ఉపాధి వెతలు | Increasing the number of workers in the background of both the day of drought | Sakshi
Sakshi News home page

ఉపాధి వెతలు

Published Thu, Feb 4 2016 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

ఉపాధి వెతలు

ఉపాధి వెతలు

కరువు నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న కూలీల సంఖ్య
అప్పుడే ప్రతాపం చూపుతున్న భానుడు
పని ప్రదేశాల్లో మౌలిక వసతులు నిల్.. మెడికల్ కిట్లు, పరదాల కరువు
35 మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ
పలు చోట్ల ఫీల్డ్‌అసిస్టెంట్లు, సీఓలు, ఏపీఓల కొరత
పాతబడిన కంప్యూటర్లు, ప్రింటర్లు.. నెమ్మదించిన నెట్‌వర్క్


 జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెరుగుతోంది. గ్రామాల్లో కరువు పరిస్థితులు రోజురోజుకూ తారాస్థాయికి చేరడంతో కూలీలు ఉపాధి పనుల కోసం ఎగబడుతున్నారు. రెండు, మూడు రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య పెరుగుతోంది. అయితే.. వేసవి సీజన్ ఆరంభానికి ముందే ఎండ తీవ్రత పెరగడంతో సాధారణ ప్రజలతోపాటు ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీప రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినా.. ఎండల తీవ్రత నుంచి ఉపాధి కూలీలకు రక్షణ కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పని జరుగుతున్న ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించక పోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


నాలుగేళ్ల క్రితం కూలీలకు మౌలిక వసతులు కల్పించేందుకు సరఫరా చేసిన టెంట్లు, మెడికల్ కిట్లు కంటికి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం పనిజరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగేందుకు గుక్కెడు నీరు కూడా కరువైంది. మరో పలు మండలాల్లో ఉపాధి సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో పనులు గుర్తింపు ప్రక్రియ ఆగిపోయింది.


 పెరుగుతున్న కూలీలు ....నాలుగు రోజుల నుంచి ఉపాధి పనులకు డిమాండ్ పెరిగింది. జనవరి 29న 1.71లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా...30న 1.74 లక్షలు, ఫిబ్రవరి ఒకటిన 1.68 లక్షలు, ఫిబ్రవరి రెండున 1.77 లక్షల మంది కూలీలు పనులకు హాజరయ్యారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఫిబ్రవరి 2న కూలీలు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం మీద 3,94,448 కుటుంబాలకు ఉపాధి కల్పించగా.. ఇందులో వంద రోజుల ఉపాధి పొందిన కుటుంబాలు 12,782 మాత్రమే ఉన్నాయి. ఉపాధి నిబంధనల మేరకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున వంద రోజుల ఉపాధి కల్పించాలి. కానీ.. ఒక్కో కుటుంబానికి ఫిబ్రవరి నాటికి 37 రోజుల పని మాత్రమే కల్పించారు. కొంతకాలంగా ఉపాధి పథకం అమలు స్తబ్దుగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.


 జాడలేని మెడికల్ కిట్లు, పరదాలుపనులు జరిగే ప్రదేశాల్లో ఉపాధి కూలీల సౌకర్యార్థం మెడికల్ కిట్లు, పరదాలు, గడ్డపారలు అందించాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. 2012లో చివరి సారిగా పరదాలు సరఫరా చేశారు. గడ్డపారలు 25 వేలు, మెడికల్ కిట్లు 16 వేలను జిల్లా వ్యాప్తంగా అప్పుడున్న గ్రూపులకు అందజేశారు. నాలుగేళ్ల క్రితం  సరఫరా చేసిన  సామాగ్రి ఎప్పుడో మాయమైంది. మెడికల్ కిట్లలో మందులు, బ్యాండేజీ, కత్తెర, కాటన్ వంటివి లేకపోవడంతో బాక్సులను మూలనపడేశారు. పనిజరిగే ప్రదేశంలో తప్పనిసరిగా కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చిక్సిత కోసం మెడికల్ కిట్లు తప్పనిసరి అవసరం. ఎండ వేడి నుంచి కాస్తాంత ఉపశమనం పొందేందుకు పరదాల అవసరం ఉంటుంది. గతంలో తాగేందుకు నీటిని సరఫరా చేయడాన్ని కూడా ఉపాధి కిందనే పరిగణించేవారు. ఇప్పుడు అలాంటి వసతులు ఏమీ కల్పించిన దాఖలాల్లేవు.


 సిబ్బంది కొరత...పనుల గుర్తింపులో జాప్యం మండలాల్లో ఉపాధి సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. ఏడేళ్ల నుంచి బదిలీలు లేకపోవడంతో ఎక్కడి వారు అక్కడే సుదీర్ఘకాలం నుంచి పాతుకుని పోయారు. దీంతో పనులు చేయించడంలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 35 మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. మూడు మండలాలకు ఏపీఓలు లేరు. 20 గ్రా మాలకు ఫీల్డ్ అసిస్టెంట్ల అవసరం ఉంది. మండ లాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపని కొంతమంది ఉపాధి సిబ్బంది పైరవీలతో పట్టణాలకు వచ్చి స్థిరపడ్డారు. దీంతో 204 గ్రామాల్లో 50-75 శాతం మాత్రమే పనులు అందుబాటులో ఉన్నాయి. 100-200 శాతం పనులు అందుబాటులో ఉన్న గ్రామాలు 646 ఉన్నాయి. 200 శాతానికి పైబడి పనులు అందుబాటులో ఉన్న గ్రామాలు 236 మాత్రమే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1170 గ్రామ పంచాయతీలకు గాను 1095 పంచాయతీల్లో 1,28,098 పనులు.. అంటే దాదాపు 119 శాతం పను లు అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement