పేదలకు దక్కని పనులు.. నిధులు | Telugu Leaders Corruption in NREGA funds | Sakshi
Sakshi News home page

పేదలకు దక్కని పనులు.. నిధులు

Published Sun, Dec 17 2017 2:49 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

Telugu Leaders Corruption in NREGA funds - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : నిరు పేదలకు చేతినిండా పని కల్పించి.. వారు నిశ్చింతగా జీవించేందుకు ఉద్దేశించిన  ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పెద్దల జేబులు నింపే కార్యక్రమంలా మారిపోయింది. చేసేందుకు పనిలేక, పస్తులుండలేక కుటుం బంతో కలసి పనులు వెతుక్కుంటూ పేదలు వలసపోతున్నారు. పేదలకు దక్కాల్సిన ఉపాధి హామీ పనులను, నిధులను కొట్టేయడానికి అధికారపార్టీ నేతలు అనేక ఎత్తులు వేస్తున్నారు. మెషీన్లతో పనులు చేయించి కూలీల పేరుతో బిల్లులు మంజూరు చేయించుకోవడం, పనులు చేయకపోయినా చేసినట్లు చూపించడం, చేసిన పనులే మరలా చేసినట్లు చూపించడం వంటి అక్రమాలకు అంతే లేదు. ఏడాదిన్నర క్రితమే కృష్ణా పుష్కరాలు ముగిసినా ఉపాధి నిధుల నుంచి ఇంకా బిల్లులు మంజూరవుతూనే ఉన్నాయి. ఇక అధికారపార్టీకి చెందిన పెద్దలు సూచించిన గ్రామాలకు కోట్ల రూపాయల మేర పనులు మంజూరవుతుండగా పనులు అవసరం ఉన్న గ్రామాలకు మాత్రం మొండిచేయే దక్కుతోంది. అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న చోట్లనయినా నిరుపేద కూలీలకు పనులు లభిస్తున్నాయనుకుంటే పొరపాటే. అక్కడ పచ్చచొక్కాలకు అనుకూలురైన కూలీలకు మాత్రమే పనులు. మిగిలినవారికి పస్తులే..

గొల్లపూడిలో రూ.1.30 కోట్ల దోపిడీ
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో∙పుష్కరాల పేరుతో రూ. కోటి ఉపాధి నిధులకు బిల్లులు చేసుకున్నారు. విజయవాడ– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గొల్లపూడి వన్‌ సెంటర్‌ నుంచి పుష్కరఘాట్‌కు ఎప్పటి నుంచో రోడ్డు ఉంది.  దాదాపు కిలో మీటరు పరిధిలో ఉండే ఈ రోడ్డు గ్రామం పరిధిలో ఉన్నంత వరకు సిమెంట్‌ రోడ్డు, ఆ తర్వాత పుష్కర్‌ఘాట్‌ వరకు మెటల్‌ రోడ్డు ఉండేది. 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాల సందర్భంగా కన్‌స్ట్రçక్షన్‌ ఆఫ్‌ రూరల్‌ రోడ్సు(సీఆర్‌ఆర్‌) గ్రాంట్‌లో అదే రోడ్డు అధునీకరణకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో పుష్కరాల సమయంలోనే గొల్లపూడి గ్రామ పరిధిలో సిమెంట్‌ రోడ్డును వెడల్పు చేశారు. ఆ తర్వాత ఉన్న మెటల్‌ రోడ్డుపై తారు రోడ్డు వేశారు. అయితే, ఆ ప్రాంతంలో కొత్తగా మెటల్‌ రోడ్డు నిర్మించినట్టు రికార్డులు రాసుకొని  ఉపాధి పథకం నిధుల నుంచి రూ.77.76 లక్షలు బిల్లులు చేసుకున్నారు. సిమెంట్‌ రోడ్డు వెడల్పు, తారు రోడ్డు నిర్మాణం పుష్కరాలు జరిగిన 2016 ఆగస్టు నాటికే పూర్తయినప్పటికీ, అక్కడ మెటల్‌ రోడ్డు నిర్మాణానికి 2017 జులై 14, 23, 27 తేదీల్లో కూడా రూ. 72.88 లక్షలు ఉపాధి నిధుల నుంచి  అధికారులు బిల్లులు చెల్లించారు.
పైన కనిపిస్తున్న చిన్న సాగునీటి కాలువ కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలంలోని రామకృష్ణాపురంలోనిది. ఇందులో ఏకంగా 1,470 మంది కూలీలతో డ్రగ్‌ అవుట్‌ ఫాండ్‌ నిర్మాణం చేపట్టినట్టు బిల్లులు చేసుకుని అధికార పార్టీ పెద్దలు కోట్లు తినేశారు.

(పైన కనిపిస్తున్న చిన్న సాగునీటి కాలువ కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలంలోని రామకృష్ణాపురంలోనిది. ఇందులో ఏకంగా 1,470 మంది కూలీలతో డ్రగ్‌ అవుట్‌ ఫాండ్‌ నిర్మాణం చేపట్టినట్టు బిల్లులు చేసుకుని
అధికార పార్టీ పెద్దలు కోట్లు తినేశారు.)

 
పనులు లేక వలసపోతున్న పేదలు
పేదలకు కూలి పనులు కల్పించడం కోసం కేంద్రమిచ్చే నిధులను ఏదో ఒక పేరు చెప్పి పెద్దలు తమ జేబుల్లోకి మళ్లించుకుంటుంటే గ్రామాల్లో నిరుపేదలు సొంత వూరిలో పనులు దొరక్క  వలస పోతున్నారు. విశాఖపట్నం జిల్లా రామకతం మండలం మేడివాడ, దేవరపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు 20 రోజుల కిత్రం పనులను వెతుక్కుంటూ కృష్ణా , గుంటూరు జిల్లాలకు వలస వచ్చాయి. అందులో మేడివాడకు చెందిన తాతారావు, చిన్నారావు – లక్ష్మీ కుటుంబాలతో పాటు మరో ఐదు కుటుంబాలు తాము పని వెతుక్కుంటూ వచ్చిన గారపాడు గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తి కావడంతో తిరుగు ప్రయాణం కోసం శనివారం విజయవాడ రైల్వే సేష్టన్‌లో వేచి ఉన్నారు. సొంత ఊరిలో ఉపాధి పనులు లేకపోవడం వల్లే తాము పనులు వెతుక్కుంటూ పొరుగూరికి రావాల్సి వచ్చిందని లక్ష్మీ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.

పచ్చచొక్కాలకు నచ్చిన వారికే కూలిపని
అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో కూలీలకు పనులు కల్పిస్తున్నా... అక్కడ టీడీపీ నేతలదే ఇష్టారాజ్యం. వారు చెప్పినవారికే పనులు. కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వడ్డే రాజు 2007లోనే గ్రామంలో ఉపాధి కూలీగా పేరు నమోదు చేసుకున్నారు. గ్రామంలో కూలీల జాబితాలో అతనిది  నాల్గో నెంబరు. గతేడాది వడ్డే రాజు ఆరు రోజులు పాటు పని చేసినట్టు చూపి  గ్రామంలో టీడీపీ నేతే బిల్లులు చేసుకున్నారు. సోషల్‌ ఆడిట్‌ విచారణలో రాజు తాను పనిచేయలేదని, దొంగ బిల్లులు చేసుకున్నారని చెప్పడంతో గ్రామంలో టీడీపీ నేతలు, వారికి అనుకూలంగా పనిచేసే  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కక్షగట్టారు. ఈ ఏడాది రాజు ఎన్నిసార్లు పని అడిగినా ఒక్క రోజు కూడా అతనికి పని కల్పించలేదు. గ్రామంలోని దాదాపు 20 శ్రమశక్తి సంఘాలకు ఈ ఏడాది ఒక్క రోజు కూడా పని కల్పించలేదని అక్కడి కూలీలు చెబుతున్నారు.   

చేయని పనులకు బిల్లులు
గుంటూరు జిల్లా యడ్లపాడు మండల కేంద్రాన్ని అనుకొని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో రెండు పనులు (పనుల గుర్తింపు నెంబర్లు 071103710008170461, 071103710008170463) చేసినట్టు ఒక పనికి రూ. 4.41 లక్షలు, మరొక పనికి రూ. 3.20 లక్షలు చొప్పున బిల్లులు చేసుకున్నారు. ఆ చెరువులో ఈ వేసవిలో 50 మంది కూలీలతో రెండు వారాల పాటు లక్ష రూపాయల పనిచేసినట్టు ఆ పనిలో పాల్గొన్న కూలీ ఒకరు సాక్షి ప్రతినిధికి తెలిపారు.  కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో 1470 మంది కూలీలతో  డ్రగ్‌ఆవుట్‌ పాండ్‌ నిర్మాణం చేపట్టినట్లు రికార్డుల్లో పేర్కొని బిల్లులు చేసుకున్నారు. పని నెంబరు 131812805005170238. ఆ పని ఎస్టిమేట్స్‌ కాపీలో పేర్కొన్న జియోట్యాగింగ్‌ వివరాలు చూస్తే ఆ ప్రాంతంలో పని జరిగిన దాఖాలాలు లేవు. అది సాగునీటి శాఖ పరిధిలోని ఓ ప్రధాన పంట కాల్వ అని  జియో ట్యాగింగ్‌లో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగునీటి శాఖ ప్రధాన పంట కాల్వలో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టరు. ఒకవేళ పనులు చేపట్టాలంటే ముందుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతి తీసుకున్న దాఖాలు లేవు. అయినా అక్కడ పనిచేసినట్టు బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి.

లోకేష్‌ పీఏ ఊరికి రూ.3.48 కోట్లు..
ఉపాధి పథకం అమలు మంత్రి నారా లోకేష్‌ వ్యక్తిగత సహాయకుడి సొంత ఊరు తిమ్మాపురం గ్రామానికి ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో రూ. 3.48 కోట్లు ఉపాధి నిధుల బిల్లులు మంజూరయ్యాయి. తిమ్మాపురం గ్రామంలో 1167 జాబ్‌కార్డులుండగా, పొరుగు గ్రామం వంకాయపాడులో 1577 జాబ్‌కార్డులున్నాయి. కానీ ఆ గ్రామానికి ఈ ఏడాది మంజూరు అయిన నిధులు కేవలం రూ. 23 లక్షలే. అదే మండలంలో మరో 17 గ్రామాలున్నా మరే గ్రామానికీ రూ. కోటి నిధులు మంజూరు కాలేదు. తిమ్మాపురంలో ఒకే సిమెంట్‌ రోడ్డును చూపి రెండు పనులకు బిల్లులు చేసుకున్నారు.

ఫాంపాండ్స్‌లో రూ. 1,165 కోట్లు పోశారు..
ఉపాధి హామీ పథకంలో పంట కుంటలు(ఫామ్‌ పాండ్స్‌) నిర్మాణం ‘మెషిన్లతో పని– కూలీల పేరుతో బిల్లులు’ అన్న చందంగా మారింది. ఉపాధి పథకంలో చేపట్టే పనుల్లో మెషిన్ల వాడకం పూర్తిగా నిషేదం. కూలీల ద్వారానే పనులు చేపట్టాలి.  కూలీల ద్వారా జరిగే పనుల విలువను బట్టి .. 60 శాతం కూలీలకు, 40 శాతం మెటిరీయల్‌ వినియోగానికి కేంద్రం నిధులు ఇస్తోంది. కూలీలతో ఎక్కువ పని జరిగినట్టు చూపించాలని ప్రభుత్వం అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో  మెషీన్ల సహాయంతో ఫామ్‌ పాండ్స్‌ నిర్మాణం చేపట్టినా ఆ పనిని కూలీలతోనే చేయించినట్లు రికార్డుల్లో చూపి కూలీల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. ఈ రకమైన అవినీతి దాదాపు రాష్ట్రమంతటా విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ మూడేళ్లలో ఫాండ్‌పామ్స్‌ పేరుతో రూ. 1,165 కోట్ల మేర మెషిన్లతో పనిచేయించి, కూలీల పేరుతో బిల్లు చేసుకున్నారు.


– గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో రైతుల పొలాల్లో అప్పటికే ఉన్న వ్యవసాయ బావులను కూడా ఫామ్‌ పాండ్స్‌గా చూపి బిల్లులు చేసుకున్నారు.  పాలపాడుగ్రామంలో 2016 –17 ఆర్థిక సంవత్సరంలో 30 ఫామ్‌ పాండ్స్‌ త్రవ్వకాలు జరిగినట్లు  చూపి బిల్లులు చేసుకున్నారు. దీనిని సోషల్‌ ఆడిట్‌ బృందం గుర్తించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
–విజయవాడ పరిసర ప్రాంతాల్లో  సిబ్బంది, స్థానిక అధికార పార్టీ నేతలు దేవస్థానం భూముల్లో ఫామ్‌పాండ్స్‌ తవ్వినట్టు చూపి బిల్లు చేసుకుంటున్నారు. పోరంకిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఫామ్‌ పాండ్‌ నిర్మాణం చేపట్టినట్టు చూపి రూ. 16,700 బిల్లులు చేసుకున్నారు.


ఉపాధి హామీ పథకం అమలుకు గత మూడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు
సంవత్సరం                                                ఇచ్చిన మొత్తం(రూ. కోట్లలో)
2016–16                                                           3,073.80
2016–17                                                           3,940.21
2017–18(ఇప్పటి వరకు)                                       4,458.63

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement