సాక్షి, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో స్థానిక సర్పంచ్ దంపతులు పాలుపంచుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌గా ఎన్నికైన లావుడ్యా స్వాతి ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాము కూడా ఉపాధి పనులకు వెళ్లాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా లావుడ్యా స్వాతి, భర్త వాగా సోమవారం అటవీప్రాంతంలో గుంటలు తవ్వుతూ ఇలా కనిపించారు.
పరీక్ష కోసం చెప్పుల క్యూ!
ఓ వైపు విజృంభిస్తున్న కరోనా.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు. దీంతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని పీహెచ్‌సీ వద్ద సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన ప్రజలు క్యూలో నిల్చోలేక, ఇలా చెప్పులను ఉంచి దూరం దూరంగా కూర్చొన్నారు. ఎండలో నిలబడటం కష్టంగా ఉందని, ఆస్పత్రి వద్ద కనీసం టెంట్ వేయిస్తే బాగుంటుందని జనాలు కోరుతున్నారు. – జిన్నారం (పటాన్‌చెరు)
సంతోషాన్ని పంచిన స్మార్ట్‌ఫోన్
కరోనా కన్నెర్రజేసి బంధాలను దూరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, మండుటెండలో ఒంటరిగా పనిచేసుకుంటున్న ఆ ముసలమ్మకు స్మార్ట్‌ఫోన్ సంతోషాన్నిచ్చింది. మండుటెండలో వేరుశనగ తెంపుతున్న పొచ్చక్క అనే ముసలమ్మ, ఇదిగో ఇలా.. స్మార్ట్‌ఫోన్‌లో తన కూతురితో వీడియో కాల్ మాట్లాడుతూ, తాను పడుతున్న కష్టాన్ని మరిచిపోయి సంబరపడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది ప్రాంతంలోని ఓ చేనులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment