Sarpunch
-
దారుణం: ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌తో సర్పంచ్ దాడి
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై పాత సావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు మంటలను అర్పారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపటంతో చికిత్స కోసం బైంసాకు తరలించారు. ఉపాధి పనుల విషయంలో సంకతం చేయాలని సర్పంచ్ సాయినాథ్ కోరగా, రాజు నిరాకరించడంతో పెట్రోల్ పోసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పెట్రోల్ దాడిపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సర్పంచ్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
Isolation centre: ఊరు బాగుండాలని..
ఆత్మకూరు: గ్రామం బాగుండాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు కోవిడ్ బాధితుల కోసం సొంతంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. గ్రామంలో యాక్టివ్ కేసులను తగ్గించడానికి ఇదే సరైన మార్గమని భావించిన ఆయన.. స్థానిక సెయింట్ థెరిస్సా స్కూల్లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి నుంచి ఈ కేంద్రంలో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉండే వారికి ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం చికెన్‌తో, రాత్రికి శాఖాహారంతో భోజనం అందించనున్నారు. కాగా, కోవిడ్ వచ్చినవారి ఇళ్లలో ఐసోలేషన్ సదుపాయం లేక ఇబ్బందిపడుతున్నారని సర్పంచ్ రాజు తెలిపారు. చదవండి: కరోనా బాధితుల కోసం ఉచిత అంబులెన్సులు -
Coronavirus: పాడె మోసి.. చితి పేర్చిన ఎమ్మెల్యే
జఫర్‌గఢ్: కరోనా బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ సర్పంచ్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే టి.రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాడె మోయడంతో పాటు చితిపేర్చే కార్యక్రమాలన్నీ దగ్గర ఉండి నిర్వర్తించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చౌదరిపల్లి మల్లయ్య (50) కరోనాతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో గ్రామ శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలా గే, దగ్గరుండి అంత్యక్రియల క్రతువు పూర్తి చేయించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి విషయంలో అపోహలు వీడాలని సూచించారు. చదవండి: పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు -
సర్పంచ్ ఔదార్యం: 1,200 కుటుంబాలకు కూరగాయలు
కొండపాక (గజ్వేల్): లాక్డౌన్ వేళ తమ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడొద్దని స్వంత డబ్బులతో కూరగాయలు పంపిణీ చేసి ఓ సర్పంచ్ తన ఔదార్యం చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి బుధవారం 1,200 కుటుంబాలకు ఐదు రోజులకు సరిపడా కూరగాయలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరాడు. అనంతరం రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన దుస్తుల కిట్లను లబ్ధిదారులకు అందజేశాడు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు సాయపడ్డారు. కోవిడ్ హెల్ప్ యాప్ ఆవిష్కరణ నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు కోవిడ్ హెల్ప్ యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌ను బుధవారం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు. ఈ యాప్‌లో కోవిడ్ సమాచారం లభించడంతో పాటు వైరస్ బాధితులకు యాప్ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. యాప్‌లో ఆస్పత్రుల పడకలు, ప్లాస్మా దాతల వివరాలు పొందవచ్చని చెప్పారు. యాప్‌ను తయారు చేసిన విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు చదవండి: పీఎం కేర్ నిధులతో 1.5 లక్షల ఆక్సీమీటర్లు -
‘ఉపాధి’ పనుల్లో సర్పంచ్ దంపతులు
సాక్షి, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో స్థానిక సర్పంచ్ దంపతులు పాలుపంచుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌గా ఎన్నికైన లావుడ్యా స్వాతి ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాము కూడా ఉపాధి పనులకు వెళ్లాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా లావుడ్యా స్వాతి, భర్త వాగా సోమవారం అటవీప్రాంతంలో గుంటలు తవ్వుతూ ఇలా కనిపించారు. పరీక్ష కోసం చెప్పుల క్యూ! ఓ వైపు విజృంభిస్తున్న కరోనా.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు. దీంతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని పీహెచ్సీ వద్ద సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన ప్రజలు క్యూలో నిల్చోలేక, ఇలా చెప్పులను ఉంచి దూరం దూరంగా కూర్చొన్నారు. ఎండలో నిలబడటం కష్టంగా ఉందని, ఆస్పత్రి వద్ద కనీసం టెంట్ వేయిస్తే బాగుంటుందని జనాలు కోరుతున్నారు. – జిన్నారం (పటాన్చెరు) సంతోషాన్ని పంచిన స్మార్ట్‌ఫోన్ కరోనా కన్నెర్రజేసి బంధాలను దూరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, మండుటెండలో ఒంటరిగా పనిచేసుకుంటున్న ఆ ముసలమ్మకు స్మార్ట్‌ఫోన్ సంతోషాన్నిచ్చింది. మండుటెండలో వేరుశనగ తెంపుతున్న పొచ్చక్క అనే ముసలమ్మ, ఇదిగో ఇలా.. స్మార్ట్‌ఫోన్‌లో తన కూతురితో వీడియో కాల్ మాట్లాడుతూ, తాను పడుతున్న కష్టాన్ని మరిచిపోయి సంబరపడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది ప్రాంతంలోని ఓ చేనులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
‘కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లం’
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లార్కిపోరా ప్రాంతంలోని లుక్బావన్ గ్రామ సర్పంచ్ అజయ్ పండిత(40) అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. ఆయన ఉగ్రవాదుల చేతిలో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అజయ్ పండిత కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్. అజయ్ పండిత అంత్యక్రియల అనంతరం ఆయన సోదరుడు విజయ్ పండిత మీడియాతో మాట్లాడుతూ.. మేము కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లము. కశ్మీర్ లోయలో పండిట్ల కోసం ప్రభుత్వం వెంటనే రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తన సోదరుడు అందరికీ సహాయం చేసేవాడని తెలిపారు. బలహీన వర్గాల వారిని ఆదుకునేవాడని పేర్కొన్నారు. అజయ్ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ముస్లిం గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు. (కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు) అదే విధంగా మృతి చెందిన సర్పంచ్ అజయ్ పండిత తండ్రి ద్వారికా నాథ్ పండిత మాట్లాడుతూ.. తన కుమారుడు నిజమైన దేశభక్తుడని తెలిపాడు. 1996లో తమ కుటుంబం తిరిగి కశ్మీర్‌కు వచ్చిందన్నారు. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని అజయ్ తమ ఇంటిని నిర్మించాడని పేర్కొన్నారు. తన కుమారుడి మృతి వెనక దేశ ద్రోహులు ఉన్నారని ఆరోపించారు. అజయ్ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని తెలిపారు. గత డిసెంబర్లో అజయ్.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరిన విషయాన్ని తండ్రి ద్వారికా నాథ్ గుర్తుచేశారు. (సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్) -
38 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి
శామీర్‌పేట్: పోలింగ్ మొదలయ్యే సమయానికి 38 గంటల ముందే (19వ తేదీ సాయంత్రం 5 గంటలకు) ప్రచారాన్ని నిలిపివేయాలని జిల్లా ఉపఎన్నికల అధికారి జ్యోతి తెలిపారు. గురువారం శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. శామీర్‌పేట మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో యాడారం, నాగిశెట్టిపల్లి పంచాయతీల్లో సర్పంచ్‌తో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాయని వీటితో పాటు లింగాపూర్ తాండాలోని 8 వార్డుల వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్పికైనట్లు తెలిపారు. శామీర్‌పేట మండలంలో మిగిలి 20 గ్రామపంచాయితీల్లో 74 మంది సర్పంచ్ అభ్యర్ధులతో పాటు 574 మంది వార్డు సభ్యుడి అభ్యర్ధులకు 216 పోలింగ్ బూత్‌ల ద్వారా ఎన్నికలు 21న నిర్వహించి ఆదే రోజు మధ్యాహ్నం తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఒకరోజు ముందే పోలింగ్‌స్టేషన్‌కు సిబ్బంది... గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్‌కు ఒక రోజు ముందే ఎన్నికల సిబ్బంది చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించామని, మండల వ్యాప్తంగా 22 రూట్లలో 22 బస్సుల్లో ఎన్నికల సామాగ్రిని తరలించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నలుగురు జోనల్ అధికారులతో పాటు 672 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు(ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎంఎస్టీ)లు 24 గంటలు మండల వ్యాప్తంగా పర్యటిస్తున్నాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు... మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయన్నారు. అతి సమస్యాత్మకమైన అలియాబాద్, బొమ్మరాశిపేట, లాల్‌గడి మలక్‌పేట, మజీద్‌పూర్, మూడుచింతలపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి గ్రామాలను గుర్తించామని ఈ గ్రామాల్లో అదనపు పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలు(ఫ్లైయింగ్స్క్వాడ్) పర్యటిస్తాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్ధులతో పాటు ప్రజలు సహకరించాలన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనితకు నిరసన సెగ
-
తారస్థాయికి తమ్ముళ్ల తన్నులాట
నెల్లూరు, సైదాపురం: తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. టీడీపీకే చెందిన ఓ గ్రామ సర్పంచ్‌ని నడివీధిలో చొక్కా పట్టుకుని పిడి గుద్దులు కురిపించి, అతను ప్రయాణించే వాహనం అద్దాలను పగలగొట్టిన ఘటన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఈ వివాదం చూస్తున్న జనం విస్తుపోయ్యారు. తనకు జరిగిన అవమానంపై పోలీసులకు బాధిత సర్పంచ్ విన్నవించుకున్నారు. ఈ ఘటన మండలంలోని చీకవోలు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు, సర్పంచ్ కథనం మేరకు.. చీకవోలు గ్రామ సర్పంచ్‌గా సజ్జా రమణయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి, గతేడాది టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం వారు చేసే అక్రమాలపై సర్పంచ్ రమణయ్య పోరాటం సాగిస్తుండేవారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ నడిబొడ్డులో ప్రత్యర్థి వర్గం షామి యాను వేసి, వాహనాలు పోయేందుకు కూడా వీలు లేకుండా హంగామా చేశారు. అదే సయమంలో కారులో అక్కడకు వచ్చిన గ్రామ సర్పంచ్ రమణయ్య వాహనాలు పోయేందుకు కొంత వీలు కల్పించాలని వారిని కోరారు. దీంతో అక్కడే ఉన్న మరో వర్గం టీడీపీ నాయకులు పొలంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, దువ్వూరు శ్రీని వా సులురెడ్డి, ధునుం జయ కలిసి ఒక్కసారిగా సర్పంచ్ రమణయ్యపై రాడ్ల్లతో దాడి చేశారు. దీంతో చొక్కా చినిగిపోవడంతో పాటు అతని చేతికి గాయమైంది. అంతటితో ఆగకుండా రాడ్లతో కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అక్కడకు చేరుకున్న వారంతా ఈ ఘటన చూసి నివ్వెరపోయ్యారు. పూర్తిగా గొడవ సర్దుమణిగిన తర్వాత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆ గ్రామానికి చేరుకుని ఇరువురి నాయకులతో చర్చించారు. గాయపడిన సర్పంచ్ రమణయ్యను పలువురు నేతలు, అధికారులు పరామర్శించారు. తనపై జరిగిన దాడిపై సర్పంచ్ సజ్జా రమణయ్య ఏఎస్సై ఝాన్సీకి వివరించారు. -
సర్పంచులకు ‘పది’ ముప్పు
సాక్షి, కడప, బద్వేలు : స్థానిక సంస్థల్లో షాడో పెత్తనానికి చెక్ పడనుంది. అక్షరజ్ఞానం లేని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను నడిపించే తెర వెనుక నాయకుల పెత్తనానికి తెర పడే సమయం వచ్చింది. కనీసం పదో తరగగి పాసైతే కాని పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే నిబంధనను తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయమై తీవ్ర కసరత్తు చేసింది. ఎటువంటి విద్యార్హత లేకున్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఇతర ప్రజాప్రతినిధులకు లేని ప్రత్యేకాధికారమైన చెక్ పవర్ గ్రామ సర్పంచులకు ఉంది. అదే విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలుగా గెలిచిన పలువురు సభ్యుల్లో కనీస విద్యార్హత ఉండటంలేదు.వీరిని స్థానిక షాడో నేతలు తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారనేది బహిరంగ సత్యం. దీంతో పాటు తమ చేతుల్లో ఉంచుకునేందుకు చాలా పార్టీల నేతలు అక్షరజ్ఞానం లేని, సామాజిక అంశాల పట్ల అవగాహన లేని వారిని పోటీల్లోకి దింపడం, గెలిచిన తర్వాత వారిని డమ్మీగా మార్చి పెత్తనాన్ని తమ చేతుల్లోకి చేస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి ఫలాల నిధులు మింగేయడం, ఎదురు తిరిగిన సర్పంచుల చెక్‌పవర్‌ను అడ్డదారిలో తొలగించడం నిత్యం సాధారణంగా మారాయి. ఇలాంటి సమస్యలన్నింటిని అడ్డుకునేందుకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేసింది. మిగతా రాష్ట్రాల కంటే అక్కడే స్థానిక సంస్థల పాలన మెరుగ్గా ఉండటాన్ని గమనించిన లోక్‌సభ అంచనాల కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రం నివేదిక సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలకు నివేదిక కోరుతూ లేఖ రాసింది. నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసినా సరైన నిర్ణయం తీసుసుకోవాలని పలుమార్లు లేఖలు రాసింది. మన రాష్ట్రం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు తగిన సూచనలు చేయాలంటూ పంచాయతీరాజ్ కార్యాలయానికి సూచించింది. అక్కడి అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆ నివేదికను రాష్ట్రానికి అందించే పనిలో ఉన్నారు. నలిగిపోతున్న సర్పంచులు జిల్లాలోని 50 మండలాలలో 795 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 1000 ఎంపీటీసీలు, 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. సర్పంచుల్లో దాదాపు 450కిపైగా అభ్యర్థులు పదో తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. ఎంపీటీసీల్లో 600 మంది వరకు ఇదే పరిస్థితి. జడ్పీటీసీల్లో 25 మంది విద్యార్హత పదిలోపే. వీటిలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వందల సంఖ్యలో ఉన్నారు. రిజర్వేషన్లు ఉండటంతో మహిళలు కూడా పోటీ చేసి గెలుపొందారు. వీరిలో చాలామందికి చదువు లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పని చేయించుకునే సామర్థ్యం ఉండదు. చాలామంది స్థానిక బడా నేతల చేతల్లో నలిగిపోతున్నారు. ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నామని పేర్కొంటూ వారి స్థానంలో షాడో పెత్తనం సాగిస్తున్నారు. సర్పంచుల దగ్గర నుంచి జడ్పీ ఛైర్మన్ వరకు ఇలా కొనసాగుతుందంటే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం జిల్లాలో సగం మంది స్థానిక ప్రజాప్రతినిదుల బడా నేతల పెత్తనంతో విలవిలలాడుతున్నారు. కాస్తో కూస్తో పెత్తందారుల అక్రమాలను తెలుసుకుని అడ్డం తిరిగితే చెక్ పవర్ లేకుండా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి అర్హత తప్పనిసరైతే చాలా గ్రామ పంచాయతీల్లో పాలన మెరుగు అవడమే కావ అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంది. -
ఆకుపాముల సర్పంచ్ ఉప ఎన్నిక ఏకగ్రీవం?
మునగాల: మండలంలోని ఆకుపాముల సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు గత యేడాది గండెపోటుతో అకాల మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీని పూరించేందుకు జిల్లా కలెక్టర్ ఇటీవల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఉప ఎన్నికకు ఎంపీడీఓ సర్వం సిద్ధం చేశారు. ఈనెల 26నుంచి ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించండం ప్రారంభించారు. ఈ ఉప ఎన్నికకు అదేరోజు గ్రామానికి చెందిన సుంకి జయచంద్రారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నేటి వరకు ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయలేదు. ఇదిలా ఉండగా సర్పంచ్ పదవిలో ఉండి మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుడు లిక్కి నాగేశ్వరరావు స్థానంలో ఆయన కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వాలని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కోదాటి అరుణ కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆదివారం సమావేశమై ఉప ఎన్నికల్లో పోటీపెట్టకుండా ఉండాలని తీర్మానం చేసింది. దీంతో ఉప ఎన్నికను ఏకగ్రీవంగా చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ముందుకు వచ్చాయి. ఈసందర్భంగా ఏకగ్రీవం చేసుకునేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షురాలు అరుణ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, నాయకులు వి.రామరాజు, పి.వెంకటేశ్వర్లు, పి.నాగేశ్వరరావు, కేసగాని వెంకటేశ్వర్లు, వి.రామిరెడ్డి, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.