సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో, తీవ్రమైన కరువుల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకుని, వారి జీవితాలకు భరోసాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గడ్డు రోజులు మొదలయ్యాయా? పలు రాష్ట్రాల్లో ఇది క్రమంగా నిర్వీర్యమైపోతోందా? పేదలకు కనీస వేతనంతో కూడిన వంద రోజుల ఉపాధి కల్పనకు గుర్తింపు పొందిన ఈ పథకం కాస్తా.. నెమ్మది నెమ్మదిగా తన ప్రాధాన్యతను, గుర్తింపును కోల్పోతోందా?..అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ పథకం మార్గదర్శకాలకు భిన్నంగా అమలు చేస్తున్న విధానాలు, కొత్తగా విధిస్తున్న కఠిన నిబంధనలు, బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించడం, జాబ్‌కార్డుల కోత.. ఇందుకు ప్రధాన కారణాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు గతంలో ఉపాధిహామీ అమల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలోనూ ఈ పథకం ప్రాబల్యాన్ని కోల్పోతూ నీరుగారిపోతోంది.
అన్నీ అవరోధాలే..: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల తీసుకొచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఉపాధి హామీ పథకానికి ప్రతిబంధకంగా మారినట్టు నిపుణులు చెబుతున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్)లో భాగంగా మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ప్రదేశాల్లోనే రోజుకు రెండుసార్లు కూలీల అటెండెన్స్ నమోదు (ఉదయం ఒకసారి, మధ్యాహ్నం తర్వాత రెండోసారి), ఆధార్ కార్డుతో జాబ్ కార్డుల సీడింగ్, అథెంటికేషన్, బ్రిడ్జి పేమెంట్స్ లాంటి విధానాల కారణంగా ఉపాధి వర్కర్లు పని, కూలీ పొందడంలో ఇబ్బందులు పడడం.. ఈ పథకం మౌలిక సూత్రాలకే ఉల్లంఘనగా నిలుస్తోంది.
దాదాపు 15 ఏళ్ల పాటు పనుల నమోదు, కూలీ లెక్కింపు, జాబ్ కార్డుల జారీ, ఇతర అంశాల నమోదుకు రాష్ట్రస్థాయిలో ఉపయోగించిన రాష్ట్ర వెబ్‌సైట్ రాగా సాఫ్ట్‌కు బదులు, జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్‌ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో కూలీల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ విధంగా సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పు, చేర్పులు రాష్ట్రంలో ఈ పథకం అమలుకు, పని కోసం కూలీలు ముందుకు వచ్చేందుకు ఆటంకంగా మారాయి.
మరోవైపు రాష్ట్రంలో దీని అమలు పూర్తి సామర్థ్య స్థాయిలో జరగడం లేదు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల ఎంప్లాయ్‌మెంట్ ఇండికేటర్లు (ఉద్యోగిత సూచిలు) కూడా దిగజారాయి. అత్యధిక స్థాయిలో జాబ్ కార్డుల్లో కోతతో పాటు ఆధార్ సీడింగ్, అథెంటికేషన్, ఆధార్ బ్రిడ్జి పేమెంట్స్ విధానం, ఎన్‌ఎంఎంఎస్ అటెండెన్స్ తప్పనిసరి చేయడం వంటివి ప్రభావం చూపినట్టుగా ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షక, పరిశీలన సంస్థ ‘లిబ్‌టెక్ ఇండియా’ జరిపిన కూలంకష పరిశీలనలో వెల్లడైంది.
5 లక్షల జాబ్ కార్డుల కోత
ఈ నెల 7వ తేదీ వరకు ఉపాధిహామీ పథకం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన గణాంకాలు, సమాచారం ఆధారంగా గత మూడేళ్ల డేటాను విశ్లేషిస్తూ లిబ్‌టెక్ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత మార్చి 31తో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 5 లక్షల జాబ్ కార్డుల కోత (ఇది ఇక్కడి మొత్తం జాబ్ కార్డుల్లో 8.2 శాతం) పడింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 24.3 శాతం, జోగుళాంబ గద్వాలలో అత్యల్పంగా 2.7 శాతం తొలగింపునకు గురయ్యాయి.
17.3 లక్షల కూలీల పేర్లు కూడా ఈ కార్యక్రమంలో లేకుండా పోయాయి. జాబ్ కార్డుల కోత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర సర్కార్‌పైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి, సామర్ధ్యం పెంపుదలకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడలేదు. అధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కంటే కూడా బ్యాంక్ ఖాతా ఆధారిత పేమెంట్ సిస్టమే మెరుగైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది..
కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్‌ఎస్ సర్కార్ తప్పుబడుతోంది. కేంద్రం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని, పేదలను కొట్టి పెద్దలకు పంచే పద్ధతిని అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గడిచిన రెండేళ్లలో బడ్జెట్లో రూ.55 వేల కోట్ల మేర కోత విధించడాన్ని గుర్తు చేస్తోంది. మరోవైపు పని దినాలు తగ్గిపోవడం, పని దినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్ కూడా తరిగిపోవడంపై కేంద్ర మంత్రులను కలిసి మౌఖికంగా, లేఖల ద్వారా విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ధ్వజమెత్తుతోంది.
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, ఉపాధి హామీ పని దినాలను పెంచాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించిన ఉపాధి హామీపై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇటీవల ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి వంద రూపాయలకు మించడం లేదని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలైన టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, తట్టలు వంటివి అందించడం లేదని విమర్శలు గుప్పించారు.
ఆన్‌లైన్ పద్ధతి వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్‌లో అటెండెన్స్ అప్‌లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేక పోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి గుర్తు చేశారు.
గణనీయంగా తగ్గిన పని దినాలు
తెలంగాణలో గత రెండేళ్లతో పోల్చితే 2022–23లో హోస్‌హోల్డ్ పనులు, పర్సన్ డేస్, సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. కేంద్రం తగిన ప్రణాళిక లేకుండా క్లిష్టమైన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధి కల్పన అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. ఉపాధి పనులు చేసే కుటుంబాల సంఖ్య తగ్గడం శ్రేయస్కరం కాదు. తెలంగాణలో కనీసం వందరోజుల పనిదినాల కల్పన భారీగా పడిపోవడందారుణం. ఇది ఎందుకు జరిగిందనే దానిపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముంది. జాబ్ కార్డుల పునరుద్ధరణ, పనికి డిమాండ్ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యామ్నాయ అవకాశాల కల్పన ప్రభుత్వం చేపట్టాలి.
– చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా
పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేందం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చింది. కోట్లాది మంది రైతు కూలీలకు ఉపయోగపడుతున్న ఉపాధి హమీ పథకానికి (నరేగా) ప్రతి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం సిగ్గుచేటు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నరేగా సంఘర్షణ మోర్చా అధ్వర్యంలో ఉపాధి హమీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ 100 రోజుల ధర్నా జరుగుతోంది. సోమవారం నాటికి 54 రోజులు పూర్తయ్యాయి. ధర్నాలో తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొన్నారు.
– పి.శంకర్, జాతీయ కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్
నిధులు కోసి.. కార్డులు తగ్గించేసి 'ఇదేం పని'! గడ్డు రోజులు మొదలయ్యాయా?
Published Tue, Apr 18 2023 2:22 AM | Last Updated on Tue, Apr 18 2023 3:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment