సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు.
‘రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాలి. సమగ్ర భూసర్వే వలన ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై సమాచారాన్ని ప్రజల్లోకి పంపాలి. ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక… వక్రీకరిస్తోంది. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తోంది. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.
చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నాం. ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుంటే దానిపై తప్పుడు రాతలు, వక్రీకరణలు చేస్తున్నారు. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment