‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు 100 రోజుల పని దినాలను కల్పించే లక్ష్యంతో అమల్లోకి వచ్చింది. యంత్రాలు వినియోగించ కుండా, కాంట్రాక్టర్లతో పనులు చేయించకుండా పూర్తిగా ప్రజల తోనే పనులు చేయించేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. 2005లో పదవ పంచవర్ష ప్రణాళిక అమలు సందర్భంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం చట్టపరంగా ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో 2006 ఫిబ్రవరి 2న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయింది.
ఉపాధిహామీ చట్టం 2005 ప్రకారం...18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో వంద రోజుల పాటు ప్రభుత్వం పని కల్పించాలి. పనిచేస్తామని దరఖాస్తు చేసుకున్న వారం దరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. వికలాంగులు, అంతరించిపోతున్న ఆదివాసి జాతులకు ప్రత్యేకంగా జాబ్ కార్డు ఇచ్చి, రెండు వారాలలోపు కచ్చితంగా పని కల్పించాలి. పని కోరినవారందరికీ పనులు చూపించాలి. పనిస్థలాలలో నీడ ఏర్పాటు చేయాలి. కార్మికులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలి. కార్మికులకు పనికి అవ సరమైన సామగ్రిని ప్రభుత్వమే కార్మికులకు ఇవ్వాలి. ఉపాధి హామీ కార్మికులు చేసిన పనికి ఏ రోజుకారోజు కొలతలు తీసుకోవాలి. పదిహేను రోజులకు ఒకసారి వేతనాలు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలి. ఆ 15 రోజులు చేసిన పనికి రోజువారీ వేతనం ఎంత పడిందో వేతన రశీదు(పే స్లిప్)ను ముందే కార్మికులకు ఇవ్వాలి. చట్టప్రకారం ఉపాధి హామీ కార్మికుడు మరణిస్తే లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, అంగ వైకల్యం పొందితే 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. అర్హత గలవారు పనికావాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి జాబ్‌కార్డ్ ఇవ్వడంలేదు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది జాబ్ కార్డుకు అర్హత కలిగి ఉన్నప్పటికీ 13 కోట్ల మందికి మాత్రమే జాబ్ కార్డులు ఇచ్చారు. వందరోజుల పని కల్పిం చకుండా 50 నుండి 75 రోజుల పాటే పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం అమలుకు ప్రత్యేక యంత్రాంగం లేదు. చాలా చోట్ల కూలీలకు నీడ కల్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు, సౌకర్యాల కోసం ఆందోళన చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ ప్రభుత్వం తొలగించడంతో జరిగిన పనిని రోజూ కొలతలు, లెక్కలు వేయడంలేదు. పదిహేను రోజులకు ఇవ్వ వలసిన వేతనాలు 12 వారాలు దాటినా ఇవ్వడంలేదు.
ఉపాధిహామీ పనులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం కేటాయింపులు బడ్జెట్‌లో 4 శాతం నుండి 1.5 శాతానికి క్రమంగా తగ్గించారు. 2021లో మోదీ ప్రభుత్వం ఉపాధి హామీపనులకు బడ్జెట్ కేటాయింపులు పెద్ద మొత్తంలో తగ్గించటమే కాకుండా చట్టంలో సవరణలు చేసింది. పనిచేసిన కార్మికులందరికీ ఒకే దఫా వేతనాలు ఇప్పటి వరకు ఖాతాలలో వేసేవారు. చట్ట సవరణ తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వేరువేరుగా వేతనాలు వేస్తున్నారు. ఇది కలిసిమెలిసి ఉండే కార్మికుల మధ్య కులాల పేర, మతాలపేర చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రలో భాగమే అనుకోవాలి! (క్లిక్: అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?)
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో కొంత ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకం కింద పనిచేస్తున్నవారిని కూలీలుగా చూడకుండా కార్మికులుగా గుర్తించాలి. నైపుణ్యతలేని (అన్ స్కిల్డ్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వ వేతనాల జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలి. సమస్యల పరిష్కారానికై కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. (క్లిక్: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?)
– జె. సీతారామయ్య
ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment