
నల్లగొండ : ఇసుక పన్ను వ్యవస్థను ప్రతిజిల్లాలో ఏర్పాటు చేయాలని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, జేసీ, మైన్స్ అధికారులతో హైదరాబాద్ నుంచి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జిల్లాలో ఇసుక పన్ను వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమున్న లబ్ధిదారులకు అందుబాటు ధరలో సరఫరా చేయాలన్నారు. ఫోన్ ద్వారా కాల్ సెంటర్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దళారి వ్యవస్థ లేకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.
ఇరిగేషన్, మిషన్ భగీరథ, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు ఇసుక సరఫరాలో ఇబ్బందులను అధిగమించాలన్నారు. ఇసుక తరలించే దూరాన్ని బట్టి ధరలో మార్పులుంటాయని తెలిపారు. ప్రజావాణి తరహాలోనే పరిశ్రమల శాఖ ప్రజావాణి ఏర్పాటు చేసి అందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఇసుక రవాణాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, జేసీ నారాయణరెడ్డి, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment