ఆన్‌లైన్ సమస్యలు..!
విజయనగరం అర్బన్: ఫీజు రీయింబర్‌సమెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాల షెడ్యూల్డ్ కులాల వి ద్యార్థులకు (5 నుంచి 10వ తరగతి) ఇచ్చే ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు, కళాశాల విద్యార్థులకు ఇచ్చే పోస్టు మెట్రిక్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఉపకార వేతనాల లబ్ధిదారులు కలిపి 60 వేల మంది ఉంటారు. ఈ నెల మొదటి వారంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరణ ప్రారంభించగా ఇంకా 25 వేల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 17వ తేదీతో గడువు ముగియగా నెలాఖరు వరకు గ డువు పొడిగిస్తున్న ట్లు అధికారులు ప్ర కటించారు. ఆన్‌లైన్ సమస్యతో పాటు ధ్రువపత్రాల జారీ లో కూడా జాప్యం జరుగుతుండడంతో విద్యార్థుల కష్టాలు అధికమవుతున్నాయి.
ధ్రువీకరణ పత్రాల కోసం పాట్లు...
ఉపకార వేతనాల దరఖాస్తుకు అవసరమైన ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలను సంపాదించుకోవడానికి విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. మండల స్థాయి అధికారులు, మీ సేవ కేంద్రాల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపమైంది. ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ గుడువు ఇచ్చినప్పటికీ లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెలాఖరుకు గడువు పొడించారు. మీ-సేవ కేంద్రాల వద్ద ప్రతి రోజూ విద్యార్థుల రద్దీ ఉం టుంది. తహశీల్దార్ కార్యాలయంలోనూ అదే పరిస్థితి. కొన్ని చోట్ల అప్‌లోడ్ అయినా అధికారిక పత్రాలు తమ వద్ద లేవని, ప్రింట్ తీసి ఇవ్వలేమని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు బాహా టంగా చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఇదే అ దునుగా తీసుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం కేవలం రూ.35 మాత్రమే తీసుకోవాల్సి ఉంది. కానీ పట్టణ పరిధిలోని పలుచోట్ల మీసేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేం దుకు రూ.50 నుంచి రూ.100 తీసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఉపకార వేతన దరఖాస్తుల కోసం ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలంటూ ప్రభుత్వం షరతులు విధించింది. ఈ నిబంధనలతోనే విద్యార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలను త్వరగా జారీ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయకుండా ఇలా నిబంధనలు, షరతులు విధించుకుంటూ పోవడం సరికాదని విద్యార్థులు చెబుతున్నారు.