![నేడు తెనాలిలో ‘రైతు కోసం చంద్రన్న’ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41442780717_625x300.jpg.webp?itok=vGS1z9th)
నేడు తెనాలిలో ‘రైతు కోసం చంద్రన్న’
తెనాలి : ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుసంక్షేమ పథకాల అమలు, అధునాతన సాంకేతిక పద్ధతులను రైతులకు నేరుగా వివరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతుకోసం చంద్రన్న’ సోమవారం తెనాలిలో నిర్వహించనున్నారు. రుణమాఫీపై రైతులు, ఇతరుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, స్పష్టతనిచ్చి ఆకట్టుకోవాలనేది నేతల ఆంతర్యంగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, మసకబారుతున్న ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలనేది వ్యూహంగా భావిస్తున్నారు.
మార్కెట్‌యార్డులో.. మార్కెట్‌యార్డులో ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి రైతుకోసం చంద్రన్న ఆరంభమవుతుంది. జిల్లావ్యాప్తంగా 400 బస్సులతో రైతులు, ఆదర్శరైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు వేలాది మందిని సమీకరించేందుకు టీడీపీ నేతలు సన్నాహాల్లో ఉన్నారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను వివిధ గ్రామాలకు ఉదయాన్నే పంపి, రైతులతో సహా సభావేదిక వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
భారీసమీకరణ.. ముఖ్యంగా జనసమీకరణ బాధ్యతను తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు భుజస్కంధాలపై పెట్టినట్టు చెబుతున్నారు.
రుణమాఫీ లబ్ధిదారుల తరలింపు...! ముఖ్యంగా రుణం మాఫీ అయిన రైతులను గుర్తించి. ప్రత్యేకంగా వారిని సభకు తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేశారు. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను గ్రామాలవారీగా సోమవారం నుంచి అందుబాటులో ఉంచేందుకు మరోవైపు ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా 20 వేలమందికి కనీసం అవగాహన కల్పించాలనేది నేతల తాపత్రయంగా కనిపిస్తోంది. అట్టహాసంగా సదస్సు నిర్వహించి రూ.7 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేయటాన్ని కూడా అనుకూల ప్రచారం కాగలదన్న భావన వ్యక్తమవుతోంది. రైతుకోసం చంద్రన్న కార్యక్రమంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనలేదు. సింగపూర్ పర్యటనకు వెళుతున్నందున తెనాలి సభకూ వచ్చే అవకాశం లేదు.
ఎంకి పెళ్లి...సుబ్బి చావుకొచ్చింది..! నగరంపాలెం(గుంటూరు) : తెనాలిలో సోమవారం జరిగే రైతు కోసం చంద్రన్న సభకు జనాన్ని తరలించేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేసే బాధ్యతను రవాణా శాఖ అదికారులకు అప్పగించారు. జిల్లాలోని 57 మండలాల వారీగా మొత్తం 400 బస్సులు ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో 200 బస్సులు ఆర్టీసీ సమకూరుస్తుండగా 200 బస్సులు ప్రైవేటు, స్కూలు బస్సులు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులకు మౌఖికంగా సూచించారు.
సోమవారం స్కూళ్లకు పనిదినం కావటం వలన స్కూలు బస్సులు ఏర్పాటు కుదరదని చెప్పారు. నగరంలో తిరుగుతున్న ప్రైవేటు సిటీ బస్సులు, ట్రావెల్స్ బస్సులు మొత్తం 75 వరకు మాత్రమే సమకూర్చుతామని తెలిపారు. అవకాశం ఉన్నంతవరకు 75 జీపులు, కార్లు, సుమోలు తదితర వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ అదనంగా మరో 60 బస్సులు కూడా ఇవ్వాలని ఆ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.