సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు వారం రోజుల్లో చెల్లించాలని మంగళవారం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ హైకోర్టులో దాదాపు 500 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. పిటిషనర్లు సమర్పించిన బిల్లులను రెండు వారాల్లో చెల్లించాలంటూ గత నెల 23న ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరు తమ క్లయింట్లలో కొందరికి పూర్తి మొత్తాలు అందాయంటూ ఆ వివరాలను న్యాయమూర్తికి అందచేశారు. పలువురు న్యాయవాదులు తమ క్లయింట్‌లకు ఇంకా పూర్తి బిల్లులు రాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి మొత్తాలు అందిన వారి వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని, ఆ వ్యాజ్యాల్లో విచారణను ముగిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తమ బిల్లుల్లో కేవలం 79–80 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, 20–21 శాతం మొత్తాలను విజిలెన్స్ విచారణ పేరుతో ఆపుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది వివరణ కోరారు.
ఆ సర్పంచుల పేర్లివ్వండి..
పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ స్పందిస్తూ.. ఉపాధి హామీ పనుల్లో చాలా చోట్ల అక్రమాలు జరిగాయని, వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. అక్రమాలు రుజువైన చోట చెల్లింపులు పూర్తిగా నిలిపేస్తున్నామని, విజిలెన్స్ విచారణ జరుగుతున్న చోట 20 శాతం బిల్లుల మొత్తాన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తున్నామని తెలిపారు. బిల్లుల చెల్లింపునకు మరో నాలుగు వారాల గడువునివ్వాలని కోరుతూ ఇప్పటికే అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల నిధుల విడుదలకు సర్పంచ్‌లు సహకరించడం లేదని, చెక్కులపై సంతకాలు చేయడం లేదన్నారు. ఇలాంటి చోట సర్పంచులకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారని కోర్టుకు నివేదించారు. అలా సహకరించని సర్పంచుల వివరాలు ఇవ్వాలని, వారిపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని న్యాయమూర్తి తెలిపారు. సర్పంచులుగా కొనసాగేందుకు అలాంటి వారు ఎంత మాత్రం అర్హులు కారని వ్యాఖ్యానించారు.
స్పందించకపోతే సుమోటోగా ధిక్కార చర్యలు
క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో 80 శాతం బిల్లులు మాత్రమే చెల్లించడం సరికాదని న్యాయమూర్తి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ చెల్లింపులు చేస్తున్నామని, ఆ మేరకు అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకుంటున్నామని న్యాయవాది వివరించారు. తమ ఆదేశాల మేరకు వారం రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తమ ఆదేశాల మేరకు ఎంత మందికి చెల్లింపులు చేశారో ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. కాగా, గతంలో 32 వ్యాజ్యాల్లో చెల్లింపుల గడువును నాలుగు వారాల పాటు పెంచాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు.
పిటిషనర్లందరికీ వారం రోజుల్లో ‘ఉపాధి’ బిల్లులు
Published Wed, Sep 8 2021 4:07 AM | Last Updated on Wed, Sep 8 2021 4:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment