ఇదేం ‘ఉపాధి’ హామీ
- కలెక్టర్లతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
- ఎంపీడీవోల తీరుపై మండిపడ్డ మంత్రి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు దారుణంగా ఉందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద అన్ని గ్రామాల్లో వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం అమలు తీరుపై బుధవారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉపాధి కల్పన సగటు దారుణంగా ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులుగా ఎంపీడీవోలు ఏమాత్రం బాధ్యత వహించినట్టు కన్పించడం లేదని మంత్రి మండిపడ్డారు.
గ్రామాలకు వెళ్లండి: ఎంపీడీవోలు గ్రామాలకు వెళ్లి ఉపాధి పథకానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎంపీడీవోలతో కలెక్టర్లు తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలోనూ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కరువు ప్రాంతాల్లో పేదలకు 100 రోజుల పని కల్పించాలన్నారు.
పథకం అమలులో అవినీతికి పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఉపాధి పనులను కల్పించని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు 18002001001కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులున్నారు.