది చర్చనీయాంశంగా మారింది.
రుణమాఫీపై ఇక్కడైనా ప్రకటిస్తారా
వ్యవసాయ రుణాల మాఫీపై ఇంతవరకు చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి తాఖీదులొస్తున్నా అన్నదాతలకు భరోసా ఇచ్చేందుకూ యత్నించలేదు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తిస్తుందని, అది కూడా లక్షన్నరలోపే మాఫీ చేస్తామంటూ మంత్రులు రోజుకొక ప్రకటన ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇటీవల రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అంగీకరించందంటూ చెప్పుకొచ్చారు. దాని పైనా స్పష్టత లేదు. రీ షెడ్యూల్ చేస్తే అప్పుల కోసం రైతులు బ్యాంకుల్లో ఉంచిన డాక్యుమెంట్లు, కుదువపెట్టిన మహిళల నగలు తిరిగిరావు. మరి వాటిని రైతులకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది కూడా చంద్రబాబు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు పాత రుణాలు చెల్లించని రైతులకు కొత్త రుణాలు లభించని దుస్థితి నెలకొంది. ఇప్పటికే రుణమాఫీ జాప్యంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే రైతులకు సంబంధించి వివి ద బ్యాంకుల్లో రూ.12వేల కోట్లకు పైగా రుణాలున్నాయి. మాఫీపై ఈ జిల్లాలో అయినా సీఎం స్ఫష్టమైన ప్రకటన చేస్తారా లేదా అన్నది చూడాలి.
ఆశల పల్లకిలో నేతలు
అధికార పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా చూస్తున్నారు. తమకు ఏ పదవులు కట్టపెడతారోనం టూ ఉవ్విళ్లూరుతున్నారు. ద్వితీయశ్రేణి నేతలు మార్కెట్ కమిటీ, గ్రంధాలయ సంస్థ చైర్మన్, ఆలయ పాలకమండళ్లలో పదవులను ఆశిస్తున్నారు. జిల్లా పర్యటనలో బాబు ఈ అంశంపై పార్టీ శ్రేణులకు హామీ ఇస్తారని భావిస్తున్నారు.