
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కూలీలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే వేసవి భృతి, మజ్జిగ పంపిణీ వంటి అదనపు సౌకర్యాల్లో కోత పెట్టిన కేంద్రం తాజాగా మరో ఇబ్బందికర నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు పూటల పని విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీనిని కూలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాగైతే పనికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు
ఇప్పటికే వేసవి భృతి రద్దు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి రోజుకు రూ.245 వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే లభిస్తోంది. ఎండాకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఈ పథకం కేంద్రం అ«దీనంలోకి వెళ్లినప్పటి నుంచీ వేసవి భృతిని రద్దు చేశారు. దీంతో వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
రెండు పూటలా సాధ్యమా?
ఉపాధి పనులు ప్రస్తుతం ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు కలిగిన కూలీల కుటుంబాల వారికి కేటాయించిన 100 రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ పథకం మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మస్టర్లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
చదవండి: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
రెండు పూటల పని విధానంతో గ్రామం నుంచి మండల పరిధిలోని నాలుగు కిలోమీటర్ల వరకూ రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉదయం ఉపాధి పనికి వెళ్లినా.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువుల పెంపకం ద్వారా వారు కొంత ఆదాయం పొందేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. ఈ పరిణామం ఉపాధి పనులకు వచ్చే కూలీలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విస్తృతంగా పనులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్రం విధించిన ఇటువంటి నిబంధనలు కూలీలకు శరాఘాతంగా మారనున్నాయి. కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని కూలీలు డిమాండు చేస్తున్నారు.
కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం
ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తోంది. కొత్త ఉత్తర్వులను ఏప్రిల్ 1 నుంచి తప్పకుండా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలా పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి వేతనం జమ అవుతుంది. కచ్చితంగా పని చేయాలని మేం బలవంతం చేయడం లేదు. ఉదయం, సాయంత్రం మస్టర్ అంటే కొంత ఇబ్బందే. భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
– ఎ.ముఖలింగం, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా
Comments
Please login to add a commentAdd a comment