సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పనుల పురోగతిలో అలసత్వం కనిపిస్తోందని.. ఇంజినీరింగ్ అధికారులు దీనికి బాధ్యత వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను జిల్లాల్లోని సీఈలు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఆర్థికశాఖ నుంచి కూడా బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రామచంద్రారెడ్డి తెలిపారు. గత రెండు నెలల్లో ఉపాధి హామీ పనులకు రూ.1400 కోట్లు చెల్లింపులు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతున్నా, కొత్తగా ప్రారంభించిన పనులు ఎందుకు వేగవంతం అవ్వడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు.
డిపార్ట్‌మెంట్ స్థాయిలో పనులు, చెల్లింపులపై అప్రమత్తంగా వుండాలని అధికారులకు పెద్దిరెడ్డి సూచించారు. స్టీల్, సిమెంట్ కోసం డీలర్లతో జిల్లా కలెక్టర్లు మాట్లాడి అవసరమైతే క్రెడిట్‌పై ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో మనకు నరేగా కింద కేటాయించిన మొత్తాన్ని వినియోగించాలన్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు. మెటీరియల్ కేటాయింపులు ఎక్కువగా ఉంటే సీసీ రోడ్లును చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయాలు, సీసీ డ్రైనేజీలు, ప్రహరీ గోడలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దిరెడ్డి తెలిపారు. సిమెంట్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇసుక లభ్యతపై ఉపాధి పనులకు మినహాయింపులు ఇచ్చామని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఇసుకను తీసుకోవచ్చుమని ఆయన తెలిపారు.
ప్రతివారం ఎఫ్‌టీఓలు జారీ చేయాలి:
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 18 వరకు జరిగిన మెటీరియల్ వ్యయం రూ.138.68 కోట్లు అయిందని ఆయన తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు (ఫిబ్రవరి 18) వరకు మొత్తం మెటీరియల్ వ్యయం రూ. 871.18 కోట్లు అయిందన్నారు. జిల్లా స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రతివారం నరేగా పనులపై సమీక్షించాలనిప పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. గతవారం జరిపిన నరేగా కింద రూ. 51.73 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. ఉపాధి పనులకు ప్రతివారం ఎఫ్‌టీఓలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయన్నారు. వాటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మంజూరు చేసిన పనులకు ఎక్కడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగలేదన్నారు. వచ్చే అయిదు వారాలు ఇంజనీరింగ్ అధికారులు మరింత కష్టపడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చేసే వ్యయంను బట్టే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేగా కేటాయింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సుమారు వెయ్యి కోట్లు వరకు నిర్ణీత గడువు లోపు ఖర్చు చేయాలని పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎఫ్‌టీఓలను జనరేట్ చేయడం వల్ల బిల్లులు వెంటనే చెల్లించేందుకు అవకాశం వుంటుందని పెద్దిరెడ్డి తెలిపారు. మనబడి నాడు-నేడు కింద ఈ ఏడాది మొత్తం 284 మండలాలను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 5853 స్కూల్ భవనాలకు నరేగా కింద పనులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. పాఠశాలల టాయిలెట్లు, కాంపౌండ్ వల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్ కింద నాడు-నేడులో 50 శాతం పనులు ఇచ్చామన్నారు. పాఠశాలల ప్రహరీ గోడలకు ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఈ మార్చి 31 నాటికి ప్రతిపాదించిన ప్రహరీ నిర్మాణాలను నూరుశాతం పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment