ఉపాధిహామీ: ఏపీ సర్కార్ సరికొత్త రికార్డు.. | CM Jagan Government Created Record In Employment Guarantee Works | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ: ఏపీ సర్కార్ సరికొత్త రికార్డు..

Published Mon, Mar 29 2021 7:42 PM | Last Updated on Mon, Mar 29 2021 10:22 PM

CM Jagan Government Created Record In Employment Guarantee Works - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి పేదలకు అండగా ప్రభుత్వం నిలిచింది. అధికార యంత్రాంగం ఈ పథకం అమలులో చూపిన చిత్తశుద్ధి కారణంగా  జాతీయస్థాయిలో ఉపాధి హామీ పథకంను అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి మొత్తం 25.25 కోట్ల పనిదినాలను కేంద్రం లక్ష్యంగా కేటాయించింది. అయితే ఈ నెల (29.3.2021) నాటికే మొత్తం 25.43 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించడం ద్వారా కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కింద ఏడాది కాలంలో (29.3.2021 నాటికి) రూ.10,170 కోట్లు వ్యయం చేసింది. దీనిలో కూలీలకు వేతనాల కిందనే 5,818 కోట్లు చెల్లించింది. ఇక స్కిల్డ్ వేజెస్, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 3,965 కోట్లు వ్యయం చేసింది. 

వలస కూలీలకు అండగా ఉపాధి హామీ..
కరోనా సంక్షోభ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆదేశాలతో వారికి ఉపాధి హామీతో పనులు కల్పించారు. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో వలస కూలీలు రాష్ట్రంలోని తమ సొంత గ్రామాలకు చేరుకోవడం, అదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ వల్ల స్థానికంగా వున్న వారికి కూడా పనులు లేని పరిస్థితులను ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంది. అన్ని కరోనా నివారణ, రక్షణ చర్యలతో గ్రామీణ పేదలకు, వలస వచ్చిన కూలీలకు ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించడంలో విజయం సాధించింది.

వివిధ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు 6.35 లక్షల మందికి జాబ్‌కార్డులను మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.36 లక్షల జాబ్‌కార్డ్ లను తిరిగి యాక్టివేట్ చేశారు. అలాగే రాష్ట్రంలో వున్న మరో 2.44  మందిని అప్పటికే యాక్టీవ్‌గా వున్న కార్డులలో సభ్యులుగా నమోదు చేశారు. ఉపాధి కూలీలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లను వినియోగించేలా చేస్తూ, ఉపాధి పనులు కల్పించారు. సీఎం వైఎస్‌ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా గత ఏడాది జూన్ 9వ తేదీన ఒకే రోజు 54 లక్షల మందికి రికార్డు స్థాయిలో ఉపాధి పనుల్లో పాల్గొనడం విశేషం. 

రూ.9,871 కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు
రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌‌ హెల్త్ క్లీనిక్స్ తో పాటు అంగన్‌వాడీ, బల్క్‌ మిల్క్‌ కూలింగ్ యూనిట్లకు మొత్తం 48,969 భవనాల నిర్మాణానికి  ఉపాధి హామీని ప్రభుత్వం అనుసంధానం చేసింది. మొత్తం రూ.9,871 కోట్లతో ఈ పనులు చేపట్టింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆస్తులను సమకూర్చుకోవడం, అలాగే పేదలకు వాటి నిర్మాణం ద్వారా పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. 

పచ్చదనానికి పెద్దపీట
రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత సాధించేందుకు, రైతులకు వివిధ వర్గాలకు మేలు చేసేందుకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చింది. 37,870 మంది రైతులకు చెందిన 56,675 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, 10,706 కి.మీ. పొడవునా రోడ్డుకు ఇరువైపులా 42.83 లక్షల మొక్కల పెంపకం, 11,928 హౌసింగ్ లే అవుట్స్‌ లో 16.69 లక్షల మొక్కల పెంపకం, 2707 బ్లాక్‌లలో 4.78 లక్షల మొక్కల పెంపకం, 389 ప్రభుత్వ పాఠశాలల్లో 34 లక్షల మొక్కలు, 1327 రైతులకు చెంది పొలంగట్లపై 2.05 లక్షల మొక్కలు, రైల్వేకు చెందిన 34 ప్రాంతాల్లో 13 వేల మొక్కల పెంపకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించింది. అలాగే ప్రతి మొక్కను కాపాడేందుకు తొలిసారిగా వాటికి ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతాంగానికి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ కింద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నీటిసంరక్షణ, చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాల ద్వారా నీటివనరుల వృద్ధిపై దృష్టి సారించింది. 

సమర్థ నాయకత్వం, సమిష్టి కృషితోనే ఉపాధి హామీ రికార్డు: మంత్రి  పెద్దిరెడ్డి
రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా రికార్డు స్థాయిలో గ్రామీణ పేదలకు పనులు కల్పించడంలో సీఎం జగన్ సమర్థ నాయకత్వం, దానిని ఆచరణలో క్షేత్రస్థాయిలో అమలు చేయడంతో అధికార యంత్రాంగం చేసిన సమిష్టి కృషి వుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరో రెండు రోజుల్లో (మార్చి 31నాటికి) 26 కోట్ల పనిదినాల మైలురాయిని కూడా అధిగమిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఈ రాష్ట్రంలో పనులు లేక ఇతర ప్రాంతాలకు ఏ ఒక్కరూ వలస వెళ్లే పరిస్థితి లేకుండా చేయాలనే లక్ష్యంతోనే నిత్యం పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, కల్పిస్తున్న పనులు అర్హులైన పేదలకు చేరే వరకు విశ్రమించకుండా ముందుకు సాగాలన్న సీఎం ఆదేశాలతోనే ఈ విజయం సాధ్యపడిందని పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మించి నిధులను ఈ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
చదవండి:
ఆవిర్భావ దినోత్సవం రోజే టీడీపీకి షాక్
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement