nrega scheme
-
జనసేన నేతల వేధింపులు.. మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే ఓ శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగిని సునితని జనసేన నాయకులు వేధింపులకు గురి చేశారు. తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీలు నడకుదురు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను వేధింపులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని బాధితురాలి భర్త వీరబాబు ఆరోపించారు. నిందితులు తన భార్యను నెలకు రూ.20 వేల లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాము అడిగినంత ఇవ్వలేదంటే లైగింక కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
నిధులు కోసి, కార్డులు తగ్గించేసి 'ఇదేం పని'! గడ్డు రోజులు మొదలయ్యాయా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో, తీవ్రమైన కరువుల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకుని, వారి జీవితాలకు భరోసాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గడ్డు రోజులు మొదలయ్యాయా? పలు రాష్ట్రాల్లో ఇది క్రమంగా నిర్వీర్యమైపోతోందా? పేదలకు కనీస వేతనంతో కూడిన వంద రోజుల ఉపాధి కల్పనకు గుర్తింపు పొందిన ఈ పథకం కాస్తా.. నెమ్మది నెమ్మదిగా తన ప్రాధాన్యతను, గుర్తింపును కోల్పోతోందా?..అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ పథకం మార్గదర్శకాలకు భిన్నంగా అమలు చేస్తున్న విధానాలు, కొత్తగా విధిస్తున్న కఠిన నిబంధనలు, బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించడం, జాబ్‌కార్డుల కోత.. ఇందుకు ప్రధాన కారణాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు గతంలో ఉపాధిహామీ అమల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలోనూ ఈ పథకం ప్రాబల్యాన్ని కోల్పోతూ నీరుగారిపోతోంది. అన్నీ అవరోధాలే..: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల తీసుకొచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఉపాధి హామీ పథకానికి ప్రతిబంధకంగా మారినట్టు నిపుణులు చెబుతున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)లో భాగంగా మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ప్రదేశాల్లోనే రోజుకు రెండుసార్లు కూలీల అటెండెన్స్ నమోదు (ఉదయం ఒకసారి, మధ్యాహ్నం తర్వాత రెండోసారి), ఆధార్ కార్డుతో జాబ్ కార్డుల సీడింగ్, అథెంటికేషన్, బ్రిడ్జి పేమెంట్స్ లాంటి విధానాల కారణంగా ఉపాధి వర్కర్లు పని, కూలీ పొందడంలో ఇబ్బందులు పడడం.. ఈ పథకం మౌలిక సూత్రాలకే ఉల్లంఘనగా నిలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు పనుల నమోదు, కూలీ లెక్కింపు, జాబ్ కార్డుల జారీ, ఇతర అంశాల నమోదుకు రాష్ట్రస్థాయిలో ఉపయోగించిన రాష్ట్ర వెబ్సైట్ రాగా సాఫ్ట్‌కు బదులు, జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో కూలీల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ విధంగా సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పు, చేర్పులు రాష్ట్రంలో ఈ పథకం అమలుకు, పని కోసం కూలీలు ముందుకు వచ్చేందుకు ఆటంకంగా మారాయి. మరోవైపు రాష్ట్రంలో దీని అమలు పూర్తి సామర్థ్య స్థాయిలో జరగడం లేదు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్లు (ఉద్యోగిత సూచిలు) కూడా దిగజారాయి. అత్యధిక స్థాయిలో జాబ్ కార్డుల్లో కోతతో పాటు ఆధార్ సీడింగ్, అథెంటికేషన్, ఆధార్ బ్రిడ్జి పేమెంట్స్ విధానం, ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తప్పనిసరి చేయడం వంటివి ప్రభావం చూపినట్టుగా ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షక, పరిశీలన సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ జరిపిన కూలంకష పరిశీలనలో వెల్లడైంది. 5 లక్షల జాబ్ కార్డుల కోత ఈ నెల 7వ తేదీ వరకు ఉపాధిహామీ పథకం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన గణాంకాలు, సమాచారం ఆధారంగా గత మూడేళ్ల డేటాను విశ్లేషిస్తూ లిబ్టెక్ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత మార్చి 31తో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 5 లక్షల జాబ్ కార్డుల కోత (ఇది ఇక్కడి మొత్తం జాబ్ కార్డుల్లో 8.2 శాతం) పడింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 24.3 శాతం, జోగుళాంబ గద్వాలలో అత్యల్పంగా 2.7 శాతం తొలగింపునకు గురయ్యాయి. 17.3 లక్షల కూలీల పేర్లు కూడా ఈ కార్యక్రమంలో లేకుండా పోయాయి. జాబ్ కార్డుల కోత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర సర్కార్‌పైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి, సామర్ధ్యం పెంపుదలకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడలేదు. అధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కంటే కూడా బ్యాంక్ ఖాతా ఆధారిత పేమెంట్ సిస్టమే మెరుగైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ సర్కార్ తప్పుబడుతోంది. కేంద్రం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని, పేదలను కొట్టి పెద్దలకు పంచే పద్ధతిని అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గడిచిన రెండేళ్లలో బడ్జెట్లో రూ.55 వేల కోట్ల మేర కోత విధించడాన్ని గుర్తు చేస్తోంది. మరోవైపు పని దినాలు తగ్గిపోవడం, పని దినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్ కూడా తరిగిపోవడంపై కేంద్ర మంత్రులను కలిసి మౌఖికంగా, లేఖల ద్వారా విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ధ్వజమెత్తుతోంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, ఉపాధి హామీ పని దినాలను పెంచాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించిన ఉపాధి హామీపై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇటీవల ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి వంద రూపాయలకు మించడం లేదని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలైన టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, తట్టలు వంటివి అందించడం లేదని విమర్శలు గుప్పించారు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అటెండెన్స్ అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేక పోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి గుర్తు చేశారు. గణనీయంగా తగ్గిన పని దినాలు తెలంగాణలో గత రెండేళ్లతో పోల్చితే 2022–23లో హోస్‌హోల్డ్ పనులు, పర్సన్ డేస్, సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. కేంద్రం తగిన ప్రణాళిక లేకుండా క్లిష్టమైన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధి కల్పన అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. ఉపాధి పనులు చేసే కుటుంబాల సంఖ్య తగ్గడం శ్రేయస్కరం కాదు. తెలంగాణలో కనీసం వందరోజుల పనిదినాల కల్పన భారీగా పడిపోవడందారుణం. ఇది ఎందుకు జరిగిందనే దానిపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముంది. జాబ్ కార్డుల పునరుద్ధరణ, పనికి డిమాండ్ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యామ్నాయ అవకాశాల కల్పన ప్రభుత్వం చేపట్టాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేందం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చింది. కోట్లాది మంది రైతు కూలీలకు ఉపయోగపడుతున్న ఉపాధి హమీ పథకానికి (నరేగా) ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం సిగ్గుచేటు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నరేగా సంఘర్షణ మోర్చా అధ్వర్యంలో ఉపాధి హమీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ 100 రోజుల ధర్నా జరుగుతోంది. సోమవారం నాటికి 54 రోజులు పూర్తయ్యాయి. ధర్నాలో తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొన్నారు. – పి.శంకర్, జాతీయ కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ -
‘ఉపాధి హామీ’ని మెరుగుపరచాలి!
‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు 100 రోజుల పని దినాలను కల్పించే లక్ష్యంతో అమల్లోకి వచ్చింది. యంత్రాలు వినియోగించ కుండా, కాంట్రాక్టర్లతో పనులు చేయించకుండా పూర్తిగా ప్రజల తోనే పనులు చేయించేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. 2005లో పదవ పంచవర్ష ప్రణాళిక అమలు సందర్భంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం చట్టపరంగా ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో 2006 ఫిబ్రవరి 2న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయింది. ఉపాధిహామీ చట్టం 2005 ప్రకారం...18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో వంద రోజుల పాటు ప్రభుత్వం పని కల్పించాలి. పనిచేస్తామని దరఖాస్తు చేసుకున్న వారం దరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. వికలాంగులు, అంతరించిపోతున్న ఆదివాసి జాతులకు ప్రత్యేకంగా జాబ్ కార్డు ఇచ్చి, రెండు వారాలలోపు కచ్చితంగా పని కల్పించాలి. పని కోరినవారందరికీ పనులు చూపించాలి. పనిస్థలాలలో నీడ ఏర్పాటు చేయాలి. కార్మికులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలి. కార్మికులకు పనికి అవ సరమైన సామగ్రిని ప్రభుత్వమే కార్మికులకు ఇవ్వాలి. ఉపాధి హామీ కార్మికులు చేసిన పనికి ఏ రోజుకారోజు కొలతలు తీసుకోవాలి. పదిహేను రోజులకు ఒకసారి వేతనాలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ఆ 15 రోజులు చేసిన పనికి రోజువారీ వేతనం ఎంత పడిందో వేతన రశీదు(పే స్లిప్)ను ముందే కార్మికులకు ఇవ్వాలి. చట్టప్రకారం ఉపాధి హామీ కార్మికుడు మరణిస్తే లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, అంగ వైకల్యం పొందితే 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. అర్హత గలవారు పనికావాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి జాబ్‌కార్డ్ ఇవ్వడంలేదు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది జాబ్ కార్డుకు అర్హత కలిగి ఉన్నప్పటికీ 13 కోట్ల మందికి మాత్రమే జాబ్ కార్డులు ఇచ్చారు. వందరోజుల పని కల్పిం చకుండా 50 నుండి 75 రోజుల పాటే పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం అమలుకు ప్రత్యేక యంత్రాంగం లేదు. చాలా చోట్ల కూలీలకు నీడ కల్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు, సౌకర్యాల కోసం ఆందోళన చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ ప్రభుత్వం తొలగించడంతో జరిగిన పనిని రోజూ కొలతలు, లెక్కలు వేయడంలేదు. పదిహేను రోజులకు ఇవ్వ వలసిన వేతనాలు 12 వారాలు దాటినా ఇవ్వడంలేదు. ఉపాధిహామీ పనులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం కేటాయింపులు బడ్జెట్లో 4 శాతం నుండి 1.5 శాతానికి క్రమంగా తగ్గించారు. 2021లో మోదీ ప్రభుత్వం ఉపాధి హామీపనులకు బడ్జెట్ కేటాయింపులు పెద్ద మొత్తంలో తగ్గించటమే కాకుండా చట్టంలో సవరణలు చేసింది. పనిచేసిన కార్మికులందరికీ ఒకే దఫా వేతనాలు ఇప్పటి వరకు ఖాతాలలో వేసేవారు. చట్ట సవరణ తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వేరువేరుగా వేతనాలు వేస్తున్నారు. ఇది కలిసిమెలిసి ఉండే కార్మికుల మధ్య కులాల పేర, మతాలపేర చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రలో భాగమే అనుకోవాలి! (క్లిక్: అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?) దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో కొంత ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకం కింద పనిచేస్తున్నవారిని కూలీలుగా చూడకుండా కార్మికులుగా గుర్తించాలి. నైపుణ్యతలేని (అన్ స్కిల్డ్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వ వేతనాల జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలి. సమస్యల పరిష్కారానికై కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. (క్లిక్: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) – జె. సీతారామయ్య ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు -
రూ.5 లక్షల లోపున్న ఉపాధి హామీ బిల్లులు చెల్లించాం
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రూ.5 లక్షలకు పైబడిన పనులకు రూ.1,117 కోట్లు చెల్లించాల్సి ఉందని, రూ.513 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని, ఈ మొత్తం నుంచి ఆ బకాయిలను చెల్లిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ బొప్పన కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. సీజే జస్టిస్ గోస్వామి సెలవులో ఉండటంతో ఈ వ్యాజ్యాలు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు కోర్టు ముందు హాజరయ్యారు. బకాయిల చెల్లింపునకు తీసుకుంటున్న చర్యలను సీజే ధర్మాసనం ముందే వివరించాలని ధర్మాసనం ఈ ముగ్గురు అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. -
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ఉపాధి హామీ నిధుల చెల్లింపుల అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు చెల్లింపులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశింది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 17లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే బాధ్యులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. -
‘ఉపాధి’ పనుల్లో సర్పంచ్ దంపతులు
సాక్షి, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో స్థానిక సర్పంచ్ దంపతులు పాలుపంచుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌గా ఎన్నికైన లావుడ్యా స్వాతి ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాము కూడా ఉపాధి పనులకు వెళ్లాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా లావుడ్యా స్వాతి, భర్త వాగా సోమవారం అటవీప్రాంతంలో గుంటలు తవ్వుతూ ఇలా కనిపించారు. పరీక్ష కోసం చెప్పుల క్యూ! ఓ వైపు విజృంభిస్తున్న కరోనా.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు. దీంతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని పీహెచ్సీ వద్ద సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన ప్రజలు క్యూలో నిల్చోలేక, ఇలా చెప్పులను ఉంచి దూరం దూరంగా కూర్చొన్నారు. ఎండలో నిలబడటం కష్టంగా ఉందని, ఆస్పత్రి వద్ద కనీసం టెంట్ వేయిస్తే బాగుంటుందని జనాలు కోరుతున్నారు. – జిన్నారం (పటాన్చెరు) సంతోషాన్ని పంచిన స్మార్ట్‌ఫోన్ కరోనా కన్నెర్రజేసి బంధాలను దూరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, మండుటెండలో ఒంటరిగా పనిచేసుకుంటున్న ఆ ముసలమ్మకు స్మార్ట్‌ఫోన్ సంతోషాన్నిచ్చింది. మండుటెండలో వేరుశనగ తెంపుతున్న పొచ్చక్క అనే ముసలమ్మ, ఇదిగో ఇలా.. స్మార్ట్‌ఫోన్‌లో తన కూతురితో వీడియో కాల్ మాట్లాడుతూ, తాను పడుతున్న కష్టాన్ని మరిచిపోయి సంబరపడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది ప్రాంతంలోని ఓ చేనులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఉపాధిహామీ: ఏపీ సర్కార్ సరికొత్త రికార్డు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి పేదలకు అండగా ప్రభుత్వం నిలిచింది. అధికార యంత్రాంగం ఈ పథకం అమలులో చూపిన చిత్తశుద్ధి కారణంగా జాతీయస్థాయిలో ఉపాధి హామీ పథకంను అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి మొత్తం 25.25 కోట్ల పనిదినాలను కేంద్రం లక్ష్యంగా కేటాయించింది. అయితే ఈ నెల (29.3.2021) నాటికే మొత్తం 25.43 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించడం ద్వారా కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కింద ఏడాది కాలంలో (29.3.2021 నాటికి) రూ.10,170 కోట్లు వ్యయం చేసింది. దీనిలో కూలీలకు వేతనాల కిందనే 5,818 కోట్లు చెల్లించింది. ఇక స్కిల్డ్ వేజెస్, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 3,965 కోట్లు వ్యయం చేసింది. వలస కూలీలకు అండగా ఉపాధి హామీ.. కరోనా సంక్షోభ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ఉపాధి హామీతో పనులు కల్పించారు. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో వలస కూలీలు రాష్ట్రంలోని తమ సొంత గ్రామాలకు చేరుకోవడం, అదే సమయంలో కరోనా లాక్డౌన్ వల్ల స్థానికంగా వున్న వారికి కూడా పనులు లేని పరిస్థితులను ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంది. అన్ని కరోనా నివారణ, రక్షణ చర్యలతో గ్రామీణ పేదలకు, వలస వచ్చిన కూలీలకు ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించడంలో విజయం సాధించింది. వివిధ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు 6.35 లక్షల మందికి జాబ్‌కార్డులను మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.36 లక్షల జాబ్‌కార్డ్ లను తిరిగి యాక్టివేట్ చేశారు. అలాగే రాష్ట్రంలో వున్న మరో 2.44 మందిని అప్పటికే యాక్టీవ్‌గా వున్న కార్డులలో సభ్యులుగా నమోదు చేశారు. ఉపాధి కూలీలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లను వినియోగించేలా చేస్తూ, ఉపాధి పనులు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా గత ఏడాది జూన్ 9వ తేదీన ఒకే రోజు 54 లక్షల మందికి రికార్డు స్థాయిలో ఉపాధి పనుల్లో పాల్గొనడం విశేషం. రూ.9,871 కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్స్ తో పాటు అంగన్వాడీ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లకు మొత్తం 48,969 భవనాల నిర్మాణానికి ఉపాధి హామీని ప్రభుత్వం అనుసంధానం చేసింది. మొత్తం రూ.9,871 కోట్లతో ఈ పనులు చేపట్టింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆస్తులను సమకూర్చుకోవడం, అలాగే పేదలకు వాటి నిర్మాణం ద్వారా పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. పచ్చదనానికి పెద్దపీట రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత సాధించేందుకు, రైతులకు వివిధ వర్గాలకు మేలు చేసేందుకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చింది. 37,870 మంది రైతులకు చెందిన 56,675 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, 10,706 కి.మీ. పొడవునా రోడ్డుకు ఇరువైపులా 42.83 లక్షల మొక్కల పెంపకం, 11,928 హౌసింగ్ లే అవుట్స్ లో 16.69 లక్షల మొక్కల పెంపకం, 2707 బ్లాక్‌లలో 4.78 లక్షల మొక్కల పెంపకం, 389 ప్రభుత్వ పాఠశాలల్లో 34 లక్షల మొక్కలు, 1327 రైతులకు చెంది పొలంగట్లపై 2.05 లక్షల మొక్కలు, రైల్వేకు చెందిన 34 ప్రాంతాల్లో 13 వేల మొక్కల పెంపకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించింది. అలాగే ప్రతి మొక్కను కాపాడేందుకు తొలిసారిగా వాటికి ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతాంగానికి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ కింద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నీటిసంరక్షణ, చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాల ద్వారా నీటివనరుల వృద్ధిపై దృష్టి సారించింది. సమర్థ నాయకత్వం, సమిష్టి కృషితోనే ఉపాధి హామీ రికార్డు: మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా రికార్డు స్థాయిలో గ్రామీణ పేదలకు పనులు కల్పించడంలో సీఎం జగన్ సమర్థ నాయకత్వం, దానిని ఆచరణలో క్షేత్రస్థాయిలో అమలు చేయడంతో అధికార యంత్రాంగం చేసిన సమిష్టి కృషి వుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరో రెండు రోజుల్లో (మార్చి 31నాటికి) 26 కోట్ల పనిదినాల మైలురాయిని కూడా అధిగమిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఈ రాష్ట్రంలో పనులు లేక ఇతర ప్రాంతాలకు ఏ ఒక్కరూ వలస వెళ్లే పరిస్థితి లేకుండా చేయాలనే లక్ష్యంతోనే నిత్యం పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, కల్పిస్తున్న పనులు అర్హులైన పేదలకు చేరే వరకు విశ్రమించకుండా ముందుకు సాగాలన్న సీఎం ఆదేశాలతోనే ఈ విజయం సాధ్యపడిందని పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మించి నిధులను ఈ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: ఆవిర్భావ దినోత్సవం రోజే టీడీపీకి షాక్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు -
వేసవిలో ఉపాధి కూలీలకు ‘డ్రై సీజన్ అలవెన్స్’
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ‘డ్రై సీజన్ అలవెన్స్’చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు ఉపాధి కూలీలు ఈ అలవెన్స్‌ను పొందనున్నారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్/మేలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం మేర ఈ అలవెన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎండా కాలంలో వేడి పెరగడం వల్ల చేసే పని తగ్గి ఆ మేరకు వారికొచ్చే కూలీ తగ్గే అవకాశాలున్నందున ఈ అలవెన్స్‌ను వర్తింపజేస్తారు. వేసవిలో ప్రధానంగా పైన పేర్కొన్న కాలంలో ఇచ్చే కూలీకి అనుగుణంగా చేయాల్సిన పని శాతాన్ని ఈ అలవెన్స్‌లో పేర్కొన్న మేర తగ్గిస్తారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ప్రతులను http:// www. rd. telangana. gov. in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఉపాధికి రూ.139.59 కోట్ల అదనపు నిధులు.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అయిన ఖర్చుల కోసం రూ.139.59 కోట్ల మేర అదనపు నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. ఇదివరకే ఇచ్చిన బడ్జెట్ విడుదల ఉత్తర్వులకు కొనసాగింపుగా అదనపు నిధులకు పాలనపరమైన అనుమతినిస్తూ సందీప్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కూలీల ‘ఉపాధి’నీ అడ్డుకుంటున్నారు..
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ పథకం పనులకూ ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డుతోంది. రాష్ట్రానికి అదనపు పని దినాలు రానివ్వకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 21 కోట్ల పని దినాలు కేటాయించి కూలీలకు పనులు కల్పించేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించింది. దీంతో ఐదు నెలల వ్యవధిలోనే 20.15 కోట్ల పని దినాల కల్పన లక్ష్యం పూర్తయింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు మొదలైనా ప్రస్తుతం రోజూ కనీసం 6 లక్షల మంది పేదలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. రాష్ట్రానికి కేటాయించిన వాటిలో మిగిలిన 85 లక్షల పని దినాలు కూడా 10, 15 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అదనంగా పనిదినాల కేటాయింపు జరగకుండా టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. అదనపు నిధుల కోసం జూన్‌లోనే.. ►కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు అదనపు పని దినాలు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో జూన్ నెలలోనే కేంద్రానికి లేఖ రాశారు. ►అదనపు పనిదినాల కేటాయింపుపై చర్చించేందుకు జూలై 10న కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల అధికారుల సమావేశం జరగ్గా.. టీడీపీ నేతల తప్పుడు ఫిర్యాదులను సాకు చూపి అప్పట్లో కేంద్ర అధికారులు అదనపు పనిదినాల కేటాయింపును వాయిదా వేశారు. ►రాష్ట్రానికి కేటాయించిన పని దినాలు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 31న) మరోసారి చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారుల సమావేశం జరగనుంది. అప్పటి తప్పుడు పనుల నిధుల కోసం.. ♦అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో కాంట్రాక్టర్లు చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు కొంతకాలంగా రకరకాల పేర్లతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు రకరకాల పేర్లతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ♦నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్లకు తావు ఉండదు. ఏ పనైనా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలి. ♦జరిగిన పనికి నేరుగా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకే ఉపాధి హామీ నిధులు మంజూరవుతాయి. ♦ఎన్నికల ముందు నిధులు లేకపోయినా గ్రామాల్లో టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిపై అప్పటి ప్రభుత్వం పనులు అప్పగించింది. ♦కేవలం 8–9 నెలల మధ్య కాలంలో రూ.2,200 కోట్లు ఖర్చు పెట్టి 1.50 లక్షల చిన్నచిన్న పనులు చేసినట్టు అప్పటి టీడీపీ నేతలు బిల్లులు రికార్డు చేయించుకున్నారు. ♦ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ♦ఉపాధి పనుల పేరుతో అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ కావడం, పనుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల అవినీతిని అంచనా వేయడానికి ప్రస్తుతం గ్రామాల్లో పనులవారీగా పరిశీలన జరుగుతోంది. -
‘ఉపాధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి’
-
‘ఉపాధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పనుల పురోగతిలో అలసత్వం కనిపిస్తోందని.. ఇంజినీరింగ్ అధికారులు దీనికి బాధ్యత వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను జిల్లాల్లోని సీఈలు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఆర్థికశాఖ నుంచి కూడా బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రామచంద్రారెడ్డి తెలిపారు. గత రెండు నెలల్లో ఉపాధి హామీ పనులకు రూ.1400 కోట్లు చెల్లింపులు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతున్నా, కొత్తగా ప్రారంభించిన పనులు ఎందుకు వేగవంతం అవ్వడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ స్థాయిలో పనులు, చెల్లింపులపై అప్రమత్తంగా వుండాలని అధికారులకు పెద్దిరెడ్డి సూచించారు. స్టీల్, సిమెంట్ కోసం డీలర్లతో జిల్లా కలెక్టర్లు మాట్లాడి అవసరమైతే క్రెడిట్‌పై ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో మనకు నరేగా కింద కేటాయించిన మొత్తాన్ని వినియోగించాలన్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు. మెటీరియల్ కేటాయింపులు ఎక్కువగా ఉంటే సీసీ రోడ్లును చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయాలు, సీసీ డ్రైనేజీలు, ప్రహరీ గోడలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దిరెడ్డి తెలిపారు. సిమెంట్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇసుక లభ్యతపై ఉపాధి పనులకు మినహాయింపులు ఇచ్చామని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఇసుకను తీసుకోవచ్చుమని ఆయన తెలిపారు. ప్రతివారం ఎఫ్టీఓలు జారీ చేయాలి: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 18 వరకు జరిగిన మెటీరియల్ వ్యయం రూ.138.68 కోట్లు అయిందని ఆయన తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు (ఫిబ్రవరి 18) వరకు మొత్తం మెటీరియల్ వ్యయం రూ. 871.18 కోట్లు అయిందన్నారు. జిల్లా స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రతివారం నరేగా పనులపై సమీక్షించాలనిప పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. గతవారం జరిపిన నరేగా కింద రూ. 51.73 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. ఉపాధి పనులకు ప్రతివారం ఎఫ్టీఓలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయన్నారు. వాటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మంజూరు చేసిన పనులకు ఎక్కడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగలేదన్నారు. వచ్చే అయిదు వారాలు ఇంజనీరింగ్ అధికారులు మరింత కష్టపడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చేసే వ్యయంను బట్టే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేగా కేటాయింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సుమారు వెయ్యి కోట్లు వరకు నిర్ణీత గడువు లోపు ఖర్చు చేయాలని పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎఫ్‌టీఓలను జనరేట్ చేయడం వల్ల బిల్లులు వెంటనే చెల్లించేందుకు అవకాశం వుంటుందని పెద్దిరెడ్డి తెలిపారు. మనబడి నాడు-నేడు కింద ఈ ఏడాది మొత్తం 284 మండలాలను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 5853 స్కూల్ భవనాలకు నరేగా కింద పనులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. పాఠశాలల టాయిలెట్లు, కాంపౌండ్ వల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్ కింద నాడు-నేడులో 50 శాతం పనులు ఇచ్చామన్నారు. పాఠశాలల ప్రహరీ గోడలకు ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఈ మార్చి 31 నాటికి ప్రతిపాదించిన ప్రహరీ నిర్మాణాలను నూరుశాతం పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
‘ఉపాధి హామీ నిధులతో గ్రామసచివాలయాలు’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల నిర్మాణం చేపడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో ఇప్పటివరకు సుమారు 2,781 గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఉన్నాయని తెలిపారు. గ్రామసచివాలయాల డిజైన్లను పరిశీలించి.. తక్కువ ధరకే సిమెంట్‌ను అందించేలా సిమెంట్ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలని ఆయన ఆదేశించారు. సిమెంట్ బస్తా ధర రూ. 240కి వచ్చేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్ ఈఎన్సీల ద్వారా పీఈఆర్టీ చార్ట్‌లను సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. చేపట్టిన పనుల పురోగతిపై నివేదికను అధికారులు బాధ్యుతంగా సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పక్కాగృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల లెవలింగ్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వివరించారు. గ్రామీణ పారిశుధ్యానికి పెద్దపీట.. గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ నిర్మాణాలకు 30శాతం స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, మిగిలిన 70 శాతం ఉపాధి నిధులను కేటాయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,418 పనులకు అంచనాలు సిద్ధం చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వీటిలె ఇప్పటికే 145 అంచనాలకు పరిపాలనా అనుమతులు ఉన్నాయని గుర్తుచేశారు. అంతర్గత రహదారులు లేని గ్రామాల్లో 90 శాతం ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ నిధులతో ప్రహరీగోడల నిర్మాణానికి రూ.601 కోట్లు కేటాయించామన్నారు. మెటీరియల్ నిధులను సద్వినియోగం.. కొత్తగా అనుమతి పొందిన స్కూల్ బిల్డింగ్ ప్రహరీలకు మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నుంచి నిధులు కేటాయింమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి ప్రహరీల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి నరేగా కింద రూ.15 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. మార్చి పదో తేదీ నాటికి మెటీరియల్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.3,335 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఖర్చు చేసినవి రూ.896 కోట్లు కాగా, ఇంకా వినియోగించాల్సిన నిధులు రూ.2457 కోట్లు అని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్న పీఆర్ ఈఎన్సీ అభ్యర్థనపై పరిశీలస్తున్నామని మంత్రి తెలిపారు. రేపు వీడియో కాన్ఫరెన్స్.. రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. సీపీడబ్ల్యూ స్కీం కింద పనిచేస్తున్న వారికి వెంటనే వేతన బకాయిలను చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 161 మండలాల్లో సర్వశిక్షాభియాన్ ద్వారా గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్తగా మంజూరు చేసిన స్కూల్ ప్రహరీ నిర్మాణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి వివరించారు. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు వెంటనే కలెక్టర్లు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షాభియాన్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రితోపాటు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్, పీఆర్ఈఎన్సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, సర్వశిక్షాభియాన్ ఎస్ఈ నాగార్జున పాల్గొన్నారు. -
నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన మాట్లడుతూ... ఏడాదిలో వంద రోజులపాటు వేతనంతో కూడిన పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన వేలాది కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ప్రధానమైన ఆదాయ వనరుగా మారిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కొన్ని నెలలపాటు దుర్బిక్షం వెంటాడింది. ఆ తర్వాత అంతే స్థాయిలో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు నెలల తరబడి వరదలతో సతమతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఆదాయమే దిక్కయిందని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి ఈ పథకం కింద విడుదల కావలసిన నిధులు సకాలంలో అందకపోవడంతో ఈ పథకం కింద డిమాండ్‌కు తగిన విధంగా పనులు కల్పించేలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ కింద పని చేసే కూలీలకు వేతనం 100 శాతం కేంద్ర నిధుల నుంచే చెల్లిచడం జరుగుతుంది. మెటీరియల్ ఖర్చుతో పాటు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్ల వేతనాల కింద చేసే ఖర్చులో కేంద్రం 75 శాతం భరిస్తుంది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్, పాలనా చెల్లింపుల పద్దు కింద చెల్లించాల్సిన రూ. 2,246 కోట్ల రూపాయలను విడుదల చేయలేదన్నారు. ఈ నిధులను కేంద్రం బకాయి పెట్టడం వలన ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు పనులు కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు మొత్తాన్ని సత్వరమే విడుదల చేయవలసిందిగా విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. -
పేదలకు దక్కని పనులు.. నిధులు
సాక్షి, అమరావతి : నిరు పేదలకు చేతినిండా పని కల్పించి.. వారు నిశ్చింతగా జీవించేందుకు ఉద్దేశించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పెద్దల జేబులు నింపే కార్యక్రమంలా మారిపోయింది. చేసేందుకు పనిలేక, పస్తులుండలేక కుటుం బంతో కలసి పనులు వెతుక్కుంటూ పేదలు వలసపోతున్నారు. పేదలకు దక్కాల్సిన ఉపాధి హామీ పనులను, నిధులను కొట్టేయడానికి అధికారపార్టీ నేతలు అనేక ఎత్తులు వేస్తున్నారు. మెషీన్లతో పనులు చేయించి కూలీల పేరుతో బిల్లులు మంజూరు చేయించుకోవడం, పనులు చేయకపోయినా చేసినట్లు చూపించడం, చేసిన పనులే మరలా చేసినట్లు చూపించడం వంటి అక్రమాలకు అంతే లేదు. ఏడాదిన్నర క్రితమే కృష్ణా పుష్కరాలు ముగిసినా ఉపాధి నిధుల నుంచి ఇంకా బిల్లులు మంజూరవుతూనే ఉన్నాయి. ఇక అధికారపార్టీకి చెందిన పెద్దలు సూచించిన గ్రామాలకు కోట్ల రూపాయల మేర పనులు మంజూరవుతుండగా పనులు అవసరం ఉన్న గ్రామాలకు మాత్రం మొండిచేయే దక్కుతోంది. అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న చోట్లనయినా నిరుపేద కూలీలకు పనులు లభిస్తున్నాయనుకుంటే పొరపాటే. అక్కడ పచ్చచొక్కాలకు అనుకూలురైన కూలీలకు మాత్రమే పనులు. మిగిలినవారికి పస్తులే.. గొల్లపూడిలో రూ.1.30 కోట్ల దోపిడీ కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో∙పుష్కరాల పేరుతో రూ. కోటి ఉపాధి నిధులకు బిల్లులు చేసుకున్నారు. విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై గొల్లపూడి వన్ సెంటర్ నుంచి పుష్కరఘాట్‌కు ఎప్పటి నుంచో రోడ్డు ఉంది. దాదాపు కిలో మీటరు పరిధిలో ఉండే ఈ రోడ్డు గ్రామం పరిధిలో ఉన్నంత వరకు సిమెంట్ రోడ్డు, ఆ తర్వాత పుష్కర్‌ఘాట్ వరకు మెటల్ రోడ్డు ఉండేది. 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాల సందర్భంగా కన్స్ట్రçక్షన్ ఆఫ్ రూరల్ రోడ్సు(సీఆర్ఆర్) గ్రాంట్‌లో అదే రోడ్డు అధునీకరణకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో పుష్కరాల సమయంలోనే గొల్లపూడి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డును వెడల్పు చేశారు. ఆ తర్వాత ఉన్న మెటల్ రోడ్డుపై తారు రోడ్డు వేశారు. అయితే, ఆ ప్రాంతంలో కొత్తగా మెటల్ రోడ్డు నిర్మించినట్టు రికార్డులు రాసుకొని ఉపాధి పథకం నిధుల నుంచి రూ.77.76 లక్షలు బిల్లులు చేసుకున్నారు. సిమెంట్ రోడ్డు వెడల్పు, తారు రోడ్డు నిర్మాణం పుష్కరాలు జరిగిన 2016 ఆగస్టు నాటికే పూర్తయినప్పటికీ, అక్కడ మెటల్ రోడ్డు నిర్మాణానికి 2017 జులై 14, 23, 27 తేదీల్లో కూడా రూ. 72.88 లక్షలు ఉపాధి నిధుల నుంచి అధికారులు బిల్లులు చెల్లించారు. (పైన కనిపిస్తున్న చిన్న సాగునీటి కాలువ కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలంలోని రామకృష్ణాపురంలోనిది. ఇందులో ఏకంగా 1,470 మంది కూలీలతో డ్రగ్ అవుట్ ఫాండ్ నిర్మాణం చేపట్టినట్టు బిల్లులు చేసుకుని అధికార పార్టీ పెద్దలు కోట్లు తినేశారు.) పనులు లేక వలసపోతున్న పేదలు పేదలకు కూలి పనులు కల్పించడం కోసం కేంద్రమిచ్చే నిధులను ఏదో ఒక పేరు చెప్పి పెద్దలు తమ జేబుల్లోకి మళ్లించుకుంటుంటే గ్రామాల్లో నిరుపేదలు సొంత వూరిలో పనులు దొరక్క వలస పోతున్నారు. విశాఖపట్నం జిల్లా రామకతం మండలం మేడివాడ, దేవరపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు 20 రోజుల కిత్రం పనులను వెతుక్కుంటూ కృష్ణా , గుంటూరు జిల్లాలకు వలస వచ్చాయి. అందులో మేడివాడకు చెందిన తాతారావు, చిన్నారావు – లక్ష్మీ కుటుంబాలతో పాటు మరో ఐదు కుటుంబాలు తాము పని వెతుక్కుంటూ వచ్చిన గారపాడు గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తి కావడంతో తిరుగు ప్రయాణం కోసం శనివారం విజయవాడ రైల్వే సేష్టన్‌లో వేచి ఉన్నారు. సొంత ఊరిలో ఉపాధి పనులు లేకపోవడం వల్లే తాము పనులు వెతుక్కుంటూ పొరుగూరికి రావాల్సి వచ్చిందని లక్ష్మీ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. పచ్చచొక్కాలకు నచ్చిన వారికే కూలిపని అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో కూలీలకు పనులు కల్పిస్తున్నా... అక్కడ టీడీపీ నేతలదే ఇష్టారాజ్యం. వారు చెప్పినవారికే పనులు. కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వడ్డే రాజు 2007లోనే గ్రామంలో ఉపాధి కూలీగా పేరు నమోదు చేసుకున్నారు. గ్రామంలో కూలీల జాబితాలో అతనిది నాల్గో నెంబరు. గతేడాది వడ్డే రాజు ఆరు రోజులు పాటు పని చేసినట్టు చూపి గ్రామంలో టీడీపీ నేతే బిల్లులు చేసుకున్నారు. సోషల్ ఆడిట్ విచారణలో రాజు తాను పనిచేయలేదని, దొంగ బిల్లులు చేసుకున్నారని చెప్పడంతో గ్రామంలో టీడీపీ నేతలు, వారికి అనుకూలంగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ కక్షగట్టారు. ఈ ఏడాది రాజు ఎన్నిసార్లు పని అడిగినా ఒక్క రోజు కూడా అతనికి పని కల్పించలేదు. గ్రామంలోని దాదాపు 20 శ్రమశక్తి సంఘాలకు ఈ ఏడాది ఒక్క రోజు కూడా పని కల్పించలేదని అక్కడి కూలీలు చెబుతున్నారు. చేయని పనులకు బిల్లులు గుంటూరు జిల్లా యడ్లపాడు మండల కేంద్రాన్ని అనుకొని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో రెండు పనులు (పనుల గుర్తింపు నెంబర్లు 071103710008170461, 071103710008170463) చేసినట్టు ఒక పనికి రూ. 4.41 లక్షలు, మరొక పనికి రూ. 3.20 లక్షలు చొప్పున బిల్లులు చేసుకున్నారు. ఆ చెరువులో ఈ వేసవిలో 50 మంది కూలీలతో రెండు వారాల పాటు లక్ష రూపాయల పనిచేసినట్టు ఆ పనిలో పాల్గొన్న కూలీ ఒకరు సాక్షి ప్రతినిధికి తెలిపారు. కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో 1470 మంది కూలీలతో డ్రగ్ఆవుట్ పాండ్ నిర్మాణం చేపట్టినట్లు రికార్డుల్లో పేర్కొని బిల్లులు చేసుకున్నారు. పని నెంబరు 131812805005170238. ఆ పని ఎస్టిమేట్స్ కాపీలో పేర్కొన్న జియోట్యాగింగ్ వివరాలు చూస్తే ఆ ప్రాంతంలో పని జరిగిన దాఖాలాలు లేవు. అది సాగునీటి శాఖ పరిధిలోని ఓ ప్రధాన పంట కాల్వ అని జియో ట్యాగింగ్‌లో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగునీటి శాఖ ప్రధాన పంట కాల్వలో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టరు. ఒకవేళ పనులు చేపట్టాలంటే ముందుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతి తీసుకున్న దాఖాలు లేవు. అయినా అక్కడ పనిచేసినట్టు బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి. లోకేష్ పీఏ ఊరికి రూ.3.48 కోట్లు.. ఉపాధి పథకం అమలు మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత సహాయకుడి సొంత ఊరు తిమ్మాపురం గ్రామానికి ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో రూ. 3.48 కోట్లు ఉపాధి నిధుల బిల్లులు మంజూరయ్యాయి. తిమ్మాపురం గ్రామంలో 1167 జాబ్‌కార్డులుండగా, పొరుగు గ్రామం వంకాయపాడులో 1577 జాబ్‌కార్డులున్నాయి. కానీ ఆ గ్రామానికి ఈ ఏడాది మంజూరు అయిన నిధులు కేవలం రూ. 23 లక్షలే. అదే మండలంలో మరో 17 గ్రామాలున్నా మరే గ్రామానికీ రూ. కోటి నిధులు మంజూరు కాలేదు. తిమ్మాపురంలో ఒకే సిమెంట్ రోడ్డును చూపి రెండు పనులకు బిల్లులు చేసుకున్నారు. ఫాంపాండ్స్‌లో రూ. 1,165 కోట్లు పోశారు.. ఉపాధి హామీ పథకంలో పంట కుంటలు(ఫామ్ పాండ్స్) నిర్మాణం ‘మెషిన్లతో పని– కూలీల పేరుతో బిల్లులు’ అన్న చందంగా మారింది. ఉపాధి పథకంలో చేపట్టే పనుల్లో మెషిన్ల వాడకం పూర్తిగా నిషేదం. కూలీల ద్వారానే పనులు చేపట్టాలి. కూలీల ద్వారా జరిగే పనుల విలువను బట్టి .. 60 శాతం కూలీలకు, 40 శాతం మెటిరీయల్ వినియోగానికి కేంద్రం నిధులు ఇస్తోంది. కూలీలతో ఎక్కువ పని జరిగినట్టు చూపించాలని ప్రభుత్వం అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మెషీన్ల సహాయంతో ఫామ్ పాండ్స్ నిర్మాణం చేపట్టినా ఆ పనిని కూలీలతోనే చేయించినట్లు రికార్డుల్లో చూపి కూలీల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. ఈ రకమైన అవినీతి దాదాపు రాష్ట్రమంతటా విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ మూడేళ్లలో ఫాండ్పామ్స్ పేరుతో రూ. 1,165 కోట్ల మేర మెషిన్లతో పనిచేయించి, కూలీల పేరుతో బిల్లు చేసుకున్నారు. – గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో రైతుల పొలాల్లో అప్పటికే ఉన్న వ్యవసాయ బావులను కూడా ఫామ్ పాండ్స్‌గా చూపి బిల్లులు చేసుకున్నారు. పాలపాడుగ్రామంలో 2016 –17 ఆర్థిక సంవత్సరంలో 30 ఫామ్ పాండ్స్ త్రవ్వకాలు జరిగినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. దీనిని సోషల్ ఆడిట్ బృందం గుర్తించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. –విజయవాడ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది, స్థానిక అధికార పార్టీ నేతలు దేవస్థానం భూముల్లో ఫామ్‌పాండ్స్ తవ్వినట్టు చూపి బిల్లు చేసుకుంటున్నారు. పోరంకిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఫామ్ పాండ్ నిర్మాణం చేపట్టినట్టు చూపి రూ. 16,700 బిల్లులు చేసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలుకు గత మూడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు సంవత్సరం ఇచ్చిన మొత్తం(రూ. కోట్లలో) 2016–16 3,073.80 2016–17 3,940.21 2017–18(ఇప్పటి వరకు) 4,458.63 -
పల్లెకు ఊపిరి పోసిన పథకం
సమకాలీనం ప్రకృతి వైపరీత్యాలు, కునారిల్లిన వ్యవసాయం, చేష్టలుడిగిన చేతివృత్తులు, పాలకుల తప్పుడు ప్రాధమ్యాలతో చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉపాధి చూపలేనప్పుడు కోట్లాది పేద కుటుంబాలు తిండి కోసం అల్లల్లాడాయి. అప్పుడొక ఆపన్నహస్తం ‘నరేగ’ రూపంలో ఆదుకుంది. ఫలితంగా కూలిపని లభించింది. ఉన్న ఊళ్లోనే ఉపాధి, రెండు పూటలా తిండి దొరికింది. కటిక దారిద్య్రం తొలగింది. వలసలు నిలిచిపోయాయి. దారిద్య్రరేఖ దిగువనున్న వారి కొనుగోలు శక్తి పెరిగింది. కారణాలేమైనా.... రాజకీయ వ్యవస్థ తలచుకుంటే ఒకే ఒక పథకం ద్వారా దేశం గతిని మార్చగలదని నిరూపించిన అరుదైన, అద్భుత కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగ). ఇప్పుడు అదే ‘నరేగ’ తరచూ వివాదాల్లోకి రావడానికి కూడా ఆ రాజకీయాలే కారణం. స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో అనేక మంచి పథకాలు, చట్టాలు దారి మళ్లి నిష్ర్పయోజనం కావడానికి కారణమైన ‘ఓటుబ్యాంకు రాజకీయాలే’ విచిత్రంగా ఇప్పుడు ఈ పథకానికి ఊపిరిపోస్తున్నాయి. అందుకు కారణం, ఈ పథకం బహుజనులతో, వారి జీవనోపాధితో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ఇంకా అనేకానేక ప్రజా ప్రయోజన లక్ష్యాలతో ముడిపడి ఉండడమే. అనేక విశ్వవేదికల మీద ప్రశంసలందుకున్న ఈ పథకం, ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యంలో కూడా... నిరుపేద భారతీయుడు అన్నం ముద్దకు దూరం కాకుండా నిలబడగల్గిన భూమికను కల్పించింది. సరిగ్గా దశాబ్దం కింద ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన యూపీఏపై చివర్లో, అంటే ఎన్నికల వాకిట్లో విమర్శలు చేసిన ఎన్డీయే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు పథకాన్ని కొనసాగించింది. మార్పులేవైనా మంచికైతే ఆహ్వానించదగినవే, కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం పథకం స్ఫూర్తికి విఘ్నం కలిగించే ఏ మార్పులనూ పౌర సమాజం, ముఖ్యంగా చైతన్యం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించదు. ఇప్పుడదే జరుగుతోంది. అవగాహన ఉండీ-లేక రాజకీయ కారణాలతో రాహుల్ గాంధీ లాంటివారు చేసే విమర్శలెలా ఉన్నా... ప్రజాభిప్రాయానికి తలొగ్గిన ఎన్డీయే పాలకులు నరేగ రద్దు చేయడం సంగతలా ఉంచి, మార్పులు చేసేందుకు కూడా జంకుతున్నారు. అందుకే దీనిని మెరుగుపరిచే సావకాశం లభించడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం పథకాన్ని కొనసాగిస్తూనే దాన్ని నీరు కార్చే కుయత్నాల్ని అడ్డుకోవడం, నిధులు దారిమళ్లకుండా నిరంతరం నిఘా కొనసాగించడమే ఇప్పుడు ప్రసారమాధ్యమాలు, పౌర సమాజం బాధ్యత అన్నది సామాజిక విశ్లేషకుల అభిప్రాయం. నరేగ పుట్టుక, కొనసాగింపే ఓ చారిత్రక మేలు మలుపు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల సంబద్ధత ఎంత? అనేది తరచూ చర్చనీయాంశమౌతోంది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తలంపుతో అమల్లోకి వచ్చిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మనుగడలోకి వచ్చాయి. కొన్ని పుబ్బలో పుట్టి మఖలో మనుగడ కోల్పోయినవీ ఉన్నాయి. పాలకపక్షాలుగా గొప్ప అవకాశం దొరికి పాతికేళ్లకు పైబడి అధికారం చేజిక్కినా... అభివృద్ధి నమూనా ఆవిష్కరించడంలో, మనిషి జీవన ప్రమాణాలు పెంచడంలో విఫలమైనట్టు పశ్చిమ బెంగాల్ ఉదాహరణగా విమర్శలెదుర్కొన్న కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలోని పలుచోట్ల ప్రతిపక్షంగా గొప్ప భూమికనే పోషించాయి. ఆచరణలో వెలుతురు మసకబారినా.... విధానపరంగా ఆ కర్తవ్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో పదేళ్లు పాలనా పగ్గాలు చేపట్టిన యూపీఏ-1, యూపీఏ-2కి ఉన్న ప్రధాన వ్యత్యాసం కమ్యూనిస్టులే! కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్న యూపీఏ-1 కొన్ని జనహిత కార్యక్రమాల్ని చేపట్టి, దిగ్విజయంగా అమలుపరచింది. 2009లో అధికారం నిలబెట్టుకుంది. కమ్యూనిస్టుల భాగస్వామ్యం లేని యూపీఏ-2 పూర్తిగా విఫలమైంది. ప్రజాప్రయోజన పథకాలు పెద్దగా రచించకపోగా అవినీతి, ఆశ్రీతపక్షపాతంతో గబ్బుపట్టి పోయింది. ఆ కమ్యూనిస్టుల ప్రత్యక్ష-పరోక్ష ఒత్తిళ్ల పొత్తిళ్లలో పురుడు పోసుకున్న అద్భుత పథకాల్లో ‘సమాచార హక్కు చట్టం-2015’ ఒకటైతే, ‘నరేగ’ మరొకటి! గ్రామీణ ప్రాంతాల్లోని నిరు పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించడం ద్వారా ఉపాధి చూపే గొప్ప లక్ష్యంతో మొదలైన ఈ పథకం, పనిలో పనిగా ఎన్నెన్నో ప్రయో జనాల్ని నెరవేర్చింది. ఇంకా నెరవేరుస్తూనే ఉంది. ఏటా వేలాది కోట్ల రూపా యలు వ్యయం అవుతున్నా శాశ్వతమైన ఆస్తులను ఏర్పాటు చేసే దిశలో ఈ పథకాన్ని నడపలేకపోతున్నారనడంతోపాటు పలు విమర్శలున్నాయి. ఉత్పత్తి ఒకటి, ఉప ఉత్పత్తులెన్నో! 2006 ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 200 జిల్లాల్లో ఈ పథకం అమలును ఆరంభించారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో మరో 130 జిల్లాలకు విస్తరించారు. 1 ఏప్రిల్, 2008 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.36 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల మధ్య ఖర్చు పెడుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి రూ. 38.89 కోట్లు కేటాయించారు. వ్యయం లెక్కలు తేలాల్సి ఉంది. ఈ పథకం ద్వారా దేశం మొత్తమ్మీద ఉపాధి పొందుతున్న వారిలో 51 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే! 47 శాతం మంది మహిళలు లబ్దిదారులుగా ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే గడచిన పదేళ్ల కాలంలో ఉపాధి హామీ పథకానికి రూ. 23 వేల కోట్లు ఖర్చు పెట్టారు. 156.71 కోట్ల పనిదినాల పాటు ఈ పథకం కింద ఎందరో కూలీలు ఉపాధి పొందారు. రాష్ట్రంలో ప్రతి కూలీకి సగటున రోజుకు 120 రూపాయలు వేతనంగా లభించింది. ఇది ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఈ 156 కోట్ల పనిదినాల్లో 45.15 శాతం పనిదినాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉపాధి పొందినట్టు గణాంకాలున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, కునారిల్లిన వ్యవసాయం, చేష్టలుడిగిన చేతివృత్తులు, పాలకుల తప్పుడు ప్రాధమ్యాలతో చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉపాధి చూపలేనప్పుడు కోట్లాది పేద కుటుంబాలు తిండి కోసం అల్లల్లాడాయి. అప్పుడొక ఆపన్నహస్తం నరేగ రూపంలో ఆదుకుంది. ఫలితంగా కూలిపని లభించింది. ఉన్న ఊళ్లోనే ఉపాధి, రెండు పూటలా తిండి దొరికింది. కటిక దారిద్య్రం తొలగింది. వలసలు నిలిచిపోయాయి. దారిద్య్రరేఖ దిగువనున్న వారి కొనుగోలు శక్తి పెరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కదలిక మొదలయింది. చెరువుల పూడిక తీయగలిగారు. భూసారం హెచ్చింది. వర్షపు నీరు నిలువచేసే చెక్‌డ్యామ్‌ల వల్ల భూగర్భజల మట్టాలు పెరిగాయి. సడక్ యోజన కింద గ్రామీణ రవాణా వ్యవస్థ మెరుగయింది. వ్యక్తిగత మరుగుదొడ్లకూ దీన్ని వర్తింపజేయడం వల్ల పారిశుధ్యానికి ఊతమిచ్చినట్టయింది. శీర్ష భాగాన నిలిచిన తెలుగు రాష్ట్రాలు మొదట్నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నరేగ అమలులో అగ్రభాగాన నిలిచింది. ఇక్కడి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రూపొందించిన పారదర్శక అమలు పద్ధతులు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచాయి. సామాజిక తనిఖీ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఒక సామాజిక సంస్థ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనంలో.. కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న నిరుపేద కూలి కుటుంబాలు అదనపు పూటలు భోజనం చేయగలుగుతున్నాయని తేల్చింది. నిరుపేదలు దాదాపు ఏడు లక్షల ఎకరాల తమ బీడు భూములను ఉపాధి హామీ డబ్బులతో చదును చేసుకొని.. పండ్లతోటలను సాగు చేసుకుంటున్నారని తేలింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనే.. పదేళ్ల కాలంలో 898 పంచాయతీ భవనాలు ఉపాధి డబ్బులతో నిర్మించారు. మండల స్థాయిలో మరో 221 భవనాల నిర్మాణాలు చేపట్టారు. నాలుగు వేలకు పైగా సిమెంట్ రోడ్లు.. పది వేలకు పైగా వర్షపు నీటిని నిల్వ చేసుకునే కట్టడాలు పూర్తయ్యాయి.. ఆలూరు మండలంలో పెద్ద కొత్తూరు గ్రామానికి సాగునీటి వసతి లేదు. గ్రామస్తులు నాలుగేళ్ల క్రితమే ఉపాధి పథకం ద్వారా తమ పొలాల మధ్య గుంతలు తవ్వి వాటిలో వర్షపునీటిని నిల్వ చేసుకొని.. ఆ నీటి ద్వారా పంటలు సాగుచేసుకుంటున్నారు. విస్తృతి కలిగిన నరేగలో ఇవి కొన్ని ఉదాహరణలు, విజయ నమూనాలు మాత్రమే! సవరణలు, సర్దుబాట్లతో నోరుమూయాలి! నరేగపై పలు విమర్శలున్నాయి. రాజకీయ నేతలు, అధికారులు నిధుల్ని దారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్నారనేది ఒకటి. తగిన పనిదినాలు చూపకుండా, నమోదు కన్నా తగ్గించి కూలి డబ్బులిచ్చో, ఎక్కువ లెక్కలు చూపి నిధులు నొక్కడమో... ఇలా అవినీతికి పాల్పడుతున్నారని మరో విమర్శ. ఈ పథకం వల్ల గ్రామాల్లో కూలీలు దొరక్క, కూలి రేట్లు పెరిగి వ్యవసాయం కుంటుపడిందనేది ఆరోపణ. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇవి ప్రతిబంధకాలే కావని, గ్రామాల్లో రైతులు-కూలీలకు మధ్య చిచ్చు రేపి పథకాన్ని దెబ్బతీసే కుట్రని ఈ పథకాన్ని సమర్థించేవారంటారు. వర్షాలు పడగానే వ్యవసాయ ప్రాంతాల్లో నరేగ అమలు నిలుస్తుందంటారు. నిజానికి ఈ పథకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయంతో అనుసంధానించాలనే సూచన కూడా ఉంది. కూలీలకు కూర్చొబెట్టి డబ్బులు ఇవ్వడం, సోమరులు, తాగుబోతు-తిరుగుబోతుల్ని తయారుచేయడం మినహా ఈ పథకం మరే ప్రయోజనం సాధించలేదంటారు విమర్శకులు. కోటీశ్వరులు సైతం వంట గ్యాస్ సబ్సిడీ రూపేణా ఏడాదికి ఐదారు వేల రూపాయలు కేంద్రం నుంచి లబ్ధిపొందుతున్నారని, ఉపాధి పథకం ద్వారా ఓ కుటుంబానికి కలిగే ప్రయోజనం ఏడాదికి ఐదారు వేల రూపాయలకు అటు ఇటుగానే ఉంటుంద న్నది సమర్థించేవారి వాదన. ఈ పథకానికి నిధులు తగ్గించాలనో, కేవలం గిరిజనులు, నిరుపేదలున్న ప్రాంతాలకే పరిమితం చేయాలనో తలపెట్టిన ప్రతిపాదనల్ని ఎన్డీయే ప్రభుత్వం విరమించుకుంది. వేతనాలు- మెటీరియల్ నిష్పత్తిని ఇప్పుడున్న 60ః40 నుంచి 51ః49 కి మార్చే ఆలోచనపైన కూడా విమర్శలున్నాయి. పౌర సమాజం విమర్శలు, ఒత్తిళ్లే వెనుకడుగుకు కార ణంగా కనిపిస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఎన్ని విమర్శలు చేసినా... ఈ పథకం కొనసాగింపునకు, సంస్కరణల్లో వెనుకడుగుకు కారణం ‘ఓటు బ్యాంకు‘ రాజకీయాలే! 2009లో యూపీఏ తిరిగి అధికారం నిలబెట్టుకోవ డంలో నరేగది కీలక భూమిక అనుకుంటున్న ఎన్డీయే భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఆచితూచి అడుగులేస్తోంది. ఎవరి కారణాలు వారికుండొచ్చు, ఎటోచ్చీ ప్రజలకు మేలు చేసే పథకం, మరింత మందికి మేలు చేసేలా సానుకూల మార్పులతో కొనసాగాలన్నదే జనహితం కోరే వారి కాంక్ష! ఈమెయిల్: dileepreddy@sakshi.com