జిల్లా ఉప ఎన్నికల అధికారి జ్యోతి
శామీర్‌పేట్: పోలింగ్ మొదలయ్యే సమయానికి 38 గంటల ముందే (19వ తేదీ సాయంత్రం 5 గంటలకు) ప్రచారాన్ని నిలిపివేయాలని జిల్లా ఉపఎన్నికల అధికారి జ్యోతి తెలిపారు. గురువారం శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. శామీర్‌పేట మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో యాడారం, నాగిశెట్టిపల్లి పంచాయతీల్లో సర్పంచ్‌తో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాయని వీటితో పాటు లింగాపూర్ తాండాలోని 8 వార్డుల వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్పికైనట్లు తెలిపారు. శామీర్‌పేట మండలంలో మిగిలి 20 గ్రామపంచాయితీల్లో 74 మంది సర్పంచ్ అభ్యర్ధులతో పాటు 574 మంది వార్డు సభ్యుడి అభ్యర్ధులకు 216 పోలింగ్ బూత్‌ల ద్వారా ఎన్నికలు 21న నిర్వహించి ఆదే రోజు మధ్యాహ్నం తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు.
ఒకరోజు ముందే పోలింగ్‌స్టేషన్‌కు సిబ్బంది...
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్‌కు ఒక రోజు ముందే ఎన్నికల సిబ్బంది చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించామని, మండల వ్యాప్తంగా 22 రూట్లలో 22 బస్సుల్లో ఎన్నికల సామాగ్రిని తరలించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నలుగురు జోనల్ అధికారులతో పాటు 672 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు(ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, ఎంఎస్‌టీ)లు 24 గంటలు మండల వ్యాప్తంగా పర్యటిస్తున్నాయన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు...
మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయన్నారు. అతి సమస్యాత్మకమైన అలియాబాద్, బొమ్మరాశిపేట, లాల్‌గడి మలక్‌పేట, మజీద్‌పూర్, మూడుచింతలపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి గ్రామాలను గుర్తించామని ఈ గ్రామాల్లో అదనపు పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలు(ఫ్లైయింగ్‌స్క్వాడ్) పర్యటిస్తాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్ధులతో పాటు ప్రజలు సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment