మైనింగ్ ఆదాయానికి అధికారులు కృషిచేయాలి
► మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
► జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్
ఆదిలాబాద్ అర్బన్ : ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ ద్వారా రూ.4,800 కోట్లు ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది మైనింగ్ ద్వారా రూ.4,800 కోట్లు రాబట్టాలని, అందులో ఇసుక ద్వారా రూ.800 కోట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు హెక్టార్ల వరకు ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు జిల్లా స్థాయిలోనే అనుమతులు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, అనుమతి లేకుంటే జరిమానా విధించాలని స్పష్టం చేశారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని, చెక్‌పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా చేపట్టిన పనులకు ఇసుక సమస్య లేదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని తెలిపారు. వేలాల, కోనంపేట, ప్రాణహిత, నాంపల్లి, నర్సాపూర్‌లలో ఇసుకరీచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వివరించారు. వీటి ద్వారా రూ.25 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ప్రస్తుతం ఆరు రీచ్‌లలో మూడు మూత పడగా, మూడు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇందారం క్రాస్‌రోడ్డు, జైపూర్, పెద్దవాగు బ్రిడ్జి, ఆసిఫాబాద్, కలమడుగు బ్రిడ్జి, ఖానాపూర్ వద్ద చెక్‌పోస్టులు, మంచిర్యాల, ఆదిలాబాద్‌లలో మొబైల్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మైనింగ్ శాఖ ఏడీ ప్రదీప్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.