ఆదాయ అసమానతలు భారత్‌లోనే తక్కువ
ఓఈసీడీ నివేదిక వెల్లడి
ప్యారిస్/లండన్: మిగతా వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఆదాయపరమైన అసమానతలు తక్కువ స్థాయిలో ఉన్నాయని ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. అయితే, సంపన్న దేశాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని వివరించింది. ఇటు వర్ధమాన, అటు సంపన్న దేశాలన్నింటితో పోలిస్తే రష్యా, చైనా, బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికాలో సంపన్నులు, సామాన్యుల ఆదాయాల మధ్య వ్యత్యాసాలు అత్యధికంగా ఉన్నాయి.
డెన్మార్క్, స్లొవేనియా, నార్వేల్లో అత్యంత తక్కువగా ఉన్నాయి. సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాసం అత్యంత సంపన్న దేశాల్లో మూడు దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉందని ఓఈసీడీ పేర్కొంది. చాలా మటుకు వర్ధమాన దేశాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. పేదరికం తగ్గింపు, ఏడాది పొడవునా గ్రామీణులకు ఉపాధి, ఆదాయం కల్పించడంలోనూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొంది.