పల్లెకు ఊపిరి పోసిన పథకం | Dileep reddy write on NREGA Scheme | Sakshi
Sakshi News home page

పల్లెకు ఊపిరి పోసిన పథకం

Published Fri, Feb 5 2016 12:24 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

దిలీప్ రెడ్డి - Sakshi

దిలీప్ రెడ్డి

సమకాలీనం
 
ప్రకృతి వైపరీత్యాలు, కునారిల్లిన వ్యవసాయం, చేష్టలుడిగిన చేతివృత్తులు, పాలకుల తప్పుడు ప్రాధమ్యాలతో చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉపాధి చూపలేనప్పుడు కోట్లాది పేద కుటుంబాలు తిండి కోసం అల్లల్లాడాయి. అప్పుడొక ఆపన్నహస్తం ‘నరేగ’ రూపంలో ఆదుకుంది. ఫలితంగా కూలిపని లభించింది. ఉన్న ఊళ్లోనే ఉపాధి, రెండు పూటలా తిండి దొరికింది. కటిక దారిద్య్రం తొలగింది. వలసలు నిలిచిపోయాయి. దారిద్య్రరేఖ దిగువనున్న వారి కొనుగోలు శక్తి పెరిగింది.

 
కారణాలేమైనా.... రాజకీయ వ్యవస్థ తలచుకుంటే ఒకే ఒక పథకం ద్వారా దేశం గతిని మార్చగలదని నిరూపించిన అరుదైన, అద్భుత కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగ). ఇప్పుడు అదే ‘నరేగ’ తరచూ వివాదాల్లోకి రావడానికి కూడా ఆ రాజకీయాలే కారణం. స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో అనేక మంచి పథకాలు, చట్టాలు దారి మళ్లి నిష్ర్పయోజనం కావడానికి కారణమైన ‘ఓటుబ్యాంకు రాజకీయాలే’ విచిత్రంగా ఇప్పుడు ఈ పథకానికి ఊపిరిపోస్తున్నాయి.
 
అందుకు కారణం, ఈ పథకం బహుజనులతో, వారి జీవనోపాధితో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ఇంకా అనేకానేక ప్రజా ప్రయోజన లక్ష్యాలతో ముడిపడి ఉండడమే. అనేక విశ్వవేదికల మీద ప్రశంసలందుకున్న ఈ పథకం, ఇటీవల  ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యంలో కూడా... నిరుపేద భారతీయుడు అన్నం ముద్దకు దూరం కాకుండా నిలబడగల్గిన భూమికను కల్పించింది. సరిగ్గా దశాబ్దం కింద ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన యూపీఏపై చివర్లో, అంటే ఎన్నికల వాకిట్లో విమర్శలు చేసిన ఎన్డీయే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు పథకాన్ని కొనసాగించింది.
 
మార్పులేవైనా మంచికైతే ఆహ్వానించదగినవే, కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం పథకం స్ఫూర్తికి విఘ్నం కలిగించే ఏ మార్పులనూ పౌర సమాజం, ముఖ్యంగా చైతన్యం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించదు. ఇప్పుడదే జరుగుతోంది. అవగాహన ఉండీ-లేక రాజకీయ కారణాలతో రాహుల్ గాంధీ లాంటివారు చేసే విమర్శలెలా ఉన్నా...  ప్రజాభిప్రాయానికి తలొగ్గిన ఎన్డీయే పాలకులు నరేగ రద్దు చేయడం సంగతలా ఉంచి, మార్పులు చేసేందుకు కూడా జంకుతున్నారు.
 
అందుకే దీనిని మెరుగుపరిచే సావకాశం లభించడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం పథకాన్ని కొనసాగిస్తూనే దాన్ని నీరు కార్చే కుయత్నాల్ని అడ్డుకోవడం, నిధులు దారిమళ్లకుండా నిరంతరం నిఘా కొనసాగించడమే ఇప్పుడు ప్రసారమాధ్యమాలు, పౌర సమాజం బాధ్యత అన్నది సామాజిక విశ్లేషకుల అభిప్రాయం.
 
నరేగ పుట్టుక, కొనసాగింపే ఓ చారిత్రక మేలు మలుపు
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల సంబద్ధత ఎంత? అనేది తరచూ చర్చనీయాంశమౌతోంది.  ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తలంపుతో అమల్లోకి వచ్చిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మనుగడలోకి వచ్చాయి.
 
కొన్ని పుబ్బలో పుట్టి మఖలో మనుగడ కోల్పోయినవీ ఉన్నాయి. పాలకపక్షాలుగా గొప్ప అవకాశం దొరికి పాతికేళ్లకు పైబడి అధికారం చేజిక్కినా... అభివృద్ధి నమూనా ఆవిష్కరించడంలో, మనిషి జీవన ప్రమాణాలు పెంచడంలో విఫలమైనట్టు పశ్చిమ బెంగాల్ ఉదాహరణగా విమర్శలెదుర్కొన్న కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలోని పలుచోట్ల ప్రతిపక్షంగా గొప్ప భూమికనే పోషించాయి.
 
ఆచరణలో వెలుతురు మసకబారినా.... విధానపరంగా ఆ కర్తవ్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో పదేళ్లు పాలనా పగ్గాలు చేపట్టిన యూపీఏ-1, యూపీఏ-2కి ఉన్న ప్రధాన వ్యత్యాసం కమ్యూనిస్టులే! కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్న యూపీఏ-1 కొన్ని జనహిత కార్యక్రమాల్ని చేపట్టి, దిగ్విజయంగా అమలుపరచింది. 2009లో అధికారం నిలబెట్టుకుంది.
 
కమ్యూనిస్టుల భాగస్వామ్యం లేని యూపీఏ-2 పూర్తిగా  విఫలమైంది.  ప్రజాప్రయోజన పథకాలు పెద్దగా రచించకపోగా అవినీతి, ఆశ్రీతపక్షపాతంతో గబ్బుపట్టి పోయింది. ఆ కమ్యూనిస్టుల ప్రత్యక్ష-పరోక్ష ఒత్తిళ్ల పొత్తిళ్లలో పురుడు పోసుకున్న అద్భుత పథకాల్లో ‘సమాచార హక్కు చట్టం-2015’ ఒకటైతే, ‘నరేగ’ మరొకటి! గ్రామీణ ప్రాంతాల్లోని నిరు పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించడం ద్వారా ఉపాధి చూపే గొప్ప లక్ష్యంతో మొదలైన ఈ పథకం, పనిలో పనిగా ఎన్నెన్నో ప్రయో జనాల్ని నెరవేర్చింది. ఇంకా నెరవేరుస్తూనే ఉంది. ఏటా వేలాది కోట్ల రూపా యలు వ్యయం అవుతున్నా శాశ్వతమైన ఆస్తులను ఏర్పాటు చేసే దిశలో ఈ పథకాన్ని నడపలేకపోతున్నారనడంతోపాటు పలు విమర్శలున్నాయి.
 
ఉత్పత్తి ఒకటి, ఉప ఉత్పత్తులెన్నో!
2006 ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 200 జిల్లాల్లో ఈ పథకం అమలును ఆరంభించారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో మరో 130 జిల్లాలకు విస్తరించారు. 1 ఏప్రిల్, 2008 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.36 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల మధ్య ఖర్చు పెడుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి రూ. 38.89 కోట్లు కేటాయించారు.
 
వ్యయం లెక్కలు తేలాల్సి ఉంది. ఈ పథకం ద్వారా దేశం మొత్తమ్మీద ఉపాధి పొందుతున్న వారిలో 51 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే! 47 శాతం మంది మహిళలు లబ్దిదారులుగా ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే గడచిన పదేళ్ల కాలంలో ఉపాధి హామీ పథకానికి రూ. 23 వేల కోట్లు ఖర్చు పెట్టారు. 156.71 కోట్ల పనిదినాల పాటు ఈ పథకం కింద ఎందరో కూలీలు ఉపాధి పొందారు. రాష్ట్రంలో ప్రతి కూలీకి సగటున రోజుకు 120 రూపాయలు వేతనంగా లభించింది.
 
ఇది ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఈ 156 కోట్ల పనిదినాల్లో 45.15 శాతం పనిదినాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉపాధి పొందినట్టు గణాంకాలున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, కునారిల్లిన వ్యవసాయం, చేష్టలుడిగిన చేతివృత్తులు, పాలకుల తప్పుడు ప్రాధమ్యాలతో చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉపాధి చూపలేనప్పుడు కోట్లాది పేద కుటుంబాలు తిండి కోసం అల్లల్లాడాయి.
 
అప్పుడొక ఆపన్నహస్తం నరేగ రూపంలో ఆదుకుంది. ఫలితంగా కూలిపని లభించింది. ఉన్న ఊళ్లోనే ఉపాధి, రెండు పూటలా తిండి దొరికింది. కటిక దారిద్య్రం తొలగింది. వలసలు నిలిచిపోయాయి. దారిద్య్రరేఖ దిగువనున్న వారి కొనుగోలు శక్తి పెరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కదలిక మొదలయింది. చెరువుల పూడిక తీయగలిగారు. భూసారం హెచ్చింది. వర్షపు నీరు నిలువచేసే చెక్‌డ్యామ్‌ల వల్ల భూగర్భజల మట్టాలు పెరిగాయి. సడక్ యోజన కింద గ్రామీణ రవాణా వ్యవస్థ మెరుగయింది. వ్యక్తిగత మరుగుదొడ్లకూ దీన్ని వర్తింపజేయడం వల్ల పారిశుధ్యానికి ఊతమిచ్చినట్టయింది.
 
శీర్ష భాగాన నిలిచిన తెలుగు రాష్ట్రాలు

మొదట్నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నరేగ అమలులో అగ్రభాగాన నిలిచింది. ఇక్కడి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రూపొందించిన పారదర్శక అమలు పద్ధతులు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచాయి. సామాజిక తనిఖీ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఒక సామాజిక సంస్థ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనంలో.. కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న నిరుపేద కూలి కుటుంబాలు అదనపు పూటలు భోజనం చేయగలుగుతున్నాయని తేల్చింది.

నిరుపేదలు దాదాపు ఏడు లక్షల ఎకరాల తమ బీడు భూములను ఉపాధి హామీ డబ్బులతో చదును చేసుకొని.. పండ్లతోటలను సాగు చేసుకుంటున్నారని తేలింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనే..  పదేళ్ల కాలంలో 898 పంచాయతీ భవనాలు ఉపాధి డబ్బులతో నిర్మించారు. మండల స్థాయిలో మరో 221 భవనాల నిర్మాణాలు చేపట్టారు.

నాలుగు వేలకు పైగా సిమెంట్ రోడ్లు.. పది వేలకు పైగా వర్షపు నీటిని నిల్వ చేసుకునే కట్టడాలు పూర్తయ్యాయి.. ఆలూరు మండలంలో పెద్ద కొత్తూరు గ్రామానికి సాగునీటి వసతి లేదు. గ్రామస్తులు నాలుగేళ్ల క్రితమే ఉపాధి పథకం ద్వారా తమ పొలాల మధ్య గుంతలు తవ్వి వాటిలో వర్షపునీటిని నిల్వ చేసుకొని.. ఆ నీటి ద్వారా పంటలు సాగుచేసుకుంటున్నారు. విస్తృతి కలిగిన నరేగలో ఇవి కొన్ని ఉదాహరణలు, విజయ నమూనాలు మాత్రమే!
 
సవరణలు, సర్దుబాట్లతో నోరుమూయాలి!

నరేగపై పలు విమర్శలున్నాయి. రాజకీయ నేతలు, అధికారులు నిధుల్ని దారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్నారనేది ఒకటి. తగిన పనిదినాలు చూపకుండా, నమోదు కన్నా తగ్గించి కూలి డబ్బులిచ్చో, ఎక్కువ లెక్కలు చూపి నిధులు నొక్కడమో... ఇలా అవినీతికి పాల్పడుతున్నారని మరో విమర్శ. ఈ పథకం వల్ల గ్రామాల్లో కూలీలు దొరక్క, కూలి రేట్లు పెరిగి వ్యవసాయం కుంటుపడిందనేది ఆరోపణ.
 
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇవి ప్రతిబంధకాలే కావని, గ్రామాల్లో రైతులు-కూలీలకు మధ్య చిచ్చు రేపి పథకాన్ని దెబ్బతీసే కుట్రని ఈ పథకాన్ని సమర్థించేవారంటారు. వర్షాలు పడగానే వ్యవసాయ ప్రాంతాల్లో నరేగ అమలు నిలుస్తుందంటారు. నిజానికి ఈ పథకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయంతో అనుసంధానించాలనే సూచన కూడా ఉంది. కూలీలకు కూర్చొబెట్టి డబ్బులు ఇవ్వడం, సోమరులు, తాగుబోతు-తిరుగుబోతుల్ని తయారుచేయడం మినహా ఈ పథకం మరే ప్రయోజనం సాధించలేదంటారు విమర్శకులు.
 
కోటీశ్వరులు సైతం వంట గ్యాస్ సబ్సిడీ రూపేణా ఏడాదికి ఐదారు వేల రూపాయలు కేంద్రం నుంచి లబ్ధిపొందుతున్నారని, ఉపాధి పథకం ద్వారా ఓ కుటుంబానికి కలిగే ప్రయోజనం ఏడాదికి ఐదారు వేల రూపాయలకు అటు ఇటుగానే ఉంటుంద న్నది సమర్థించేవారి వాదన. ఈ పథకానికి నిధులు తగ్గించాలనో, కేవలం గిరిజనులు, నిరుపేదలున్న ప్రాంతాలకే పరిమితం చేయాలనో తలపెట్టిన ప్రతిపాదనల్ని ఎన్డీయే ప్రభుత్వం విరమించుకుంది. వేతనాలు- మెటీరియల్ నిష్పత్తిని ఇప్పుడున్న 60ః40 నుంచి 51ః49 కి మార్చే ఆలోచనపైన కూడా విమర్శలున్నాయి.
 
పౌర సమాజం విమర్శలు, ఒత్తిళ్లే వెనుకడుగుకు కార ణంగా కనిపిస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఎన్ని విమర్శలు చేసినా... ఈ పథకం కొనసాగింపునకు, సంస్కరణల్లో వెనుకడుగుకు కారణం ‘ఓటు బ్యాంకు‘ రాజకీయాలే! 2009లో యూపీఏ తిరిగి అధికారం నిలబెట్టుకోవ డంలో నరేగది కీలక భూమిక అనుకుంటున్న ఎన్డీయే భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఆచితూచి అడుగులేస్తోంది. ఎవరి కారణాలు వారికుండొచ్చు, ఎటోచ్చీ ప్రజలకు మేలు చేసే పథకం, మరింత మందికి మేలు చేసేలా సానుకూల మార్పులతో కొనసాగాలన్నదే జనహితం కోరే వారి కాంక్ష!
 ఈమెయిల్: dileepreddy@sakshi.com                                     
        

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement