‘ఉపాధి హామీ నిధులతో గ్రామసచివాలయాలు’ | Peddireddy Ramachandra Reddy Review Meeting On NREGA | Sakshi
Sakshi News home page

‘ఉపాధి హామీ నిధులతో గ్రామసచివాలయాలు’

Published Tue, Dec 3 2019 4:48 PM | Last Updated on Tue, Dec 3 2019 6:58 PM

Peddireddy Ramachandra Reddy Review Meeting On NREGA - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల నిర్మాణం చేపడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో ఇప్పటివరకు సుమారు 2,781 గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఉన్నాయని తెలిపారు. గ్రామసచివాలయాల డిజైన్లను పరిశీలించి.. తక్కువ ధరకే సిమెంట్‌ను అందించేలా సిమెంట్ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలని ఆయన ఆదేశించారు. సిమెంట్ బస్తా ధర రూ. 240కి వచ్చేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్ ఈఎన్‌సీల ద్వారా పీఈఆర్‌టీ చార్ట్‌లను సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. చేపట్టిన పనుల పురోగతిపై నివేదికను అధికారులు బాధ్యుతంగా సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పక్కాగృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల లెవలింగ్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వివరించారు.

గ్రామీణ పారిశుధ్యానికి పెద్దపీట..
గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ నిర్మాణాలకు 30శాతం స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, మిగిలిన 70 శాతం ఉపాధి నిధులను కేటాయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,418 పనులకు అంచనాలు సిద్ధం చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వీటిలె ఇప్పటికే 145 అంచనాలకు పరిపాలనా అనుమతులు ఉన్నాయని గుర్తుచేశారు. అంతర్గత రహదారులు లేని గ్రామాల్లో 90 శాతం ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ నిధులతో ప్రహరీగోడల నిర్మాణానికి రూ.601 కోట్లు కేటాయించామన్నారు.

మెటీరియల్ నిధులను సద్వినియోగం..
కొత్తగా అనుమతి పొందిన స్కూల్ బిల్డింగ్ ప్రహరీలకు మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నుంచి నిధులు కేటాయింమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి ప్రహరీల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి నరేగా కింద రూ.15 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. మార్చి పదో తేదీ నాటికి మెటీరియల్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.3,335 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఖర్చు చేసినవి రూ.896 కోట్లు కాగా, ఇంకా వినియోగించాల్సిన నిధులు రూ.2457  కోట్లు అని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నుంచి పెండింగ్  బకాయిలను విడుదల చేయాలన్న పీఆర్ ఈఎన్‌సీ అభ్యర్థనపై పరిశీలస్తున్నామని మంత్రి తెలిపారు.

రేపు వీడియో కాన్ఫరెన్స్..
రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్హెడ్ ట్యాంక్‌లకు రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. సీపీడబ్ల్యూ స్కీం కింద పనిచేస్తున్న వారికి వెంటనే వేతన బకాయిలను చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 161 మండలాల్లో సర్వశిక్షాభియాన్‌ ద్వారా గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్తగా మంజూరు చేసిన స్కూల్ ప్రహరీ నిర్మాణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి వివరించారు. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు వెంటనే కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షాభియాన్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రితోపాటు పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్ కుమార్‌, పీఆర్ఈఎన్‌సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి, సర్వశిక్షాభియాన్ ఎస్‌ఈ నాగార్జున పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement